వారంతా తలా ఒక కత చెప్పేసినారు. నన్ను గూడా ఒక కత చెప్పనియ్యండి’’ అనింది చాకలింటి దీపం.‘‘నువ్వు కత చెప్తానంటే మేమేమన్నా వద్దన్నామా! ఇంతకీ ఏంకత చెప్తావ్‌?’’ అని అడిగింది పెద్దింటి దీపం.‘‘ఏం కతంటే... ? మోకాలు లోతు నీళ్ళు! మోకాలు లోతు కూడు! అనే కత చెప్తాను’’ అని చెప్పేసి,గాలికి రెపరెపమని తలాడిస్తా కతనెత్తుకునింది చాకలింటి దీపం.

పొద్దు మొలవకముందే రెడ్డోరిపల్లె నుంచి గాడిదల్ని తోలుకోని వచ్చినారు చాకలి వెంకటప్పన్న, చిన్నక్క.ఇంటింటిముందు నిలబడి,‘చాకలోళ్ళము వచ్చినాము అమ్మణ్ణీ! మాసిన గుడ్డలుంటే వెయ్యండి’ అని అడుగుతూ వెళుతున్నాడు చాకలి వెంకటప్పన్న.మురికి గుడ్డలు వేస్తే మూటకట్టి వీధిలోకి విసురుతోంది చిన్నక్క.పెదబ్బవాళ్ళ ఇంటిముందు నిలబడింది చిన్నక్క. మాసిన గుడ్డలు తెచ్చి వేసింది కల్లేణమ్మ.‘‘అమ్మణ్ణీ... బిడ్డకి పెళ్ళి పెట్టుకున్నాము. మీరేదైనా సహాయం చెయ్యల్ల. కలిగిన మారాజులు కండ్లు తెరిస్తే మేము సల్లంగా వుంటాము’’ అనింది చిన్నక్క గుడ్డలు లెక్కపెట్టుకుంటా.‘‘ఏమ్మే... మేపుతామని మొన్ననే గదా ఆవుదూడని తోలకపొయినారు. కోడె దూడని ఈని పాలు ఇస్తా వుండాది. నెలకి వెయ్యి రూపాయలకి పాలు అమ్ముకుంటా వుండారు. మల్లా ఏమి ఈ నసుగుడు?’’ అనింది సద్ది తాగతా చిన్నవ్వ.

‘‘పోనీలేవా.. ఆడబిడ్డ పెళ్ళిగదా! ఆయనకి చెప్పి తాళిబొట్టు నేను చెయ్యిస్తాను. వక్కాకు పెట్టినపుడు నీ కూతురికి పట్టుకోకా రైకా ఎత్తిస్తాను’’ అనింది కల్లేణమ్మ.‘‘నా కడుపులో పాలుపోసినావు తల్లీ! మీ ఇల్లు సల్లంగా వుండాల’’ అని చెప్పి గుడ్డలు మూటకట్టుకునింది.బొజ్జత్త వాళ్ళ ఇంటిముందు నిలబడింది.‘‘ఏమ్మే చిన్నక్కా.. వారానికి నాలుగుసార్లు వచ్చేదానివి. మూడుసార్లు అయింది. ఇపడు రెండుసార్లు వచ్చేదానికి గూడా కష్టమైపోతా వుండాదే. మేరగింజలు ఇచ్చేది కాకుండా మల్లా మేము గుడ్డలు ఉతుక్కుంటా వుండాము’’ అని సొణుక్కుంటా గుడ్డలేసింది బొజ్జత్త.‘‘మాకు గూడా సేద్దింపనులుంటాయి గదా! మొన్నటివరకు మడి నాటుకున్నాము. నిన్న బిడ్డ పెళ్ళికి ముగుర్తం పెట్టుకున్నేము. ఈపొద్దు గుడ్డలుతికేదానికి వస్తా వుండాము’’ అనింది చిన్నక్క.‘‘మీకేనా... మాకు లచ్చ పనులుంటాయి. రేపు బుధవారం పెద్దగొట్టిగింట్లో పెళ్ళి వుండాది. మాసిన గుడ్డలు కట్టుకోనిపొయ్యేదా? నేను నా కొడుకు’’ అని రచ్చకేసుకునింది బొజ్జత్త.