చల్లటి గాలి చరుస్తున్నట్టు ముఖం మీద ఈడ్చి కొట్టడంతో ఖాసింభాయ్‌ ఆలోచనా సుడిలో నుంచి బయటపడ్డాడు. వాతావరణంలో చకచకా మార్పులు జరిగిపోతున్న సంగతి అప్పడు గమనించాడతను.పొడవుగా, సన్నగా, తైలసంస్కారం లేని జుత్తుతో, పోషణ లేక ఎండిపోయి అస్థి పంజరాన్ని తలపిస్తున్న దేహంతో ఉన్న అతనిలో అసలు ఊపిరి వుందా అనే అనుమానం కలుగుతుంది ఎవరికైనా.అప్పటి వరకూ వెలుగులు విరజిమ్మిన సూర్యభగవానుడు అదృశ్యమైపోయాడు. ప్రళయం రానుందా అన్నట్లు తూర్పు నుంచి కరిమేఘాలు నల్లని మత్తగజాల్లా దూసుకొస్తూ కనిపించాయి.అదే సమయంలో ఎక్కడో ఫెటిల్లున పిడుగుపడింది.టప్‌...!ఆ వెంటనే ఒకే ఒక్క చినుకు ముడుతలుపడిన ఖాసింభాయ్‌ నుదటిని ముద్దాడింది.‘వర్షం వచ్చేలా వుంది!’ అనుకుంటూ నోట్లో సగం వరకు కాలి ఆరిపోయిన బీడినీ తుపుక్కున ఊసి లేచి నిలబడ్డాడు.ఒకసారి చుట్టూ చూసాడు. మనిషి ఎంత తాపత్రయపడి, ఎన్ని సంపదలు కూడేసినా, ఎంత శ్రీమంతుడైనా అతని శాశ్వత స్థానం ఇక్కడే అన్నట్లు ఎక్కడ పడితే అక్కడే వరుసగా సమాధులు కనిపించాయి.ఖాసింభాయ్‌ గత ముప్ఫై ఏళ్ళుగా ఆ ఖబరస్తాన్‌లో కాటికాపరిగా పని చేస్తున్నాడు. కటిక దరిద్రులు, కోటీశ్వరుల మధ్య బతికి వున్నప్పుడు కనిపించిన వ్యత్యాసాలు అక్కడ లేకపోవడం అతనికి ఒక్కోసారి వింతగా అనిపిస్తూ వుండేది. తొలి నాళ్ళల్లో. కాలం గడిచే కొద్దీ అది కాస్త కనుమరుగైపోయింది. వర్గాలు, వర్ణాలు, అంతస్తుల స్థాయీ భేదాలు మనిషి సృష్టించుకున్న చట్రాలని అతనికి తేటతెల్లమవడమే కాకుండా...ఇదంతా ఆ పైవాడు ఆడిస్తున్న నాటకమనే అభిప్రాయం అతనిలో బలంగా నాటుకుపోయింది.అందుకే యాంత్రికంగా తన పని తాను చేయడం, ఆ పూటకి దక్కిన దాంతో సంతృప్తి చెందడం అలవాటు చేసుకున్నాడు.

‘‘ఖాసింభాయ్‌! ఏమిటీవాళ ఖాళీగా వున్నావ్‌.’’ ఖబరస్థాన్‌ బయటి గేటు వద్ద నిలబడి అతన్ని పలకరించాడు ఇంటింటికి పాల ప్యాకెట్లు వేసే దామోదరం.మెల్లగా నడిచి అతని వద్దకు చేరుకుని ‘‘అదే వింతగా వుంది. ఎప్పుడూ లేనిది ఈ వేళ ఉదయం నుంచీ ఒక్క శవమూ రాలేదు’’ అన్నాడు ఖాసింభాయ్‌.‘‘వస్తుందిలే! ఇప్పుడు టైము మూడే కదా అవుతోంది.’’‘అంతేలే’ అన్నట్టు తల పంకించాడు ఖాసింత భాయ్‌.‘‘ఖాసింభాయ్‌! నువ్వు రోజుకు ఎంత సంపాదిస్తావ్‌?’’ అంటూ ప్రశ్నించాడు దామోదరం.‘‘వందా నూటయాభై వరకు వస్తుంది. ఒక్కోసారి అంత కంటే ఎక్కువ కూడా రావొచ్చు.’’‘‘ఇంత పెద్ద వయసులో ఇలా కష్టపడుతున్నావ్‌ కదా... నీ పిల్లలు నిన్ను చూడరా?’’ అంటూ ప్రశ్నించాడు దామోదరం.ఆ మాటకు ఖాసింభాయ్‌ ఫెళ్ళున నవ్వాడు.‘‘లోకంలో ఎక్కడా లేనిది నాకే జరుగుతుందని నువ్వెలా అనుకుంటున్నావ్‌? ఏ పిల్లలైనా ఇప్పుడు తల్లిదండ్రులను చూస్తున్నారా? తమను కనీ పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులంటే ఇప్పటి పిల్లలు గుదిబండలనుకుంటున్నారు. వారి నుంచి తమకు సంక్రమించాల్సింది ఏమైనా వుందా అని చూడటం తప్ప వారి ఆరోగ్యం ఎలా వుంది? వారితో ప్రేమగా ఒక్కమాట మాట్లాడామా లేదా అని వారను