న్యూయార్క్‌ నుండి భారతదేశానికి వెళ్ళేందుకుగాను,జె.ఎఫ్‌.కె అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంటి నుండి మూడు గంటల ముందుగా బయల్దేరాను కారులో. పక్కన రాణి కూర్చున్నది.వెనుక మా పదేళ్ళ అబ్బాయి, ఆరేళ్ళ అమ్మాయి కూర్చున్నారు.నేను క్యాబ్‌లో వెళతానన్నాను. కాదు తనే డ్రాప్‌ చేస్తానంది రాణి.రాణి ఎయిర్‌పోర్ట్‌దాకా ఎందుకు వచ్చేది నాకు తెలుసు.ఈ గంట ప్రయాణంలో తీరిగ్గా నాకు క్లాసుతీసుకోవచ్చన్నది తన ఆలోచన. నేను ఇండియాలో ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎవరితో ఎలా మాట్లాడాలోవిపులంగా చెబుతుందన్నమాట!రాత్రి గుంటూరు నుంచి ఫోను వచ్చింది. నాన్న పోయారట!మధ్యాహ్నం ఫ్లయిట్‌కు గాని టిక్కెట్టు దొరకలేదు.అందుకే ఫోను చేసిన బాబాయికి చెప్పాను: నేను వచ్చిందాకా శవాన్ని ఉంచటం ఇబ్బందవుతుంది, ఆ కార్యక్రమం పూర్తి చేసేయ మన్నాను. కానీ, డబ్బు యావతో విదేశాలకు వచ్చింతరువాత ఇలాంటివి దిగమింగి ఊరుకోక తప్పదు!బాబాయి అడగనే అడిగాడు: ‘‘అయితే నీ భార్య రావటం లేదా?’’నాకు అబద్ధమాడక తప్పలేదు. ‘‘పిల్లలకు పరీక్షలు... వాళ్ళ కోసం తను ఉండాలి ఇక్కడ!’’అసలు రాణికి నేను వెళ్ళటమే ఇష్టం లేదు!‘‘శవాన్నయినా చూడలేనపడు మీరు అక్కడకు వెళ్ళి చేసేదేమున్నది... మీ సవితి తల్లిని ఓదార్చటానికా?... ఆమె వైపు కావాల్సినంత గుంపున్నది ఆ గుంటూరులోనూ, చుట్టుపక్కల ఊళ్ళలోనూ... మీరిపడు వెళ్ళా లనుకోవటంలో డబ్బు వృధా తప్ప ఒరిగేదేమీ లేదు!

’’కానీ దానికేం తెలుసు, నేనామెను ఎపడూ సవితి తల్లిగా చూడనేలేదని... స్వంత తల్లయితే ఎలా పెంచేదో గాని, ఆమె నాకు స్వంత తల్లి కూడా గుర్తుకు రానంతగా పెంచింది.... నా నాలుగో ఏట, నా తల్లిపోయిన రెండు సంవత్సరాలకు మా ఇంట కాలు పెట్టినప్పటినుండి....ఆమె అభిమానంగా చూడకపోతే, నన్ను అంతగా ప్రేమించకపోతే నేను ఈనాడు ఇంత వాడిని అయ్యేవాడినేనా?కాని దానికి రాణి భాష్యం వేరు. ‘‘ఆమెకు పిల్లలు లేరు కాబట్టి మిమ్మల్ని పట్టుకు వేలాడుతోంది- రేపు ఎటుబోయి ఎటు వస్తుందోనని! అంతేకాని, మీమీద ప్రేమతో కాదు!’’ఆమె నాకు స్వంత తల్లి కాదు అనే విషయం ఎవరో కొద్దిమంది వయస్సు మళ్ళిన వాళ్ళకు తెలుసేమో- అంతే!‘‘డాడీ! మా ఫ్రెండింట్లో చూశాను... కొండపల్లి బొమ్మలట... ఎంత బాగున్నయ్యో తెలుసా... నువ్వు కొనుక్కు రావాలి నాకు ఓ పదన్నా... ఈ సారి బొమ్మల్లో పెడదాం!’’ అన్నది జిక్కి- బామ్మ పేరు!‘‘నాకు నాన్నా!’’ మా అబ్బాయి జగన్‌ అడిగాడు.‘‘చెప ఏం కావాలో... చెల్లెలికి బొమ్మలు, అమ్మకు చీరలు... నీదే సెటిల్‌ అవ్వాలి!’’‘‘బామ్మను తీసుకురా!’’ఒక్కసారి రాణి విసురుగా కొడుకు వంక చూసింది. ‘‘నోర్మూసుకు కూర్చో!’’ అంటూ ఒక్క కసురు కసిరింది.