మార్నింగ్‌ సెషన్‌ అపడే ముగిసింది. రెండు స్కూలు గేట్ల వద్ద పిల్లలు గుమిగూడారు. వడివడిగా వెళ్లి బస్సులో సీట్ల కోసం పోటీ పడి షర్టులు సీట్ల మీదకి గిరాటు వేసి, సీట్లు రిజర్వ్‌ చేసుకొంటున్నారు. అంతవరకూ నిశ్శబ్దంగా క్యూలో నిల్చున్న ఈవెనింగ్‌ సెషన్‌ తాలూకూ చిన్న పిల్లలు క్యూ వదిలి స్కూలు బ్యాగ్‌లు, వాటర్‌ బాటిళ్లు తీసుకొని క్లాసుల్లోకి చొరబడుతున్నారు.త్వరగా ఇళ్లకు చేరుకోవాలన్న తాపత్రయంతో పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని తోసేస్తున్నారు. ఆ గోలను మరి కాస్త పెంచే ఉద్దేశంతో చిన్న పిల్లలు బిగ్గరగా అరుస్తూ నవ్వుతూ, ఒకరినొకరు తోసుకొంటూ గోల చేయడంలో వారి వంతు వారు నిర్వహిస్తున్నారు. వాతావరణం గోలగోలగా గందరగోళంగా వుంది.స్కూలు వెనక భాగాన ప్రధాన ద్వారంలో వచ్చే విద్యార్థులను అదుపు చేయడానికి కాచుకొని నిల్చుంది ఎల్సా. ఎండ తీవ్రతకు ఆమె ముఖం చెమట పడుతోంది. చాక్‌పీసులు, డస్టర్లు తీసుకొని పన్నెండు మంది టీచర్లు క్లాసులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నపడు ఎల్సా స్టాఫ్‌ రూమ్‌లో అడుగుపెట్టింది.హెడ్మాస్టరు నావెల్కర్‌ పంక్చుయాలిటీ విషయంలో రాజీ పడే మనిషి కాదు. బెల్‌ మోగీ మోగగానే ఉపాధ్యాయులు తమ తమ క్లాసుల్లో వుండాలన్నది అతని అభిమతం.

ఆ సంగతి ఉపాధ్యాయులకు ఎపడో చెప్పారు. ఆ విషయంలో సడలింపు ఆయనకు సుతరామూ నచ్చదు.‘‘ఎల్సా’’ అన్న పిలుపు విని తన లాకర్లో వున్న డస్టర్‌ కోసం వెళుతున్న ఎల్సా తిరిగిచూసింది. మార్నింగ్‌ సెషన్‌ టీచర్లలో ఎక్కువ వయస్సున్న మిసెస్‌ అజావేది ఆమెను పిలిచింది.‘‘ఎల్సా, ఫిలిప్స్‌చావు బతుకుల్లో ఉన్నాడు తెలుసా?’’‘‘ఆ...!’’ అన్న ఎల్సా చేతులు వణికాయి. చేతిలో వున్న డస్టర్‌ కింద పడింది.‘‘అవును, ఉదయం నా భర్త వెళ్లి పరామర్శించి వచ్చారు. ఫిలిప్‌ రేపు వుదయం లేస్తారన్న ఆశ లేదట. చివరి దశలో ఆయన్ను చూడాలని అనిపించలేదా?’’‘‘లేదు...మిసెస్‌ అజావేది గారూ, అదంతా గతం! వెళ్లాల్సిన సమయంలో వెళ్లలేదు. ఎపడో వదిలేసిన గతాన్ని మళ్లీ తవ్వుకోవాలని అనుకోవడం లేదు.’’ఓ నిట్టూర్పు విడిచి, చెలరేగే భావాల్ని అణచుకొని కుర్చీలో కూలబడింది ఎల్సా