ఎవరో తనవైపే తదేకంగా చూస్తుంటే ఇబ్బంది పడింది మహాలక్ష్మి. ఎక్కడో చూసినట్లే వుంది అనుకుంది. బస్సు అప్పుడే ఎర్రమంజిల్‌ దాటింది. తన ప్రక్కన కూర్చొని కిటికీ నుండి సిటీని చూస్తోన్న దుర్గ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు అదుముకుంది.కావాలనే పట్టించుకోనట్టుగా కిటికీ నుండి బయటకు చూడసాగింది.‘‘ఎక్స్‌క్యూజ్‌మి! మీరు కనకదుర్గ చెల్లెలు కదా!’’ అంటూ ఆవిడ పలకరించింది.తన అక్కయ్యను గుర్తుచేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరో తెలిసిన ముఖంలాగానే వుందే అని అనుకుంటున్నది నిజం అన్నమాట? అయినా సరే గుర్తుకు రావడం లేదు. సంభ్రమాశ్చర్యాలతో.‘‘అవునండి! మీరు... ’’ అంటూ సందేహంగా ఆగిపోయింది.బస్సులో అంతగా రష్‌లేకపోవడంతో తన సీటుకు ఆనుకుని నిలబడిందావిడ. సాదాసీదా చీరలో వున్పప్పటికీ ముఖవర్చస్సు చూస్తే విద్యావంతురాలిగానే కనబడుతోంది. మెడలో ఏ ఆభరణాలు లేకుండా బోసిగా వుంది. ఆవిడ కళ్ళలో ఒకరకమైన తీక్షణత, మెరుపు చూడగానే మనిషిని నిలబెట్టేలాగుంది.‘‘అయ్యో నన్ను గుర్తు పట్టలేదా! నేను మీ అక్కయ్య క్లాస్‌మేట్‌ను. ప్రగతిని... ఒకసారి మీ ఇంటికి కూడా వచ్చాను’’ అంటూ నవ్వుతూ బదులిచ్చింది.ఒక్కసారిగా జ్ఞాపకాల కొండను కదిలించినట్లుగా అయింది. ఆవిడను తను ఎలా మరిచిపోగలదు. తనకు ప్రాణంలో ప్రాణమయిన అక్కను మరిచిపోనట్లే ప్రగతి అక్కయ్యను ఎలా మరుస్తుంది?......్‌్‌్‌ఇది ముప్ఫై సంవత్సరాల క్రితం సంఘటన.గుడివాడలో డిగ్రీలో జాయిన్‌ అయిన అక్కయ్య హాస్టల్‌లో వుండి చదువుకుంది.

 మరీ పల్లెటూరు కావడంతో మా వూళ్ళో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతికే చదువు ఆగిపోయింది. అక్కయ్య కొట్లాడి మరీ మా వూరికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మరో పెద్ద పల్లెలోని జూనియర్‌ కాలేజిలో ఇంటర్మీడియట్‌లో జేరింది. రోజూ బస్సులో వెళ్ళివచ్చేది. మా నాన్నగారికి అక్కయ్యను ఇంకా చదివించటం ఇష్టంలేదు. ఎక్కువ చదివిస్తే ఎక్కువ కట్నం ఇవ్వాల్సివస్తుందనేది ఆయన బాధ! ఏదో చాకలిపద్దుల చదువు వస్తేచాలు పొలం, పుట్రా వున్నవాడు దొరికితే అంటగడితే సరిపోతుంది అనుకునేవాడు. ఆయన మటుకు ఏమి చేస్తాడు?నలుగురు ఆడపిల్లలు. ఆఖరున తమ్ముడు పుట్టాడు. మగసంతానం కోసం ఇంతమందినీ కన్నాడు. తానుచేసే గుమాస్తా ఉద్యోగానికి ఇందరినీ పోషిస్తూ పెళ్ళిళ్ళు చేసి బయటపడాలంటే మాటలు కాదు మరి! అందరిలోకి పెద్దదయిన దుర్గక్కయ్యకు ఇంటర్‌ కాగానే పెళ్ళి చేస్తానని కూర్చున్నాడు. చదువు ఆపేయమని గోడవ చేసాడు. అప్పటికి నేను ఎనిమిదోతరగతిలో వున్నాను. అక్కయ్య అప్పుడే పెళ్ళివద్దని ఏడ్చింది. ఇంటర్‌లో కూడా మార్కులు బాగానే వచ్చాయి. కనీసం డిగ్రి అయినా చేస్తానని గోల చేసింది. దాని ఏడ్పులకు మా పిల్లలమంతా కరిగిపోయి అక్కకు మద్దతుగా నిలబడ్డాం. అమ్మకూడా అక్కయ్యకే ఓటు వేసింది. ఎన్నడూ నాన్నకు ఎదురు చెప్పని అమ్మకూడా నాన్నగారితో పోట్లాడింది. చక్కగా చదువుకుంటున్న పిల్ల చదవనీయరాదండీ! ఇప్పుడే పెళ్ళి సంసారం అంటూ నాలాగే దాని జీవితం ఊబిలో కూరుకు పోతుంది అని అంటూ ఏడ్చింది. పెద్ద రగడ అయింది. ఇల్లంతా కంగాళి అయింది. అనుకోకుండా అదే సమయానికి మా పెద్ద మామయ్య గుడివాడనుండి ఊడిపడ్డాడు. ఆయన అదేదో ఇన్సూరెన్స్‌ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన మాటంటే మా నాన్నకు కొంత గురి వుంది. ఈ పంచాయతీనంతా ఆయన ముందు పెట్టారు.