బస్సు వేగంగా వెళ్తోంది. డాంబర్‌ రోడ్డు వదిలేసి మట్టిరోడ్డు మీదికెక్కింది. ఎండ మండిపోతోంది. చెమటతో చొక్కా తడిసి పోయింది. బయట దుమ్ము సుడులు తిరుగుతోంది. అచ్చం నా మనసులో చెలరేగే ఆలోచనల్లాగా. ఒక్కసారిగా గుప్పుమంటూ దుమ్ము బస్సులోకి దూసుకొచ్చింది. వెంటనే కళ్లు మూసుకున్నాను. మళ్ళీ ఆలోచనల సుడులు....నాకు ఆరేళ్లప్పుడే అమ్మను మాయ రోగమేదో కమ్మేసింది. ఆమెను మా నుంచి దూరం చేసింది. వచ్చే ఆవిడ నన్ను సరిగా చూస్తుందో లేదోనని నాయన మళ్ళీ పెళ్లి మాట తలపెట్టలేదు. అప్పటి నుంచి నేనే లోకంగా కాలం గడిపారు. నా ప్రతి అడుగులోనూ ఆయనే కనిపిస్తారు. ఆయన వల్లే నాకు పుస్తకాలపై ప్రేమ కలిగింది. నాయన ఆ కాలంలో నాలుగో తరగతి వరకే చదువుకున్నాడంట. అయినా మహాభారతం, రామాయణం ఎన్నోసార్లు చదివారు. పురాణాలన్నీ కంఠోపాఠమే. వేమన, సుమతీ శతకాలు నిత్యపారాయణాలు. ఆ పుస్తకాలన్నీ మా ఇంట్లో ఉండేవి. వాటన్నింటినీ ఆయన నాతో చదివించారు. బాలల బొమ్మల రామాయణం, భాగవతం, భారతం ఆయన నా కోసమే కొని తెచ్చారు. కాయాకష్టం చేసి సంపాదించిన డబ్బును పుస్తకాలకు ఎందుకు తగలేస్తావని తోటివారు అడ్డు తగిలినా ‘మీకు తెలియదులేరా వాటి విలువ’ అంటూ కొట్టి పడేసేవారు. పురుష సూక్తంలో ఏముంది, పురాణ కథల అర్థాలు, అంతరార్థాలు, ఊర్ల దొరలేంది. వాళ్లకు అన్నన్ని భూములెట్ల వచ్చినై, కులమంటే ఏంది, నిచ్చెన మెట్లంటే ఏంది.. ఇవన్నీ చెప్పి నాలో సామాజిక స్పృహ కల్పించిందాయనే. ఆ పుస్తకాల పిచ్చే నాకు చదువుపై ప్రేమ కల్గించింది. అదే ఉన్నత చదువులకు బాట వేసింది. లైబ్రేరియన్‌ ఉద్యోగమిప్పించింది. జిల్లా కేంద్రంలో నా ఉద్యోగం. 

రెండేళ్ల వరకూ ఊరు నుంచి జిల్లా కేంద్రానికి అప్‌ అండ్‌ డౌన్‌ చేసేవాడిని ఈ తిరుగుడు ఎందుకు అనవసరంగా అంటూ నాన్నా తరచూ మందలించేవాడు. అయినా అలాగే కొనసాగించాను. పెళ్ళయ్యాక నాన్న ఒత్తిడి మరీ ఎక్కువైంది. అక్కడే ఉండిపోరా. కోడలి ఉద్యోగానికి కూడా సౌకర్యంగా ఉంటుందని పోరు మొదలు పెట్టాడు. దీంతో జిల్లా కేంద్రంలో కాపురం పెట్టాను. ఎప్పుడన్నా ఊరికి వస్తామని చెప్పినా నాయన వద్దనేవాడు. ‘ఏముందిరా ఇక్కడా’ అనేవాడు. అప్పుడప్పుడూ ఆయనే నా దగ్గరకు వచ్చి ఒకటి రెండు రోజులుండి వెళ్ళేవాడు. ఊరు గురించి ఏమడిగినా చెప్పేవాడు కాదు. ఏముంది చెప్పడానికి... అంటూ దాటేసేవాడు. చేతి ఖర్చులకు డబ్బులిచ్చినా తీసుకొనేవాడు కాదు. నేనే బలవంతంగా ఇచ్చి ఊరికి పంపించేవాడిని. చివరకు ఏమైందో తెలియదు కానీ.. ఆర్నెల్ల కింద నాన్న ఊరొదిలేసి నా దగ్గరకు వచ్చేశాడు. అప్పటి నుంచి ఆయన పూర్తిగా మారిపోయాడు. నిరంతరం ఆలోచనల్లోనే కాలం గడుపుతున్నాడు. ఆయన నోటి మాట విని దాదాపు ఆరు నెలలైంది. నిస్తేజంగా, నిర్లిప్తంగా ఉంటున్న ఆయన చూపులు నన్ను వేధిస్తున్నాయి. కలవరపరుస్తున్నాయి.