వర్తమానం:‘‘ఈ రోజుతో ఆఖరు’’ అన్నాడు శివయ్య చేతి లోని ఎముకను నోట్లో పెట్టుకుని పళ్లతో దానికి ఉన్న మాంసాన్ని పీక్కుని తింటూ.‘‘అయితే రేపట్నుంచి మనం పస్తులు ఉండాల్సిందేనా?!’’ అన్నాడు బ్రహ్మయ్య తన నోట్లోని ఎముకని చీకుతూ దిగులుగా.‘‘అంతేమరి! చాలామంది కంటే మనం అదృష్ట వంతులం.మధ్యమధ్యలో పస్తులున్నా కనీసం ఈరోజువరకైనా ఏదో ఒకటి తిని ప్రాణాలతో ఉన్నారు’’ అన్నాడు శివయ్య.బ్రహ్మయ్య లేచి నిలబడి మొలచుట్టూ కట్టు కున్న జింక చర్మాన్ని ఒకసారి విప్పి మళ్లీ బిగించి కట్టుకుంటూ ‘‘అయితే ఈ చుట్టుపక్కల ఒక్క జంతువు కూడా... చివరకూ కొండ ఎలుకలూ, బోదురు కప్పలూ కూడా లేవంటవా?!’’ అన్నాడు ఆశగా చూస్తూ.‘‘అయ్యో.. అవన్నీ ఎప్పుడో అంతరించి పోయాయి.

ఏఁవైనా కొద్దోగొప్పో మిగిలితే సంజీవికొండ మీదుండే బలరాంగుంపువాళ్లు ఎప్పుడో ఖాళీ చేసేశారు. అంతే కాదు. మనం ఉన్న కొండమీదేమైనా ఒకటీ అరా మిగిలాయేమో పట్టుకుపోదామని వాళ్ళు చూస్తు న్నారు’’ అన్నాడు శివయ్య,‘‘మనం ఈ కొండమీదికి ఇరవై మందిమి వచ్చాం రెండు నెలల క్రితం. మూడ్రోజుల క్రితం పద్దెనిమిదో మనిషి చచ్చిపోగా ఈ రోజుకు ఇద్దరం మిగిలాం. మనతో వచ్చిన వాళ్లు తిండిలేక చచ్చేవరకు ఎదురు చూడకుండా ఏదో విధంగా మనం ఇక్కడికి వచ్చిన రెండో రోజో, మూడో రోజో మనమే వాళ్లను చంపేసి ఉంటే, కనీసం మనం మరో రెండు నెలలు బ్రతికే వాళ్లం కదా!’’ అన్నాడు బ్రహ్మయ్య జరిగిపోయిన రోజుల్ని తలచుకుంటూ.‘‘సరేలే... నీకొచ్చిన ఆలోచనే మన గుంపులోని వాళ్లకు వచ్చి ఉంటే మనిద్దరమూ చచ్చి ఈ రోజుకు నెల రోజులయ్యుండేది. 

ఇంతకాలం బ్రతికున్నాం. సంతోషించు’’ అన్నాడు శివయ్య వెటకారంగా.‘‘అదీ నిజమేలే...’’ అంటూ నిట్టూర్చి పెదాలు తడుపుకుని, ‘‘గొంతు తడుపుకుందుకేమైనా నీళ్లు మిగిలాయా కుండీలో?’’ అన్నాడు బ్రహ్మయ్య.‘‘ఏవో కొద్దిగా ఉన్నాయిలే. అవి మాత్రం ఎన్నా ళ్లొస్తాయి! జాగ్రత్తగా వాడుకుంటే పది, పదిహేను రోజులు. అంతే!’’ అన్నాడు శివయ్య నిర్లిప్తంగా.రెండు నెలలుగా కొండమీద వాళ్లుంటున్న గుహలో ఎక్కడి నుంచి వస్తున్నాయో గానీ, గుహ పైకప్పు నుంచి బొట్లు బొట్లుగా నీళ్లు గుహలో పడు తున్నాయి. ఆ నీటి బొట్లు పడిన చోట నేలమీద చిన్నరాతి గుంట ఉండడంతో పడిన నీళ్లు నేలలోకి ఇంకిపోకుండా ఆ గుంటలో నిలిచి ఉన్నాయి. వాటినే పొదుపుగా వాడుకుంటూ వచ్చారింతకాలమూ.