ఎనిమిదేళ్ళ కిందట ఒకనాడు ఉదయం మా ఇంటి కాలింగ్‌బెల్‌ మోగితే నేనే వెళ్ళి తలుపుతీస్తే; చక్కగా డ్రెస్‌ చేసుకుని మొహంలో కాంతి పోసుకున్న ఓ పద్దెనిమిదేళ్ళ కుర్రాడు నిలబడి ఉన్నాడు; అక్కడ. నేను తలుపు తీసీ తియ్యగానే ‘‘నా పేరు వెంకటాచలమండి. చినవాల్తేరు నుండొచ్చాను. మీ బట్టలు ఉతికే నారాయణ మా పాధరండి’’ అని గడగడా చెప్పేడు.‘‘ఓహో, నువ్వా? చదువుకుంటున్నావుట కదు?’’ అన్నాను, దయగా.‘‘అవునండి. తొమ్మిదో క్లాసండి’’.‘‘రా; లోపలికి రా; అక్కడే నించుండి పోయేవేంటి?’’ అని ఆ అబ్బాయి అంతసేపటిదాకా లోపలికి రాకుండా నేనే అడ్డుగా వున్నానన్న సంగతి దాటవేసి దారి ఇచ్చేను.‘‘అది కాదండి, మా నాన్నగారికి రాత్రి నుండి ఒంట్లో బాగలేదండి; ఒకటే జ్వరం. మీరు ఈ రోజు కాంపెల్తారని, మీ బట్టలు ఉండిపోయాయనీ చాలా బాధపడి పోతున్నారండి. అంచేతండి-’’‘‘అంచేత; నువ్వుగాని ఆ బట్టలు తీసుకు బయల్దేరీసీ వేమిటి?’’ అన్నాను మరింత దయగా.‘‘మరేండి, మీ క్యాంపుటైం దాటిపోకుండా మీ బట్టలు మీ కందించేస్తే మీకూ, మా నాన్నగారికీ కూడా హాపీగా ఉంటాదని...’’ మంచిపని చేస్తూనే ఏదో పశ్చాత్తాప ధోరణిలో అన్నాడు వెంకటాచలం.‘‘మరి, ఏవీ బట్టలు?’’‘‘కిందను సైకిలు స్టాండు కున్నాయండి. మీ ఇల్లూ, పేరూ సరిగా తెలుసుకోకుండా మేడమీదికి తెచ్చీడం ఎందుకని కిందనే ఉంచేశాను సార్‌. ఒక్క నిముషం!’’ అని చకచకా మేడమెట్లు దిగి వెళ్ళి ఒక్క నిమిషంలోనే బట్టలు పట్టుకొచ్చేడు.చాకలి నారాయణ కొడుకు వెంకటాచలం ఆ విధంగా పరిచయం అయ్యేడు, నాకు! ఆ కుర్రాడి వేషం భాషా నాకు బాగా నచ్చేయి. 

పదిమంది మర్యాదస్తుల కుటుంబాల వాళ్ళ బట్టలు ఉతికే చాకలి కొడుకు కనక ఆ అబ్బాయి మంచి మంచిబట్టలు వేసుకోడంలో వింత ఏమీలేదని సరిపెట్టుకున్నా అతని మాటలో యాస లేకపోడం, ఆ ‘‘మంచీ, మర్యాద’’ వంశపారం పర్యంగా వచ్చినవి కాదని, వాడి సొంత సంస్కారమే అనీ స్వయంకృషేననీ తెలిసి పోతోంది కదా.నా బట్టలు మాత్రం తెచ్చేడు. ‘‘మిగతావి అంత అర్జంటు కాదన్నారండి మా నాన్నగారు’’ అని లెక్క ప్రకారం అప్పగించి; వెంటనే వెళ్ళిపోలేదు, వెంకటాచలం. మా అమ్మాయి అక్కడొక కుర్చీలో కూచుని, ఎదురుగుండా టీపాయి మీద పరుచుకుని తదేకంగా చూస్తున్న రీడర్స్‌ డైజెస్టు సంస్థ వారి గ్రేట్‌ వరల్డ్‌ అట్లాస్‌ మీద పడ్డట్టుంది వాడి దృష్టి. ఆ రోజుల్లో మూడు వందల రూపాయల ఖరీదుండే ఆ అట్లాసు వాడికి అందుబాటులో ఉండదన్నది నిస్సంశయం. అందుచేత వాడు వీలైనంత సేపూ ఆ అట్లాసులోకి మా అమ్మాయి చూస్తున్నంత సేపూ చూసేస్తాడన్నది ఖాయం. తనంతట తాను ‘‘ఆ పేజీ తియ్యండి, ఈ పేజీ తిప్పండి’’ అని అడక్కపోయినా; వాడు మా అమ్మాయితో సమానంగా ఆ అట్లాసులోకి తొంగిచూడ్డం మా అమ్మాయికి ఎంబరాసింగ్‌గా ఉంటుందేమో అని, అనుమానించిన నేను వాణ్ణి ఆ విషయంలో నిరుత్సాహపరచాలని నిశ్చ యించుకున్నాను. కాని, డయిరెక్ట్‌గా ‘‘అలాంటి ఖరీదైన అట్లాసుల్లో నీతల దూర్చకురా, ఒరే చాకలి కుర్రాడా!’’ అని చెప్పేడానికి నా సంస్కారం కూడా అడ్డు తగిలింది. అందుచేత నేను గుప్‌ చిప్‌గా లోపలికెళ్ళి, ఓ ముప్ఫయి రూపాయలు తెచ్చి వెంకటాచలం మొహం మీద రెండు చిటికెలు వేసేను. వాడు తలెత్తి నావేపు చూసేడు.