రాత్రి పదకొండవుతుందేమో!కాలింగ్‌ బెల్‌ మోగడంతో తలుపు తీసి కళ్ళెదుట ప్రత్యక్షమైన నందూని చూసి, కించిత్‌ ఆశ్యర్యపోయాను.నన్ను నేను అదుపులోకి తెచ్చుకుంటూ, ‘‘రా నాయనా, లోపలికి రా! చిరకాల దర్శనం ఒసంగేవు. ఇంతకీ - ఊరక రారు మహాత్ములని - తమ హఠాత్‌ రాకకి తాత్పర్యం ఏమిటో?’’ అంటూ వాడిని లోనికి ఆహ్వానించాను.వాడైతే అసలు అదేమీ పట్టించుకున్నట్టు లేడు. ‘మాటలకి సమయం లేదే ఇప్పుడు! మనం అర్జెంట్‌గా వెళ్ళాలి; వెంటనే బయల్దేరు’ ఎటో చూస్తూ ఏమిటో మాట్లాడుతున్నాడు వాడు!నా మనస్సు ఎందుకో కీడు శంకించింది.

‘‘నువ్వీ సమయంలో రావడమే ఒక ఎనిమిదో వింతఅయితే, ఈ అకస్మాత్తు ప్రయాణమేమిటసలు? ఎక్కడ, ఎవరికి, ఏమైంది? మనం ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? అసలు నువ్వు ఎందుకంత గాభరాగా, అనీజీగా, మూడీగా సర్వస్వం పోగొట్టుకున్నవాడిలా ఉన్నావు? ఏం జరిగింది? అది ముందు చెప్పు ప్రశ్నల వర్షంతో వాడిని తడిపి ముద్ద చేశాను.కాని వాడు షరా మామూలే!‘‘అన్నీ దారిలో చెప్తాలేవే, ముందు కదులునువ్వు’’ అంటూ నా చెయ్యి పట్టుకుని, బయటనిలిపి ఉంచిన తన బండికేసి నన్ను బరబరా లాక్కుపోయాడు.అప్పుడు, ఉన్నట్టుండి నా మస్తిష్కంలో ఏదో మెరుపు మెరిసినట్టయింది. రాజాకేమీ అవలేదు కదా! ఏదో క్యాంపు ఉందని, సాయంకాలం ట్రైన్లో రాజమహేంద్రవరం వెళ్తున్నానని ఉదయమే అన్నాడు నాతో! కొంపదీసి...అయితే, తను ప్రామిస్‌ చేసినట్టు దారిలో నందూ ఏమీ మాట్లాడలేదు.

ఏ విషయమూ వివరించలేదు.నేను వదిలితేగా! పలుమార్లు గుచ్చి గుచ్చి అడిగిన దరిమిలా, బావగారికి చిన్న యాక్సిడెంట్‌ అయిందని మాత్రం చెప్పాడు,.యశోదా హాస్పిటల్‌ ముందు మమ్మల్నిఇద్దర్నీ మోసుకొస్తున్న వాడి స్కూటర్‌ నిలిచింది. నా అడుగులు తడబడుతున్నాయి. శరీరం కంపి స్తోంది. నందూ ముందు నడుస్తుండగా, భయం, అల్లకల్లోలసంద్రమైన మనస్సుతో ఆసుపత్రి లోపలికి అడుగులు వేశాను. అక్కడ స్పెషల్‌ రూమ్‌లో, మంచమ్మీద, ఒళ్ళంతా బ్యాండేజితో రాజా!కలలో కూడా నేను ఎన్నడూ ఊహించని సన్నివేశం! నా ప్రియమైన శ్రీవారు.. నా ఎదలోని మా వారు. నా ప్రాణంలో ప్రాణం. నా డియరెస్ట్‌ రాజా. అటువంటి ఘోరాతిఘోరమైన ప్రమాదం ఎదుర్కొని శరీరంలో ఎక్కడా ఖాళీలన్నవే కానరాకుండా రక్తసిక్తమైన కట్లతో...