‘‘ముందు చూపున్న’’ రామబ్రహ్మంగారంటే నాకు గురువూ, దైవం అన్నీనూ! ఎందుకంటే మా నాన్నగారి స్నేహితుడు. నా బియ్యే అయిపోగానే పై చదువులకు పోవాలని ఆశపడితే, రామబ్రహ్మంగారు నన్ను చేరదీసి...‘‘ఎమ్మే చదువుతావు బాగుంది. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేస్తావు కదా. ఓ రెండేళ్ల తర్వాత చేసే ఉద్యోగ ప్రయత్నమేదో ఇప్పుడే చేస్తే....ఆలోచించు..’’ అన్నారు.

టౌన్‌ చివర ఇస్మాయిల్‌ టీ అంగడి దగ్గర నిలబడి టీలు తాగినాక బీడీలు తాగుతూ, వక్కాకు నములుతూ గుంపుగా నిలుచున్న వాళ్ళు ఎనిమిది మంది.‘‘మీరంతా బిరిన్నే ఎలబారి పాండి. సాయంకాలమైపోతుండాది.తలా ఓ దిక్కులో పాండి. ముందు యాదైనా నల్ల మేకపోతు వుండాదేమో చూసి చెప్పినాక రేటు మాట్లాడుకోని అడ్వాన్సు ఇచ్చేసి మాట చేసుకుని వచ్చేయండి. ఇంకెవురికైనా యాడన్నా నల్ల మేకపోతు దొరికిందేమో మన మీద అడ్వాన్సు దుడ్లు ఇచ్చేస్తే ఎట్లా అని ఎవురు పాలు యారకండి. యాభై రూపాయలు పోయినా పర్వా లేదు. యాడ గురి కుదిరితే ఆడ అడ్వాన్సు ఇచ్చేసి వచ్చేయండి. ఎన్ని కేజీలుంటదో చూసుకుని మళ్ళింక ఎక్కడ కొనాల్నో అక్కడకు నేనూ వస్తా. దాని దిట్టం చూసికొందాం లే’’ మరికొన్ని హెచ్చరికల్ని జారీ చేస్తున్న క్రిష్ణప్ప వైపు విసుగ్గా చూశాడు బండి గోవిందు.‘‘ఏంది మామా. చెప్పిందే చెప్తా వుండావు. అదే పనిగా ఈ పిలకాయలకి బండ్లుండాయి. వీళ్ళు నలుగురు ముందు కూర్చుని బండ్లు తోలతా వుంటారు. స్కూటర్లకు ఎనకాల కూర్చుని దారి చూపించే దానికి, అక్కడక్కడా నల్లమేకపోతు యాడుండాదో వెతికే దానికి మనోళ్ళే నలుగురు వుండాం కదా. మాకు తెల్సు కదా పనంతే. అయినా మేకల దొడ్డి కాడికి పోయి నల్ల మేకపోతు కావల్ల అనంటానే వాళ్ళే అడగలేరు కదా మునిదేవరకా అని. వాళ్ళ దగ్గర మనకు కావాల్పింది ఉండాదో లేదో ఎమ్మట్నే వాళ్ళే చెప్పేస్తార్లే. మనం మందంతా ఎతికే పని కూడా లే. ఊర్లోకి పోయి మునిదేవరికి మేకపోతు కావల్ల. నల్లది అని అడిగితే సాల్లే. ఊర్లో యాడున్నా ఊర్లో వాళ్లు చెప్పేస్తార్లే’’ పనిలోని సుళువుని, మెలకువల్ని చెపకొచ్చాడు బండి గోవిందు.