సినుకులు కురుస్తాండాయి. సగం దావలో వుండాను. మిట్టమధ్యాహ్నమపడు ఈ సినుకులేందో... యాడన్నా రొంచేపు నిలబడదామని సుట్టూ జూస్తి. రాళ్ళ గుట్ట తప్ప యింకేం కనపడలేదు. అట్నె బిరబిర ఎక్కితి. గుట్టపైనుండి కిందకు చూస్తిని. పసుపు పొడి ఎదజల్లినట్టుంది నేలపైకి. గుత్తులు గుత్తులుగా విరగబూసిండాయి సెండుమల్లెపూలు పసుపచ్చగా. నేలంతా పూలగంప తిన్నా కనపడతాంది. సెండుమల్లెపూల మీద సినుకులు కురస్తాంటే పల్లె పాటలన్నీ జలజల రాలిపడతా వుండాయి. మిట్టమీద నుండి కొట్టుకొస్తాండే ఈదురుగాలికి సెండుమల్లెలు ఈలపాట పాడతాండయి. రేకులు రాలిన పూలు వానలో చిన్న పడవల తిన్నా కదిలిపోతాండాయి దాగదాల వంకలోకి. ఈసారి పూలకాపు ఇరగ కాసింది. సినుకులు రొంత తగ్గినాయి. దిగుతా దూరంగా జూస్తి.ఔ ... వస్తాంది... ఆయమ్మి.. శ్యామల!పూసినకాడికి కోసిన సెండుమల్లె పూల గంప నెత్తికెత్తుకొని గట్టు దావెంబడి నడిసొస్తాండే ఆయమ్మి అందం దిక్కే సూడాలనిపిస్తాంది. అయినా మా నాయనకు తెలీకుండానే ఏందైనా సెయ్యాల... తెలిస్తే యింగేముంది... యిల్లు యిడిపించకుండా ఊరికుంటాడా... ఏంది?మొన్న ఆ సింతమాన్ల బాయికాడికి ఆయమ్మిని పిల్సుకరమ్మని పీరమ్మవ్వకు చెప్పంపితే ‘నేనట్టాటిదాన్ని కానని’ చెప్పమనిందంట. యింగ సేసేదేందుంది? అయినా నా కుర్రతనం ఎట్టా నిద్రపోతాది? ఆయమ్మిని ఆదుకునేదాకా దాని అందమే గుర్తొచ్చి సంపుతాంటే...వొలిపిరి కొడతాంటే సినుకులోపక్క... వొళ్లంతా పూల గుత్తుతిన్నా సేసుకొని గిరేసుకొచ్చే ఆయమ్మి తడిసిన సొగసు సెండ్ల వయ్యారం ఇంగోపక్క. రవ్వంతసేపు ఊపిరాడలేదు. ఆయమ్మి వెనకాల వస్తాండే కూలికొచ్చిన ఆడోళ్ళు లేకుంటే దాని పని జెప్పిందు. దానెక్క తప్పించుకొంది. 

నన్ను సూసి సూడనట్టు సూస్తా పాయె ఆయమ్మి. నేనేమో ఆయమ్మి ఎల్లబారిపోయిన దిక్కుకే చూస్తాంటి.సన్నగా సినుకులు పడతానే వుండాయి. నేనూ ఇంటిదారి పడితి. రాతిరి పండుకున్నానే గానీ నిద్రపట్టలేదు. ఆయమ్మి ఆలోచనల్లో వుండగానే సాంబశివుడు వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఆమాటా, ఈమాటా మాట్లాడుకున్నాక సిన్నగా గుడిసెల కాడ వుండే శ్యామల యిషయం తీసుకొచ్చిపెడితి. సాంబుడు పడిపడి నవ్వే.‘నవ్వాకు... ఎందన్నా వుంటే సెప్పిపారేయ్‌... నువ్వు ఆమంతన నవ్వితే నే ఏమనుకోవాలా...’ అంటి రోంత ముఖం మాడ్చుకొని. సాంబుడు నా మాటల్ని పట్టించుకోకుండా నవ్వుతూనే వుండాడు.సాంబశివుడు మా సొంత మనిషి. నాకంటే రెండు మూడేళ్ళు పెద్దోడే. అయినా ఇద్దరం కులాసాలు పడతానే వుంటాం. నా సిన్నపడెప్పడో లక్కిరెడ్డిపల్లె జాతరకు మా నాయనోళ్ళు పోయినపడు ఆడుండే గంగమ్మ గుడికాడి సత్రం కాడ ‘సాంబుడు’ కనపడి ‘‘దిక్కులేరయ్యా.. నేనూ మీ ఎద్దల బండి ఎనకాలే వస్తాన’’ని వెంటబడితే తీసుకొచ్చి పెంచినారు. ఆ పనీ ఈ పనీ చేయిస్తా సాకినారు. మనిషి మంచోడు. శానా మెతక. మా ఊర్లో నాకిష్టమైన మనిషి కూడా. పొలంకాడ్నే వుండి కాపుకాస్తాడు. పైరుకు నీళ్ళు పెడతాడు. పని పట్టుకుంటే సేసేదాకా యిడిసిపెట్టడు. అందరూ ‘తిక్క సాంబుడు’ అంటారు. అయినా దేన్నీ పట్టించుకోడు. సాంబుడి కత సాంబుడిది. తన పనేందో.. పాటేందో... అంతే!