‘‘ఈసారి ఏన్యువల్ కాన్ఫరెన్స్ గోవాలో పెడుతున్నారంటగా..’’ కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి, ఆ మాటలు అంటుంటే మధుకర్‌కి.‘‘నీ కెందుకు అంత ఆనందం. నువ్వు రావుగా..’’ అన్నాను నేను. నాకు తెలిసినంత వరకూ గ్రూప్ హెడ్స్ మాత్రమే పాల్గొంటారు ఏన్యువల్ కాన్ఫరెన్స్‌లో.‘‘నేనయితే ఏమిటి, నువ్వయితే ఏమిటి? అక్కడేదో ‘‘కాజుఫెనీ’’ అని నేటివ్ డ్రింక్ దొరుకుతుందంట. ఒక బాటిల్ తెచ్చి పెట్టరా, వచ్చేటప్పుడు’’‘‘తెచ్చి పెడతాను కానీ, నీకు మన ఎమ్‌డీ గారి కండిషన్ తెలుసు కదా.నాకేమయినా సహాయం చెయ్యరాదూ..’’‘‘ఏడిసినట్లుంది. కథలూ, కాకరకాయలూ రాసే నీకు, నేను సాయం చెయ్యటం ఏమిటి..? సరేగాని ఈ సారి థీమ్ ఏమిటట?’’‘‘ప్రేమ.. లవ్’’‘‘అబ్బో.. నీకిష్టమయిన సబ్జక్ట్ కదా! నా సాయం అక్కర లేదులే! సరే కానీ బాసూ..మన ఎమ్‌డీ కుమారస్వామి గారేంటి ఈ మధ్య మరీ కుర్రాడయి పోతున్నాడు.. అంత కోపంగా చూడనక్కర లేదులే కానీ, నా ప్రసాదం నాకు రాకపోతే మాత్రం ఊరుకునేది లేదు’’ బెదిరిస్తూ వెళ్ళిపోయాడు మధుకర్.కుమారస్వామి గారు ఎమ్‌డీగా వచ్చిన తర్వాత, మా కంపెనీలో అనేక మార్పులు జరిగాయి. ప్రాఫిట్ గ్రాఫ్ పైపైకి పోయేకొద్దీ, స్టాఫ్ జీతభత్యాలు అడగకుండానే పెంచారు. పనిని ఆస్వాదించే వాతావరణం కల్పించారు. అందులో భాగమే ఈసారి కంపెనీ ఏన్యువల్ కాన్ఫరెన్స్ రొటీన్‌గా హెడ్డాఫీసు నాలుగు గోడల మధ్య కాకుండా గోవాలో ఏర్పాటు చేసారు. కాకపోతే ఆయన విధించే ఒక షరతే చాలా మందికి మింగుడు పడదు.
కాన్ఫరెన్స్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ, ఆయనిచ్చిన థీమ్ మీద కనీసం అయిదు నిమిషాలన్నా మాట్లాడాలి. కల్పితమయినా, స్వాను భవమయినా ఫర్వాలేదు. ఈ సారి ఆయనిచ్చిన థీమ్.. ప్రేమ. ‘‘ఏమయ్యా కుమార్.. ఇప్పుడన్నా మొదలు పెడతావా... ఇంకా బతిమాలించుకుంటావా?’’ మా ఎమ్‌డీ కుమారస్వామి గారి గొంతు ఖంగుమంటు వినిపించింది.రాత్రి పన్నెండవుతూంది. కనిపించని శృంఖలాల్ని వదిలించుకోవటానికి పెనుగులాడుతున్నట్లుంది సముద్రం. చల్లని చేతుల్తో సముదాయిస్తున్నట్లు, చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. ఎదురుగా మేము దిగిన హోటల్ ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తూంది. నిద్రమత్తుకి మందుమత్తు తోడయి, అందరూ నా వంక దీనంగా చూస్తున్నారు - తొందరగా అవగొట్టవయ్యా మగడా.. పోయి పడుకోవాలన్నట్లు.మొక్కుబడిగా కొందరూ, మొహమాటంగా కొందరూ, అందరూ చెప్పటం ముగించారు. నేను తప్ప పుస్తకాల్లో చదివిన కొటేషన్స్ కొందరు చెప్తే, తమ తమ ప్రేమ కథలే కొందరు చెప్పారు. మా సేల్స్ హెడ్ అయితే దేవదాసు కథ చెప్పబోయాడు. మొత్తానికి మా కుమారస్వామి గారికి మాత్రం ఏమీ నచ్చలేదని అర్థమయిపోతుంది.‘‘ఇది ముత్యం కథ. ముత్యం భార్య కథ. మరి దీన్ని ప్రేమ కథ అనవచ్చో, లేదో విన్నాక మీరే చెప్పండి.’’ అంటూ ప్రారంభించాను.