ఈ కథ చెపుతున్నది నేనే అయినా ఇందులోని ప్రధాన పాత్ర నేను కాదు. నా మిత్రుడు కమలాకర్రావు. వాడో విలక్షణమైన వ్యక్తి. అందరిలోకీ భిన్నమైన వాడు. అందరూ వాడిలాగే బ్రతుకుతూ, వాడిలాగే ఆలోచిస్తే ఈ ప్రపంచం ఇలా ఉండదు. మరోలా ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే వాడిలా ఆలోచించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కళ్ళు మాత్రమే ఉంటుంటారు. అందుకే ఈ ప్రపంచం ఎంత ముందుకు నడిచినా ఓ నాలుగడుగులు వెనక్కే పడుతుంటాయి. ఈ అడుగుల ప్రస్తావన మా మధ్య చాలా సార్లు వచ్చేది.మనిషి ముందుకు వెళుతున్నాడా వెనక్కి వెళుతున్నాడా అన్న విషయం మీద చర్చ వచ్చినప్పుడు కమలాకర్రావు ఈ అడుగుల లెక్కలే చెప్పేవాడు.ఒకసారెప్పుడో వాడికి వొంట్లో బాగోలేదంటే పరామర్శించడానికి వెళ్ళాను. ఆ మాటా ఈ మాటా చెప్పుకున్నాకా ‘‘ఇప్పుడు వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందిందిలేరా. ఇది వరకటిలా భయపడనవసరం లేదు. ఎలాంటి లోపాన్నయినా ఇట్టే పసిగట్టేసే అద్భుతమైన పరికరాల్ని మనిషి కనిపెట్టాడు’’ అన్నాను ధైర్యం చెప్పడం కోసం.‘‘నిజమే. నేనూ వొప్పుకుంటాను. ఇదిగో ఈ రిపోర్ట్‌ చూసావా? ఎక్స్‌రే. ఇది ఇ.సి.జి., ఇది ఎండోస్కోపీ. ఇది అలా్ట్రసౌండ్‌ స్కాన్‌ రిపోర్ట్‌.

 ఇది ఎం.ఆర్‌.ఐ. స్కాన్‌ రిపోర్ట్‌. ఇది లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ది. మనిషి వీటిని కనిపెట్టి ఉండకపోతే డయాగ్నసిస్‌ ఇప్పుడున్నంత సమర్ధవంతంగా ఉండేది కాదు. అది ఖచ్చితంగా ముందడుగే. కానీ. దీని వెనకఉన్న మరో కోణం నీకు తెలుసా? ఈ టెస్టులన్నిటికీ కలిపి నాకు ఏడు వేలు ఖర్చయింది. ఇంతకీ నేను డాక్టర్‌ దగ్గరికి వెళ్ళిన కారణం ఏమిటో తెలుసా? కొద్దిగా తలనొప్పి, కాస్తంత జ్వరం. అంతే. అంత చిన్న అనారోగ్యానికి ఈ టెస్టులన్నీ అవసరమంటావా? ఆ పరికరాలన్నీ లక్షలు ఖర్చు చేసి కొన్నవి కాబట్టి ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవడం కోసం అవసరమున్నా లేకున్నా ప్రతీవారికీ మొత్తం పరీక్షలన్నీ వ్రాసి పారేస్తున్నారు. సందేహం వల్ల కలిగిన భయాందోళనతో రోగి ఆ పరీక్షలన్నీ చేయించుకోకుండా వుండలేడు.వ్యాధిని నిర్ణయించడానికి పరికరాలు కనిపెట్టడం ముందడుగు అయితే, ఆ పరికరాలు కనిపెట్టినందుకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవలసి రావడం వెనకడుగు. కాదంటావా?’’ అని అడిగాడు. నేను నోట మాట లేనట్టు ఉండిపోయాను.ఈ ఒక్క విషయంలోనూ మాకు వాదనలు తప్పేవి కాదు. మనిషి ఒంటరి జీవనానికి స్వస్తి పలుకుతూ కుటుంబ వ్యవస్థని కనిపెట్టడం ముందడుగు అని నేనంటే, ఆస్తి తగాదాల్లో తలలు నరుక్కుని చావడం వెనకడుగు అని వాడనేవాడు.నాగరికతని కనిపెట్టి మనిషి ఆకాశమంత ఎత్తుకి ఎదిగాడు అని నేనంటే రాజకీయపు రొచ్చుని కనిపెట్టి అధః పాతాళానికి కూడా దిగజారాడు అని వాడనేవాడు.