‘‘అసలు మీ ఇద్దరివీ బెల్లీలా బెలూన్లా?’’ అని, తన క్రూడ్‌ జోక్‌కి తనే పొట్టచెక్కలయ్యేట్టు నవ్వసాగాడు ఆఫీసర్‌ పరాంకుశం. పరాంకుశం టార్గెట్‌ చేసింది, అతని సబార్డినేట్స్‌ అయిన శంకరం, సీతారాంల పొట్టల మీద.నిజమే, వాళ్ళిద్దరి పొట్టలూ సిన్మాల్లో డ్యూయెల్‌ రోల్‌లా ఒక్కోటీ ఒక్కో ఫుట్‌బాల్‌ సైజులో వున్నాయి.శంకరం, సీతారాం ఒకే ఆఫీసులో పనిచేయడమే కాదు, మంచిమిత్రులు కూడా.‘‘నగరాల్లో ఉండే ఉద్యోగులకి సిటీ అలెవెన్స్‌ ఇచ్చినట్టు, మీలాంటి వాళ్లకి ‘ఒబేసిటీ’ అలవెన్స్‌ ఇవ్వాలయ్యా!... ఎందుకంటే, మీబోటి వాళ్లకి ఎలానూ తిండియావ జాస్తి. పైగా ఆరోగ్య సమస్యలూ ఎక్కువే. కాబట్టి ఆ ఖర్చుల నిమిత్తం మీకు ప్రత్యేక అలవెన్స్‌లిచ్చితీరాలి. వచ్చే పే కమిషన్‌కి ఈ సూచన చెయ్యాలి’’ మళ్ళీ మరో జోక్‌ వేశాడు పరాంకుశం వాళ్ళమీద.ఆ కామెంట్స్‌ చేసింది ఆఫీసర్‌ కాబట్టి ఏమీ అనేకపోయినా, మనసులో మాత్రం కారాలూ, మిరియాలూ గ్రైండ్‌ చేశారిద్దరూ.గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఎటస్టేషన్‌కి తిరుగులేదన్నట్టు, నిజంగానే వాళ్ళ ఉదరాలు ఈమధ్యకాలంలో విపరీతంగా పెరిగి, చాలా చికాకు పెడుతున్నాయి వాళ్ళని. పొద్దుట చక్కగా టక్‌చేసుకుని ఆఫీసుకొస్తే, లంచ్‌ టైంకల్లా టక్‌ ఊడిపోయి, మడతలు పడ్డ చొక్కాలతో తిరగాల్సి వస్తోంది.

ఇక లాభంలేదని, ఇద్దరూ మరుసటి రోజునుంచి మార్నింగ్‌ వాక్‌కి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. మరుసటిరోజు ఇంకా చీకట్లు తొలగకుండానే ఇద్దరూ నడకకి బయలుదేరారు, కబుర్లు చెపకుంటూ.రోడ్డుపక్కన వేసిన ఇసుకలో చక్కగా తవ్వుకుని పడుకున్న ఓ కుక్కగారికి, వీళ్ళ మాటలు నిద్రాభంగం కలిగించినట్టున్నాయి కాబోలు, ‘‘భౌ.. భౌ’’మంటూ వెంటపడింది. శంకరం, సీతారాం ఒకటే పరుగు... అన్నప్రాసన రోజునే ఆవకాయన్నట్టు, నడక మొదలెట్టిన రోజే జాగింగన్నమాట! పరిగెట్టలేక ఆయాసం వస్తుంటే, జోకులేస్తూ తమ వెంట ఆఫీసర్‌ పడ్డట్టు ఊహించుకున్నారు... అంతే! వాళ్ళ పరుగులో వేగం పెరిగింది.రామకృష్ణా బీచ్‌కి చేరుకున్నారిద్దరూ. అప్పటికి తెల్లవారింది. పరుగాపి, నడవడం మొదలెట్టారు. ‘మత్స్యదర్శిని’కి ఎదురుగా పిట్టగోడ మీద చాలామంది వరసగా కూర్చున్నారు. వాళ్ళ వేషాలు చూస్తుంటే వాకర్స్‌లానే వున్నా, కూర్చున్న తీరు చూస్తుంటే కాలక్షేపానికి బీచ్‌ కొచ్చి సేదదీరుతున్నట్టుగా అనిపిస్తోంది. అంతా అరవై దాటిన వాళ్ళే.