చుక్కలాకాశం మిణుకు మిణుకు మంటా వుండాది.కొన్ని మోడాలు మంగళగుట్ట మింద కూర్చోని అరువులు చేసుకుంటా వుండాయి. మాపటేల రెండు పదున్ల వానపడింది. చెమ్మగిల్లిన నేల సంపంగి పువ్వు మాదిరి పలవరిస్తావుండాది. పెద్దగాలి వీచేసరికి యాపమాను కొమ్మల్ని ‘కిర్రుకిర్రుమని’ ఊపింది.ఆ గాలికి దీపాలన్నీ ఒక పక్కకి వొరిగిపోయి రెపరెపలాడినాయి.‘‘అబ్బబ్బా... ఏంగాలమ్మా! ఎగిరిపొయ్యేట్టు వుండామే’’ అనింది ఒగపక్కకి వొరిగిపోయి మల్లా నిలబడతా చిలక ముక్కు దీపం.చిలకముక్కంత అందంగా వుండాది దాని వెలుగు. ‘‘ఒసేయ్‌... చిలక ముక్కుదానా!’’ అని మిగిలిన దీపాలు పిలస్తావుంటే, దానికి పిర్రలమింద పలక కొట్టినంత సంతోషంగానూ, కొంచెం పెగ్గిగానూ వుంటింది. చిలకముక్కంత వెలుగుని వయ్యారంగా తిపకుంటా నడస్తా వుంటింది.‘‘చూడు... మోడాలు ముసురుకుంటా వుండాయి. మల్లా వానొచ్చేట్టుండాది’’ - ఆకాశం కల్లా చూస్తా అనింది ఎపడూ కప్పూరవాసనతో పలవరిస్తా వుండే కప్పూర దీపం.‘‘పడితే మంచిదే! తొలికారుకి సరిపడా నీళ్ళొస్తాయి కొత్త చెరువులోకి’’ అనింది ఆశిగా చిలకముక్కు దీపం.‘‘చెరువు నిండితే నీకెందుకు? నిండకపోతే నీకెందుకు? నువ్వేమన్నా సేద్దిం చేస్తావుండావా?’’ అనింది కప్పూర దీపం.

‘‘అట్లంటావు ఏంటక్కా! రైతు బాగుంటేనే గదా, రాజ్జెం బాగుండేది’’ అనింది చిలకముక్కు దీపం.‘‘ఏంది బాగుండేది? ఈ రాళ్ళసీమలో ఎపడు వానపడితిందో తెలీదు? ఎపడు ఎండుతుందో తెలీదు? ఎపడు పండి చేతికొస్తిందో తెలీదు? ఈడ పుట్టిన రైతుని దేవుడుగూడ కాపాల్లేడు’’ అనింది నిష్టూరంగా కప్పూరదీపం.‘‘రైతుని కాపాడే దానికే కదక్కా మూలస్తానమ్మ పుట్టింది. ఆయమ్మ వుండంగా రైతుకి దిగులేముండాది చెప?’’ అనింది చిలకముక్కు దీపం.‘‘ఎట్టెట్టా... రైతుని కాపాడేదానికి మూలస్తానమ్మ పుట్టిందా? ఎట్లా పుట్టింది? ఎందుకు పుట్టింది?’’ అని అడిగింది గుడిసింటి దీపం.‘‘ఎట్లా పుట్టిందంటే... వడ్లకాగులో పుట్టింది. ఎందుకు పుట్టిందంటే రైతుని కాపాడేదానికి పుట్టింది’’ అని చిలక ముక్కంత వెలుగుని వయ్యారాలు పోతూ తిప్పింది.‘‘ఓసి నీ వయ్యారం వొలికిపోనూ! కుదురుగా నిలబడి ఆకతేంటో చెప విందాం?’’ అనింది పెద్దింటి దీపం.‘‘నీ అంత అందంగా కత చెప్పలేనమ్మా! నా గొంతు గూడా బాగుండదు’’ అనింది మల్లా కులుకుతా.