గుబురుగా పెరుగుతున్న సుంకిరేసి పొద పక్కనుంచీ ముందుకు తిరిగాక పెద్దగా ఆర్తనాదం చేస్తూ బాబాసామి వెనక్కు గెంతాడు. అతడి చేతుల్లోంచి హేండిలు జారిపోతూనే సైకిలు పక్కకు వొరిగి దబ్బున మరో పొదపైన పడింది. పొదలోంచీ తొండలూ, మిడతలూ కకావికలై పరిగెత్తాయి. పొదకవతలినుంచీ బొంతల గద్దొకటి రివ్వున పైకెగిరింది. చెట్ల కొమ్మలపైన కూర్చున్న కాకులు పెద్దగా అరిచాయి.‘‘యేమన్నా! యేం జరిగిందన్నా?’’ అని అడుగుతూ కిట్టమ్మ బెంబేలు పడిపోయింది.పెదవులూ, నాలుకా యెండుకు పోవడంతో బాబాసామికి మాటలు పెగల్లేదు. నిప్పులు తొక్కు తున్నట్టుగా రెండు మూడు సార్లు ముందుకూ వెనక్కూ గెంతాడు. తరువాత సైకిలును లేవదీసి వెనక్కు తిప్పుకుంటూ ‘‘పోదాం పద కిట్టమ్మా!... ఆ పక్కన... పీనిగ...’’ అంటూ సగం సగం మాటలకు హావభావాల్ని కలిపి పూర్తి వార్తను ప్రసారం చేశాడు బాబాసామి.కిట్టమ్మ లావుపాటి శరీరం పొదల మధ్యలో వున్న మట్టిబాటపైన రుబ్బురోలు దొర్లుతున్నట్టుగా పరిగెత్తింది. రెండు బారలు పరిగెత్తాక వున్నట్టుండి శరీరమంతా బండబారిపోయినట్టుగా ఆగి పోయి ‘అది... అట్ల... జూడు... ఆ గుడ్డ... ఆ పేలిక’’ అంటూ పొడిపొడి మాటలకు యేడుపును జతచేసిందామె.

‘‘దాంతో మనకేం పనిలే.... నువ్వు పద.... పరిగెత్తు...’’ బాబాసామి సైకిలును తోస్తూ హెచ్చరించాడు.‘‘అది గాదన్నా... అది... ఆ చొక్కాయి గుడ్డ... అది’’‘‘అది చొక్కాయి గుడ్డేలే గానీ పద...’’ అని సర్దిచెబుతూ పరిగెత్తబోయిన బాబాసామి వెంటనే నాలిక కరచుకుని ‘‘కొంపదీసి అదేమైనా యేకాంబరందా!’’ అని ప్రశ్నించాడు. నిలువునా వణికి పోతున్న కిట్టమ్మను జూశాక విషయం అర్థముపోయినట్లుగా ‘‘అయ్యయ్యయ్యో! యెంత పని జరిగిపొయ్యింది కిట్టమ్మా!’’ అని యెలుగెత్తి ఆక్రోశించాడు. యింతలో మరచిపోయిన విషయ మేదో జ్ఞాపకం వచ్చినట్టుగా ‘‘ఆ దొంగముండా పులి యింగా ఆడ్నేవుండాదేమో! లగెత్తు లగెత్తు...’’ అని చెబుతూనే సైకిలు పైకెక్కి గబగబా ఫెడల్లు తొక్కబోయాడు. ‘‘నేనన్నా నేను కూడా’’ కిట్టమ్మ గూడా అరుస్తూ నేల రంధ్రాలు పడిపోతుందేమోనన్నట్టుగా పాదాల్ని భూమిపైన మోపుతూ పరిగెత్తింది.బైపాస్‌రోడ్డు దగ్గరి నుంచీ కొండలపైదాకా వ్యాపించిన అడవి నీరెండలో పచ్చల ద్వీపంలా మెరుస్తోంది. యేపుగా పెరుగుతున్న చెట్ల మధ్య పిచ్చిమొక్కలు పొదలుగా బలుస్తున్నాయి. మనుషులు నడవడం వల్ల యేర్పడిన సన్నటి మట్టిబాటలో రకరకాల జంతువుల పాదముద్రలు గజిబిజిగా కలిసిపోతున్నాయి... గస బోసుకుంటూ బైసాస్‌ రోడ్డులోకొచ్చి పడ్డాక వెనుదిరిగి, స్టాండుపైన కిందికి జారిపోతున్నట్టుగా కూర్చున్న కిట్టమ్మతో ‘‘యెంత పనిజేసినావు కిట్టమ్మా! పనికిరాని ముండ్ల కట్టెలకోసం బంగారట్లా మడిసిని పోగిట్టుకుంటివే!’’ అని వాపోయాడు బాబాసామి.కిట్టమ్మ రెండు చేతులూ పైకెత్తి ‘‘అయ్యయ్యో! యింగ నేనేం జేసేదిరా దేవుడా!’’ అని యెలుగెత్తి యేడ్చేసింది. స్టాండుపైన్నుంచీ పట్టుజారి తారురోడ్డుపైన ఢబేలుమని పడ్డాక ‘‘దీంట్లో నేను జేసిందేముండాదన్నా!.... నాదేం తప్పుండాది దీంట్లో..’’ అని మళ్లీ పెద్దగా రాగం తీసింది.