ఉదయం ఆరు గంటల సమయం.విజయవాడ స్టేషన్ యాత్రికుల రద్దీతో హడావిడిగా వుంది. అసలే కృష్ణ పుష్కరాల రోజులు అవడంతో అడుగుపెట్టడమే కష్టంగా వుంది.రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా వుంది. కిటికీ దగ్గర కూర్చుని స్టేషన్‌లోని ప్రయాణీకులను గమనిస్తున్నాడు సాత్విక్. అతని పక్కన వున్న వృద్ధ దంపతుల జంట ఏదో పిచ్చాపాటీలో మునిగివున్నారు.రెండు నిముషాల్లో బండి బయలుదేరుతుందనగా హడావిడిగా ఎదురు సీట్లో వచ్చి కూర్చున్నారు నడి వయస్సులోవున్న ఓ వ్యక్తి. అతని వెంట పాతికేళ్ళయువతి.నిండు గర్భిణిలా, నిదానంగా బయలుదేరింది ట్రైన్.దరిదాపుల్లో రాజమండ్రి వున్నదనగా, టిఫిన్లు ముగించారు. సాత్విక్ చేతిలోవున్న వీక్ మేగజైన్ అడ్డుపెట్టుకుని, అప్రయత్నంగా కిటికీ పక్కనే, తన సీటుకు ఎదురుగా కూర్చున్న యువతిని గమనించసాగాడు.ఆమె మాత్రం తన ధ్యాసలో కిటికీలోంచి పరిసరాలను గమనిస్తోంది.ఎందుకో తెలియదుగాని, కొంతమందిని గమనించినపుడు ఏదో వ్యక్తీకరణకు అతీతమైన అనుభూతి కలుగుతుంది.మనలో చాలా మందికి, ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చిన విషయం అది. అటువంటి భావనకే లోనైన సాత్విక్ ఆమెను గమనించసాగాడు.
అతని ఆలోచనలకు అడ్డుతగులుతూ‘‘బాబూ, బండి అన్నవరం చేరేసరికి టైం ఎంతవుతుంది’’ ప్రక్కన కూర్చున్న వృద్ధుడు పలకరించడంతో వర్తమానంలోకి వచ్చాడు సాత్విక్.‘‘సుమారు పదకొండున్నర అవుతుందనుకుంటానండి. నేను కూడా మొదటిసారి ఈ ట్రైన్‌లో ప్రయాణించడం’’ జవాబిచ్చాడు సాత్విక్.వెనక్కివాలి రిలాక్సయ్యారు ఆ దంపతులు.తిరిగి సాత్విక్‌లో అడొరేషన్‌తో మిళితమైన అబ్జర్వేషన్ మొదలైంది.సామర్లకోట స్టేషన్‌లో వారపత్రిక కొన్నాడు సాత్విక్. దాదాపు అరగంట పైగా పుస్త్తక పఠనంలో మునిగిపోయిన అతను, కుదుపుతో ట్రైన్ ఆగడంతో తలపైకెత్తాడు.ఎదురుగా కూర్చున్న యువతి తననే గమనిస్తున్నట్టు అనిపించింది.ఏదో విధంగా పరిచయం చేసుకోవాలనుకున్నాడు.‘‘మాష్టారూ, మీరు కూడా వైజాగ్ వరకు వస్తున్నారా’’ మొదలు పెట్టాడు సంభాషణని.‘‘లేదు బాబూ, అన్నవరంలో దిగాలి. అమ్మాయి ఆరు నెలలు ముందే మొక్కుకుంది. కాని, ఇప్పటిదాకా వీలుపడలేదు. మాకు ఈ రోజు, రేపు సెలవలు. అందుకే దర్శనానికి బయలుదేరాము’’ అన్నాడు అమ్మాయి ప్రక్కన కూర్చున్న మధ్యవయస్కుడు.‘‘బైదవే, నా పేరు సాత్విక్. బ్యాంక్‌లో అసిస్టెంట్ వేనేజర్‌గా పనిచేస్తున్నాను. మీరు....’’ ఎవరన్నట్టు అడిగాను.‘‘నా పేరు విశ్వనాథం నాయనా. ఈ అమ్మాయి నా కూతురు పేరు శృతి’’ అంతకు మించిన వివరాలు బయటికి రాలేదు.పర్లేదు జగన్నాథ రథం కదిలింది. అంటే, ఈ పరిచయ ప్రహసనాన్ని కాస్తముందుకు తీసుకెళ్ళవచ్చు అనుకున్నాడు సాత్విక్.తను ఆమెనే గమనిస్తున్న విషయం ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడ్డాడు సాత్విక్.గంట గడిచింది. అంతలో సడన్‌గా ఆగింది రత్నాచల్.అందరిలాగే, ఏమైందబ్బా అనుకున్నాడు సాత్విక్. తన చేతిలోని ‘‘నవ్య’’ ను విశ్వనాథం చేతికిందిస్తూ లేచి డోర్‌దగ్గరికి బయలుదేరాడు కారణం కనుక్కోవడానికి.