అమెరికా నుంచి వొచ్చాడు అమర్‌.అతడికోసం తల్లిదండ్రులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వొచ్చారు. తమ్ముడి కోసం అటు ఇటు చూశాడు అమర్‌.‘‘తమ్ముడేడి?’’ తండ్రిని అడిగాడు.తల్లి కళ్ళలో నీళ్ళు ఉబకడం చూసి కొంచెం కంగారు పడ్డాడు.నిశాంత్‌కు ఏమైంది? అనారోగ్యంతో హాస్పిటల్లో వున్నాడా? చెప్పా పెట్టకుండా ఎటన్నా వెళ్ళిపోయాడా?ఇంట్లో నుంచి పారిపోవడం నిశాంత్‌కు చిన్నప్పటి నుంచి వుంది. పదేళ్ళ వయస్సులో ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడ వెతికినా, పేపర్లలో టీవీల్లో ప్రకటనలు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. నాన్న జేబులో నుంచి రెండొందలు తీసుకుని వెళ్ళాడు. ఆ డబ్బు ఎన్నాళ్ళు వాడి అవసరాల్ని తీరుస్తుంది? నాన్న నిబ్బరంగానే వున్నాడు గాని, అమ్మ తల్లడిల్లి పోయింది. రోజూ ఏడుస్తూనే వుంది. పెరిగిన జుట్టు, మాసిపోయిన బట్టలతో ఆర్నెల్లు తరువాత ఇంటికి వొచ్చాడు. మరోసారి ఇంటర్‌ చదివే రోజుల్లో నాన్న మోటార్‌ బైక్‌ కొనివ్వలేదని అలిగి వెళ్ళి పోయాడు. రెండు నెలల తరువాత తిరిగి వొచ్చాడు. ఇంటర్‌ తప్పినప్పుడూ అలాగే చేశాడు....వాడికి నచ్చనిది ఏది జరిగినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూనే వున్నాడు. తప్పులు తను చేస్తున్నాడనే భావన వాడికి ఎప్పుడూ లేదు. తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టడం వాడికి ఆనందం...‘‘ఇంటికి వెళ్ళాక నిశాంత్‌ గురించి మాట్లాడకుందాంలే!’’ అన్నాడు బసవపున్నయ్య కొడుకుతో.

తల్లిదండ్రులకు నాలుగేళ్ళ తరువాత పెద్దకొడుకును చూస్తున్నామన్న ఆనందం వోవైపు మరోవైపు చిన్నకొడుకు గుర్తుకు వొచ్చినప్పుడల్లా విషాదఛాయలు మళ్ళీ మొహాల్లో కన్పిస్తూనే వున్నాయి. అమెరికా సంగతులు అమర్‌ చెబుతూ వుంటూ వింటూనే వున్నారే గాని మనస్సు మరో విషయమై తారట్లాడుతూ వుంది.వనస్థలిపురంలో వున్న ఇంటికి చేరుకున్నాక నిశాంత్‌ చేసిన ఘనకార్యం గూర్చి చెప్పుకుపోయాడు బసవపున్నయ్య.‘‘అమ్మాయి మొహం మీద సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ పోశాడా? ఎందుకు?’’ తాగుతున్న కాఫీ కప్పును ప్రక్కనపెట్టి అడిగాడు అమర్‌.‘‘నీలిమ అనే అమ్మాయిని నిశాంత్‌ ప్రేమించాడు. ఆ అమ్మాయికి సావేరి అనే అమ్మాయి స్నేహితురాలు. నిశాంత్‌ బలాదూర్‌గా తిరుగుతాడు, నిలకడ తక్కువని కోపం వస్తే ఇల్లు వదిలి పారి పోతాడని, చదువు మీదేకాదు. ఏ విషయంపై శ్రద్ధలేని కుర్రాడితో ప్రేమలోపడితే చిక్కుల్లో పడతానని నీలిమకు నూరి పోసిందట... ఆ విషయం తెలిసి మీ తమ్ముడు సావేరి మీద కక్ష పెంచుకుని మొహం మీద యాసిడ్‌ పోశాడు. ఆ అమ్మాయి హాస్పిటల్లో వుంది. మనవాడు జైల్లో వున్నాడు. బెయిల్‌ కూడా వొచ్చే అవకాశాలు తక్కువంటున్నారు లాయర్లు.. ఐ.పి.సి. 326 ఎ క్రింద కేసులు బుక్‌ చేశారు... నేరం నిర్ధారణ అయితే పదేళ్ళు తక్కువ కాకుండా జైలుశిక్ష పడుతుందట!’’ చెప్పుకు పోయాడు బసవపున్నయ్య.