రైల్వేస్టేషన్‌ జనంతో కిటకిట లాడుతోంది. ఊకపోస్తే ఊకరాల్దు అన్నట్టు రైల్వే స్టేషన్‌లో జనం. కూర్చున్నోళ్ళు కూర్చున్నారు. నిలబడినోళ్ళు నిలబడి వున్నారు. భార్యాపిల్లలతో జగం రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టాడు. జనాన్ని చూసిన జగంకి గుండె ఆగినంత పనైంది. ‘‘ఇదేటి ఇంతమంది జనం. స్టేషనుకి అప్పుడప్పుడూ వచ్చినా ఇంతమందిని సూడనేదు. కిటకిటలాడతంది టేషను’’ అని మనసులో అనుకున్నాడు జగం.జనం మధ్యలో స్టేషన్‌లోని టీ, కాఫీ, వాటర్‌ పేకెట్లు, సమోసాలు, బిస్కెట్టు పేకెట్లు, గుట్కాలు అమ్మేవారు జనాలను తోసుకుంటూ గుద్దుకుంటూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. వలసలు వెళ్ళిన వారితో నిండిన స్టేషన్‌లో జనం మధ్య నుండి దాటుకుంటూ జగం టిక్కెట్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్ళి టిక్కెట్లు తీసుకొనివచ్చాడు. టిక్కెట్లు తీసుకొని వస్తున్న జగంకి కిష్టయ్య మామ కనిపించాడు.‘‘ఏటీ జనం కిష్టయ్య మామ? ట్రెయిన్‌ పడతాదా? మన మెళ్ళగలమా? బండి ఎన్ని గంటలకి వత్తాదో?’’ జగంలో వలస వెళ్ళడానికి మొదటిసారి బండెక్కు బోతున్న ఆందోళన.

ఎవరో చెప్పేరు ట్రెయిన్‌ గంట లేటని. జగం సామాన్ల బస్తా మీద కూర్చోని ఆలోచనల్లోకి జారిపోయాడు.‘‘గవర్నమెంటు అందరికీ ఇళ్ళు ఇత్తన్నాది. రామమందిరం దగ్గర మీటింగుంది. అందరూ రావాలి’’ అని దండోరా వేసాడు తవిటయ్య. మీటింగంటే ముందుంటాది నీలమ్మ. అందరికీ ఇళ్ళు అనగానే సంబరపడిపోయింది నీలమ్మ. మండల అధికారులు వచ్చి మీటింగు పెట్టారు. పూరిళ్ళు వున్నోళ్ళందరికీ ప్రభుత్వమే ఇళ్ళు మంజూరు చేస్తుంది. నలభై వేల రూపాయలు లోనుగా వస్తుంది. ప్రభుత్వం ముప్ఫై వేల రూపాయలు, బ్యాంకు ద్వారా మరో పది వేలులోను వస్తుంది. అందరూ దరఖాస్తు చేయాలని చెప్పారు.అధికారులు ఇచ్చిన దరఖాస్తు తీసుకుని నీలమ్మ ఇంటికి వచ్చింది. ‘‘సోంబాబన్నయ్య ఇల్లు కడతాడట, మనమూ కట్టుకుందుము. ఆలు కడితే మనకి గోడ కలిసొస్తాది’’ అన్నాది నీలమ్మ. ‘‘ఆలు ఎగురుతున్నారని నువ్వు ఎగరొద్దు ఇల్లు బట్టిన పిల్లుంది దాని సంగతేటి సూడు ముందు’’ అన్నాడు జగం.‘‘గాలంతే భయం, అగ్గంతే భయం. వానొత్తే భయం. పురిపాకల వుండనేక పోతన్నాము. నలభై వేలు వత్తాది. ఆలగోడ కలిసొత్తాది. అక్కడికది సరిపోద్ది’’ అంటూ చేతిలో వున్న తపేలాను చిరాగ్గా పెట్టి మీద ఎత్తింది నీలమ్మ.

‘‘మా తాత తండ్రుల నుండి పురిపాకల వుంతన్నాము. అప్పుడు లేని భయం నీకే వచ్చింది. ఇల్లు కట్టడము అంత సులువనకుంతన్నావేటి’’ అంటూ చిరాగ్గా జగం మంచంపై వాలాడు.‘‘అందరూ అటు తూర్పంత నువ్వు ఇటంతావు. గవర్నమెంటు అవకాశమిచ్చి నప్పుడు కట్టుకోవాలి. ఊరందరూ కడతామంతుంతే నువ్వొద్దంతన్నావు. మనిషన్నోడు మారాల నువ్వు మరి మారవు. ఊరందరూ స్లేబిల్లుల వుంటే నువ్వు పాకలుందవు గాని ఏమ్మనిషివో ఏటో’’ అని నీలమ్మ సిర్రుబుస్సులాడింది.