ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద దొంగతనమది. అయినా యిరవై ఒక్క ఏళ్లపాటు ఆ విషయాన్ని తొక్కిపెట్టి వుంచారు అధికారులు. ఆ దొంగలెవరు? ఆ పని ఎలా చెయ్యగలిగారు? అసలా ప్లాన్‌ వేసిందెవరు? వగైరా విషయాలు చాలామందికి తెలియవు. లియోనార్డో డావించి గీసిన ‘మోనాలిసా’ ఫ్రాన్స్‌లోని లూర్‌ (ఔౌఠటట్ఛ) మ్యూజియం నుండి ఆగస్టు 21, 1911 నాడు దొంగిలించబడింది. అప్పటికి దాని ఖరీదు 5 లక్షల డాలర్లు. ఆ ఒక్క బొమ్మతో ఎంతమంది కోటీశ్వరులయ్యారో. మొత్తం మీద, ఆ తర్వాత మరే దొంగతనమూ చెయ్యక్కర్లేదు. విలాసవంతమైన కొనుక్కుని, నచ్చిన సుందరాంగిని పెళ్లి చేసుకుని, నౌకర్లు చాకర్లతో కాలుమీద కాలు వేసుకుని హాయిగా గడపొచ్చు.

 ‘‘అసలు కథ నీకు తెలియదు. రెండేళ్ల తర్వాత ఆ దొంగ రెడ్‌ హాండెడ్‌గా పట్టుబడ్డాడు. బొమ్మ మళ్లీ మ్యూజియంకే చేరింది. చోరాగ్రేసురుడు మూడేళ్లు జైల్లో గడిపాడు గదా’’ అంటారు మీరు. అవునా?అవును. అధికారికంగా - అంటే అధికారులిచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారం - అందరికీ తెలిసిందదే. బొమ్మ దొరికింది. దొంగ పట్టుబడ్డాడు. కటకటాలు లెక్కపెట్టాడు. అన్నీ నిజమే. కాని నేను మాట్లాడుతున్నది మోనాలిసా గురించి.‘సిల్లీ’గా కనిపించిన ఈ దొంగతనం వెనక ఒక అంతర్జాతీయ మాఫియా హస్తం వుందనీ, కొన్ని బిలియన్ల డాలర్లు చేతులు మారాయనీ బహుశా మీకు తెలిసుండకపోవచ్చు. ఈ రహస్యం నాకెలా చేరిందంటారా? ఆ మాఫియాలోని ముఖ్యులందరూ మరణించిన కొన్ని సంవత్సరాలక్కాని పత్రి కల వాళ్లకీ విషయం ‘లీక్‌’ చెయ్యొద్దని నిర్ణయం జరిగిందప్పుడే.సృజనాత్మకత వున్న వాళ్లే కళాసృష్టి చెయ్యగలరని మీకు తెలుసుగా. మరి ఈ చోరకళాగ్రేసరుడు ఎంతగొప్ప స్రష్ట, ద్రష్ట అయివుంటాడు! ‘మోనాలిసా’ను గీసిన డావించి జీనియస్‌ అనుకుంటే, దాన్ని దొంగిలించిన వాడు అంతకన్నా పెద్ద జీనియస్‌. ఇక ఆ కథాక్రమం వింటారా!దొంగతనం చేసినవాళ్లకు మొదట్లో దాన్ని అమ్మే ఉద్దేశం లేదు. అంతటి అపురూపచిత్రాన్ని దొంగి లించడంలో వున్న ‘థ్రిల్‌’ కోసమే చేశారు. కొన్నాళ్లది కనిపించకుండా వుంటే ప్రపంచ వ్యాప్తంగా కళాభిమానుల్లో చెలరేగే కలకలం చూసి ఆనందిద్దామనుకున్నారు. నిజానికి దాన్ని ఎవరు మాత్ర మేం చేసుకుంటారు. ఎవరి వద్ద వున్నా అదో తెల్ల ఏనుగే (వైట్‌ ఎలిఫెంట్‌) గద.

ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీ నోట్లన్నీ ఒకచోట గుట్టగా పోసినా దాని విలువ చెయ్యవు. కొన్నాళ్లు ఈ ‘తమాషా’ చూసి తామే స్వయంగా మ్యూజియంకు తిరిగి యిద్దామని కూడా అనుకున్నారు. కాని, అనుకోకుండా ఆ బృందంలోని సభ్యుడొకడు (వాడికి ముఖ్యబాధ్యతలు కూడా అప్పగించలేదు) దాన్ని తీసుకుని పారిపోయాడు. ఆ బొమ్మను దోచటం అసంభవం. ‘వాణ్ణి వెదికి పట్టుకునే ప్రయత్నంలో తాము పోలీసులకు చిక్కితే మరీ ప్రమాదం’’ అనుకుని వాడి ఖర్మానికి వాణ్ణి వదిలేశారు. ఎట్లాగూ కొద్ది రోజుల్లో పోలీసులకు చిక్కకపోడు.