‘‘ఏమయింది రమా? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు?’’ అడిగాడు ఆశ్చర్యంగా వాకింగ్‌ నుండి ఇంటికి వచ్చిన రంగబాబు.‘‘ఎవరే వీళ్ళంతా? వీరంతా ఎందుకు మనింట్లో ఉన్నారు? వారి ముఖాల్లో ఆశ్చర్యం ఏమిటి? ఇంతకీ ఇంట్లో ఏం జరిగిందో చెప్పకపోతే నాకు పిచ్చి పట్టిపోతుంది’’ అన్నాడు నుదురు రుద్దుకుంటూ రంగబాబు. అతని బాధ చూడలేకపోయిందేమో ఒక ఇల్లాలు ‘‘ఏమీ లేదండీ! మీ ఆవిడ ఉదయం బయట ఊడ్చి ముగ్గు పెడుతుంటే ఎవరో ఒక వెధవ బండిమీద నుండి వచ్చి మెడలో మంగళసూత్రాల గొలుసు లాక్కుపోయాడట. పాపం! మీకు చెబితే మీరెంత బాధపడతారో అనేదే తన బాధ’’ అంటూ ఆపింది.‘‘ఆ! అవునా రమా? నీ మెడలో గొలుసు లాక్కుపోయాడా? ఎలా జరిగింది. నువ్వు కేకలు పెట్టలేదా? ఇంతకీ నీ దగ్గర’’ అని పూర్తికాకుండానే...‘‘మీరేం బాధపడకండి. నాకు తెలుసు, మీకెంత బాధగా ఉంటుందో? నన్ను క్షమించండి. మీరు ఎప్పుడూ అంటుంటారు. అంత చీకటిలో ముగ్గు వేయకే రోజులు బాగోలేవు అని. కానీ పాపిష్టిదాన్ని నేనే మీ మాట వినకుండా ఈ రోజు ఇంతటి అవాంతరం తెచ్చుకున్నాను’’ అంది మరింతగా ఏడుస్తూ.అంతలో ఒకాయన ముందుకు వచ్చి ‘‘ఇక ఆలస్యం చేయకండి. ఆ దొంగ దూరంగా పారిపోతాడు. మీరు వెంటనే పోలీసులకు కంప్లయింట్‌ ఇవ్వండి. ఇలాగే నా స్నేహితుని ఇంట్లో కూడా జరిగింది. కాకుంటే వెంటనే కంప్లయింట్‌ ఇవ్వడంతో దొరికింది. కాకుంటే వాళ్ళది కాకుండా ఏదో ఒక గొలుసు అయితే ఇచ్చారు. అని తను పెద్ద పని పూర్తిచేసినట్లుగా వెళ్లిపోయాడు.చుట్టుపక్కల వారు కూడా దాన్నే సమర్థించారు. రంగబాబుకు అయోమయంగా ఉంది. ఏమీ తోచడం లేదు. బిత్తర చూపులు చూస్తున్నాడు. 

అది గమనించిన రమ ఇక లాభం లేదని గ్రహించి లేచి చెప్పులు తొడుక్కుని సమాయత్తమయింది. ఆమెను ఒంటరిగా పోలీసు స్టేషన్‌కు పంపడం ఇష్టంలేని రంగబాబు వెంట బయలుదేరాడు.ఫఫఫ‘‘చెప్పండి సర్‌!’’‘‘నా గొలుసు పోయిందండీ ఇన్‌స్పెక్టర్‌ గారూ’’ గొల్లుమంది రమ.‘‘ఎప్పుడు పోయిందండీ?’’ అని అడిగాడు రంగబాబు వంక చూస్తూ..‘‘ఆయనకు తెలియదండి. వారు ఉదయమే వాకింగ్‌కు వెళతారు. ఆయన వెళ్లగానే నేను వాకిలి ఊడ్చుకునే పని ప్రారంభిస్తాను. ప్రతిరోజులానే ఈరోజు కూడా నేను ముగ్గు వేస్తుంటే వెనక నుండి ఎవరో వచ్చిన అలికిడి అయ్యిం దండి. వెనుదిరిగి చూసే లోగానే నా మెడలో గొలుసు లాక్కుపోయారు. చూడండి నా మెడకు ఎంత గాయం అయ్యిందో?’’ అని మళ్లీ వలవలా ఏడ్చింది.‘‘ఊరుకోండమ్మా! మేము ఇన్వెస్టిగేట్‌ చేస్తాం. కంప్లయింట్‌ ఇచ్చారు కదా? అది జరిగింది ఈ ఉదయమే అంటున్నారు కాబట్టి పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు వెళ్ళొచ్చు. దొరకగానే మీకు ఫోను చేస్తాను. అంటూ రంగబాబుకు ఒక షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి పంపేడు ఇన్‌స్పెక్టర్‌.