మిలటరీ బూట్లు, మోకాళ్ళ వరకూ మేజోళ్ళు, ఖాకీ నిక్కరూ, అప్పటికే చెమటకి తడిసిన తెల్లచొక్కాతో వంగి గుడారంలోకి దూరిన ఆరడుగుల క్లార్క్సన్‌ దొర, తలమీది టోపీని రాటకి ఉన్న మేకుకి తగిలించి అక్కడ ఉన్న ఒకే ఒక కుర్చీ మీద నిటారుగా కూర్చున్నాడు. నేలమీదున్న మంచినీళ్ళ కూజాని ఎత్తి వంచుకొని గడగడా తాగాడు. కూజాని కిందపెట్టి రుమాలుతో మొహం తుడుచుకొని ఎదురుగా టేబిల్‌ మీద ఉన్న రిజిస్టర్‌ని ముందుకు లాక్కున్నాడు. ఆనాడు రామయ్య పంతులు మేలుప్రతిలోకి ఎక్కించిన రీడింగ్స్‌ని చిత్తుప్రతితో సరిచూస్తూ పెన్సిల్‌తో టిక్కులు పెట్టడం మొదలుపెట్టాడు.చేతులు కట్టుకొని పక్కనే నిలబడ్డ రామయ్య ఊపిరి బిగబట్టి ఎండకి ఎర్రబడ్డ దొర మొహంలోకి ఆత్రుతగా చూస్తున్నాడు. అన్నిచోట్లా టిక్కులు పడితే ఆ రోజుకి గండం గడిచినట్టే, ఒక చిన్న తప్పు దొర్లినా చివాట్లు తప్పవు. పెన్సిలు ముందుకి కదులుతోంది; టిక్కులు పడుతున్నాయి.సరిచూడడం ముగించి ‘‘వెల్‌డన్‌, రామయ్యా’’ అన్నాడు దొర. దొరకి కోపం వస్తే ‘‘రామయ్యా’’ అనడు. ‘‘వాటిస్‌ దిస్‌ మిస్టర్‌ పంతులూ?’’ అంటాడు.మలేరియా బారినపడి మధ్యలో వెళ్ళిపోయిన మెక్ఫర్సన్‌ దొరయితే అన్నీ బాగున్నా ‘‘వెల్‌ డన్‌’’ అని చచ్చినా అనడు. క్లార్క్సన్‌ దొర మాత్రం అలా కాదు. పనులన్నీ అతను అనుకున్నట్టుగా జరిగిపోతున్నంత కాలం అందరితోనూ మృదువుగానే మాట్లాడతాడు - ముఖ్యంగా సాయంత్రం పూట - ఒక మోతాదు రమ్ము లోపలికి వెళ్ళాక.ఉప్పు కలిపిన నిమ్మరసం గ్లాసుని ట్రేలో పట్టుకుని వంటవాడు కొండయ్య గుడారంలోకి ప్రవేశించాడు.

పంతులువైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘ఎలా ఉంది పరిస్థితి?’’ అని దానర్థం. పంతులు కను సైగతోనే ‘‘దొర చేతికి నువ్వే ఇవ్వు’’ అని సూచించాడు. గ్లాసు అందించి వెళ్ళిపోయాడు కొండయ్య. పప్పుపులుసు మరుగుతున్న వాసన గుడారానికి చేరుతున్నది. ‘‘ఇప్పుడింక జమాఖర్చుల చిట్టా ఆవర్జా తీస్తాడు’’ అనుకున్నాడు పంతులు. అదే జరిగింది. మళ్ళీ టిక్కులు పడుతున్నాయి. ఒకచోట పెన్సిలు ఆగింది. పంతులు మళ్ళీ ఊపిరి బిగబట్టాడు.‘‘కట్టెలు తెచ్చే సవరవాళ్ళకి నాలుగణాలు అనుకున్నాం కదా, ఆరణాలు ఎలా అయింది?’’ అన్నాడు దొర తలెత్తకుండానే.