వీధి పెరట్లో అలికిడైతే గుమ్మంలోకి వచ్చి చూసింది విశాలాక్షి.చుట్ట కాల్చుకుంటూ, చంకలో పెట్టుకున్న జనపనార చిలపతో తాడు అల్లుకుంటూ వీధిఅరుగుమీద కూర్చున్న వెంపర్తి కనిపించాడు.‘‘నువ్వు రా! ఎంతసేపైంది వచ్చి’’ అంటూ బయటి అరుగుమీదకి వచ్చింది.‘‘ఆయ్‌, ఇప్పుడేనండి. మన గేదెని సిన్నకాలవకాడికి తోలుకెళ్ళి సుబ్బరంగా కడిగి, దొడ్లో కట్టేసొచ్చానండి. అళీ్యుగార్లేరాండి?’’‘‘నాయుడుగారి కొబ్బరితోటలోకి వెళ్ళారు. వాళ్ళ నారాయుడు కబురు తెచ్చాడు’’.‘‘ఆయ్‌... దొడ్లో పనుంది రమ్మన్నారండి నన్ను. పన్లో పని, గేదెని కాలవకాడికి తీసికెళ్ళమని నిన్న జెప్పా రండి’’.‘‘మరే! మంచిపనే చేశావు. ‘సోవిఁగాడు ఊరెళ్ళాడు. వాడి పెళ్ళాం నీళ్ళోసుకుందట.’’‘‘ఆయ్‌... దొడ్లో పనేంటో...’’ అంటూ ఇంటివెనక పెరట్లోకి వెళ్ళేందుకు లేచాడు. చంకలో తాడు అల్లిక పూర్తయింది. ఇందాక విశాలాక్షిని చూస్తూనే చుట్ట ఆర్పి, ఆ చుట్టముక్కని చెవిలో దోపుకున్నాడు.

‘పద చూపిస్తా. అరటిచెట్లకి సొరుగులు కోసేసి, బోదెలు కట్టాలిరా! మన నూతినీళ్ళు వాటికి పట్టకుండా, మురికిగా బైటకొచ్చేస్తున్నాయి.ఆ రెండు కొబ్బరిచెట్లనించీ ఎండుమట్టలు వేలాడు తున్నాయి. వాటిని లాగేసి, ఆకు దూసేసి, ఈనెలు తీసేస్తే చెల్లాయమ్మ వచ్చి బరక చీపుళ్ళు కట్టుకుంటుంది’’.విశాలాక్షి వెంపర్తి వెంటే వచ్చి మాట్లాడుతుంటే, వాడు రెండు కొబ్బరిచెట్ల మధ్య నిలబడి కాయల తీరు పరకాయిస్తూ, చెట్ల చుట్టూ తిరుగుతున్నాడు.‘‘అన్నట్టొరేయ్‌, చెట్ల కాయలెప్పుడు దించుతావు? పుచ్చెలు బాగా రాలిపోతున్నాయి. ఏం చెయ్యాలంటావూ?’’ తనూ చెట్లవైపు పరీక్షగా చూస్తూ అడిగింది.‘‘సూద్దాం. అయ్యగారు రానీండి. ఈలోగా అరిటి సెట్ల పని సూసేసి, బోదెలు కట్టేత్తానండి’’‘‘అలాగే కానియ్యి. అన్నం ఇక్కడే తిందువుగాని. ఇంతలో ఆయనా వస్తారు’’ అనేసి విశాలాక్షి పెరటిదండెం మీద ఆరేసి ఉన్న పట్టుపంచె తీసుకుని లోపలికి వెళ్ళింది.

‘‘రెండుసెట్లూ కలిపి ఓ పాతిక్కాయ దిగొచ్చండి’ పెరటి అరుగుమీద పడక్కుర్చీ వేసుక్కూర్చుని, సీతారామ్మూర్తి వింటున్నాడు.‘‘ఇంతేనా?’’‘‘అంతకిమించి అక్కడ ఓపికేదండీ?’’ అన్నాడు వెంపర్తి, అరటిచెట్ల పని చూసేసి నూతిదగ్గర కాళ్ళుచేతులు కడుక్కుంటూ.‘‘అయితే ఏం చెయ్యాలంటావు?’’‘‘సెప్పమంటారా? మన గొడ్లపాకకాడ గొయ్యెడదావండి. రేగడి పెళ్ళలు తిరగేసి, ఆటితో రెండు కొబ్బరిసెట్లకీ సుబ్బరంగా మొదళ్ళలో దిమ్మలు కడదావండి. సెట్టుపైని మొవ్వులో ఉప్పుమూట లెడదావండి. బాగవుద్ది. ఎండుమట్టల్లాగేశాం కదండి; సూద్దారండి’’.