ముద్దులన్నీ ముచ్చట్లాడుకునే వేళ హద్దులన్నీ అంబరాన్ని దాటి వెళ్ళే సమయాన, వస్త్రాలన్నీ బహిష్కారమై, అందాలన్నీ బహిర్గతమై, అనాచ్ఛాదనల తనువుల తపన తారట్లాడే సుముహూర్తాన మురిపాల క్రీడ మొదలవుతుందట. ‘‘జలపాతానికి వెళ్ళే దారి మూసివేయబడినది. ఈ రహదారి వెంట ప్రయాణం నిషిద్ధం... మరియు ప్రమాదకరం’’ అన్న బోర్డు తుపపట్టిపోయింది. చుట్టూ ముళ్ళకంచె... జనసంచారం లేని, వుండని నిర్మానుష్య ప్రదేశం.గోధూళివేళ, గోధూళి ఎరుపు మెరుపులో, సాయంసంధ్య అందంగా అలంకరించుకొని, ప్రకృతితో మమేకమయ్యే వేళ.5.36 పి.యమ్‌.డిసెంబర్‌ నెల చివరివారంలో ఓరోజు. చలి తాలూకు ఉధృతి... ఆ పరిసర ప్రాంతాలను ఆక్రమించుకుంది.ఆ అడవి ప్రాంతంలో, అక్కడ ఆ మూడు జంటలు వుంటాయన్న ఊహ మరెవ్వరికీ రాదు.అక్కడ మూడు జంటలు ఒక బెడ్‌షీట్‌ని నేలమీద పరుచుకుని కూలబడ్డాయి. ఆ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో జీపు పార్కుచేసి వచ్చారు. అక్కడినుంచి జీపు నడవదు. కాలిబాటనే నడిచిరాక తప్పదు.ఆ మూడు జంటల పెళ్ళిళ్ళు ఒకేరోజు జరిగాయి. అడ్వంచర్‌ అంటే యిష్టపడే ఆ మూడు జంటలు జలపాతం అందాలు చూడాలని నిర్ణయించుకున్నాయి. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఓ వెన్నెల కిరణం జలపాతాన్ని స్పృశిస్తుంది.

ఆ క్షణాన జలపాతం రంగులు మారుతుంది. జలపాతం దగ్గర రొమాన్స్‌ జరుపుకోవాలన్నది ఆ దంపతుల కోరిక. అందుకే సాహసించి మూడు జంటలు బయల్దేరాయి. ఆ జంటలే - ప్రేమ, వినయ్‌; జెనాలియా, క్రిస్టొఫర్‌; షర్మిల, శ్రీకర్‌. శ్రీకర్‌ ఓసారి చుట్టూ చూశాడు. చీకట్లు ఆ అడవిని ఆక్రమించుకున్నాయి. వాతావరణం ఆహ్లాదంగా వున్నా, నిర్మానుష్యమైన ఆ ప్రాంతం ఒకవిధమైన గగుర్పాటును కలిగిస్తుంది.‘‘డియర్‌ ఫ్రెండ్స్‌.. మనం ఈ ముళ్ళకంచె లోపలి నుంచి లోపలికి వెళ్ళాక... జలపాతం దగ్గరికి వెళ్ళడానికి మూడు దారులున్నాయి. మూడు ప్రమాదకరమైన దారులే. క్రూర మృగాలు వుండవచ్చు. విష కీటకాలు వుండవచ్చు. ఏ దారి నుంచి వెళ్ళినా మనం ఆరు గంటల్లో జలపాతం చేరుకుంటాం. జలపాతానికి మూడువైపులా మన మూడు జంటలూ చేరుకుంటాయి. దెన్‌ ఆఫ్టర్‌... ఒక్కక్షణం ఆగి అందరివంకా చూశాడు. అమ్మాయిలు కాసింత సిగ్గుతో తలలు వంచుకున్నారు. షర్మిల శ్రీకర్‌వైపు చూసి కన్ను గీటింది.‘దాదాపు ఆరు గంటల ప్రయాణం. ఇందులో నాలుగు గంటలు మాత్రమే ప్రయాణానికి సరిపోతుంది. మిగతా రెండు గంటలు మధ్య మధ్య రెస్ట్‌ తీసుకోవడానికి... చిన్నచిన్న రొమాంటిక్‌ సరదాలు తీర్చుకోవడానికి.సో... మనం పన్నెండు గంటలకు జలపాతాన్ని చేరుకుంటాం. పన్నెండు నుంచి తెల్లవారుఝామున ఆరు వరకూ... మన ప్రపంచం మనదే... ఆ తర్వాత జలపాతం దగ్గర వున్న రతీమన్మధుల ఆలయంలో కలుసుకుందాం. అక్కడ్నుంచి మనం వెనక్కి వచ్చేయొచ్చు. ఇది మనకు అరుదైన అవకాశం. సరిగ్గా ఆరు కావస్తుంది. మనం బయల్దేరుదామా’’ శ్రీకర్‌ చెప్పి అందరివైపు చూశాడు.