సరళ అతన్ని చూస్తోంది. తను రెండు నిముషాలుగా అతనినే చూస్తున్నానని తెలిసి, కళ్ళు దించింది.ఎదురుగా చిన్న కంప్యూటర్‌.పెద్ద గది. చలిగా లేదు. చల్లగా ఉంది.ఆ పెద్ద గదిలో వాళ్లిద్దరే ఉంటారు. గది వెనకగా ఓ ఫైలింగ్‌ కేబినెట్‌, చిన్న స్టీల్‌ ఆల్మైరా, విడిగా రెండు కుర్చీలు. ఇంకో ఫర్నిచర్‌ కాని, ఇతర వస్తువులు కాని ఇంకేవీ లేవు. శబ్ద కాలుష్యం తగలని గది.ఆ గది అంతా మళ్లీ ఓసారి చూసి, అతనిని మళ్ళీ ఓసారి చూసింది.కుడి చెంపన బాల్‌పాయింట్‌ పెన్‌ గుచ్చి, దీక్షగా, తదేకంగా, అతను గ్లాస్‌ టాప్‌ ఉన్న ఎదురుగా ఉన్న టేబిల్‌మీద పరుచుకున్న బ్లూ ప్రింట్స్‌ చూస్తున్నాడు.అతను తన పనిలో శ్రద్ధగా అలా ఉండడం ఆమెకు ముచ్చటగా ఉంది.అతను లేచి నిలుచున్నాడు. ఆరు అడుగులపైన, పొడవైన అతని పొడవు ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది. నడుము పైభాగం వంగినట్లుగా ఉండి కాస్త గూనిలా అనిపిస్తుంది కాని, కాదు.మనిషి నలుపు. కాస్త పొడవైన ముక్కు. అతని ముంజేతులు మగవాడి చేతుల్లా, మోటుగా ఉంటాయి. మరీ గుబురుమీసాలు. సరిగా దువ్వుకోని, దువ్వినా లొంగని జుట్టు.అతను నుంచునే, చెంపన అరచేయి ఆన్చి, ఇంకోసారి ఆ బ్లూప్రింట్స్‌ను ఆకుపచ్చ పిల్లికళ్లతో చూస్తున్నాడు.

 అతని ఒత్తయిన కనుబొమ్మల కింద ఆ ఆకుపచ్చ కళ్ళల్లో కదలిక లేదు. చూపు అంతా టేబిల్‌పై ఉన్న డ్రాయింగ్స్‌ మీదే.పనిలో ఉన్నప్పుడు పరిసరాలేవీ అతన్ని తాకవు. పని చేస్తున్నప్పుడు అతని ఏకాగ్రత ఆమెకు ఇష్టం. ఆమె ఇష్టం కాని, ఇతర ఇష్టాలు, ఆలోచనలు కాని అతనికి తెలియవు. అతను ఎక్కువగా మాట్లాడడు. ఇక ఆమె లోకం ఆమెది. అతని ముభావం. సీరియస్‌గా ఉన్నట్లు ఉండడం ఆమె చాలా మామూలుగా తీసుకుంటుంది.ఉన్నట్టుండి ఆ మూడు బ్లూప్రింట్స్‌ చాలానీట్‌గా అందుకుని, కుర్చీ నెమ్మదిగా వెనుకకు జరిపి, చప్పుడు చేయని షూస్‌తో నడుస్తూ, అతను గది గుమ్మం తెరచి, మూసి మాయమైపోయాడు.ఆమెకు పక్కున నవ్వొచ్చింది. పలువరస తెల్లగా, ముద్దుగా మెరిసింది.అతను వెళ్ళిపోగానే సరళ చాలా వంటరి అయిపోయినట్టు అయిపోయింది.‘టూ ఈజ్‌ కంపెని’ ఆనుకొని మళ్ళా నవ్వుకొంది.సరళ అమ్మను తలచుకుని ఉల్లాసంగా అయింది.ఆమెకు అమ్మ, అమ్మమ్మ - ఇద్దరే ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో. అమ్మ తన దగ్గర.సరళ తండ్రి పద్ధెనిమిది ఏళ్ళక్రితం - ఆమె అయిదోఏట - సడన్‌గా పోయాడు. ‘మాసివ్‌ హార్ట్‌ఎటాక్‌.’ అమ్మ, అమ్మమ్మల దగ్గర పెరిగింది. ఉన్న ఒక్క మేనమామ పధ్నాలుగు ఏళ్లనాడు - భార్యను, ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని అస్సాం వెళ్లిపోయాడు. ఉద్యోగం కోసం, ఉద్యోగం చేస్తూ, భార్యపిల్లల సహకారంతో - ఓ చిన్న స్కూలు నడుపుతున్నాడు... టీ తోటల్లో పనిచేసే వాళ్లకు, వాళ్ల పిల్లలకు చదువు చెబుతూ, వాళ్లల్లో ఒకే కుటుంబంగ కలిసిపోతూ, ఆ దూరం అమ్మను తమ్ముడిని చాలాదూరం చేసేసింది. రెండేళ్లకో చిన్న ఉత్తరం. సంవత్సరానికో గ్రీటింగ్‌.