భళ్లున కిటికీ అద్దం పగిలింది.క్రికెట్‌ బంతి వచ్చి బంకత్‌లాల్‌ పొట్టమీద పడింది.మాగన్నుగా నిద్రపోతున్న బంకత్‌లాల్‌ ఉలిక్కిపడి లేచాడు. పొట్టమీద పడిన బంతి చేతిలోకి తీసుకుని, ఉగ్రరూపంతో కిటికీ తలుపులు తెరిచి బయటకు చూసాడు. మేడమీంచి వీధి బాగానే కనిపిస్తుంది. చేతిలో బ్యాటు పుచ్చుకుని నిలబడింది మరెవరో కాదు. స్వయానా మనవడు ముఖేష్‌! మిగతా కుర్రాళ్ళు ‘హుష్‌కాకి’లా మాయమయ్యారు.‘వీధిలో క్రికెట్‌ ఏమిటి? నువ్వు మేడమీదికి రా ముఖేష్‌’ పెద్దగా అరిచాడు బంకత్‌లాల్‌.‘ఊహూఁ.... నేను రాను. బంతి ఇటు విసురు..’ గారాబం వల్ల కలిగిన ధైర్యం అది.‘నేను కిందికి వస్తున్నా ఉండు’ అంటూ గబగబ మెట్లు దిగి కిందికి వెళ్లే సరికి వీధిలో ఎవరూలేరు. బంకత్‌లాల్‌ అసహనంగా అటుఇటు వెతికాడు. చివరికి కోడలుతో ఫిర్యాదు చేద్దామని వెళ్ళేసరికి అక్కడ చీరకొంగు చాటున దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాడు ముఖేష్‌! పన్నెండేళ్ళొచ్చినా వీడికి కుదురులేదనుకుంటు-‘అమ్మాయ్‌. వీడి అల్లరి బాగా ఎక్కువైంది. బజార్లో కుర్రాళ్ళతో వేళాపాళా లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు. మేడపైన కిటికీ అద్దం కూడా పగల కొట్టాడు’’.‘నేను కోప్పడతాలెండి మామయ్యగారు... మీరు విశ్రాంతి తీసుకోండి’ అంది వినయంగా కోడలు పూజ.‘ఇంకెక్కడ విశ్రాంతి! వీడి దెబ్బకి నిద్రకాస్తా పారిపోయింది’ అంటూ మేడ పైకి వెళ్లాడు.

మంచం మీద నడుం వాల్చాడన్న మాటేగానీ, పోయిన నిద్రపోయినట్లే ఉండి పోయింది. ఆలోచన్లు కందిరీగల్లా ముసురుకున్నాయి.ఉదయం శేషగిరి మాస్టారితో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.‘బంకత్‌లాల్‌గారూ! ఇన్నాళ్ళూ ఈ స్కూలే నా జీవితాశయంగా రాత్రింబగళ్లు దీనిసేవలో బతికాను. నా తర్వాత దీని బాధ్యత తీసుకోవాల్సిన ఒక్కగానొక్క కొడుకు నా కళ్లముందే కాన్సర్‌తో చనిపోయాడు. ఇప్పుడు నేను ఏకాకిని. నాకెవరూ లేరు. ఈ స్కూలుని అమ్మి చివరి రోజులు కాశీలో గడపాలనుకుంటున్నాను. దీన్ని న్యాయమైన ధరకి మీరే కొనుక్కోండి’ అన్నాడు చేతులు జోడించి.‘మాస్టారూ! ఎప్పుడో మీ పెద్దలకాలం నాటి స్కూలు ఇది. ఎంతలేదన్నా అర ఎకరం వైశాల్యం ఉంటుంది. దీన్ని కొనగల స్తోమతు నాకు లేదు’ అని తప్పించుకోచూశాడు.‘లేదు. అలాగనకండి. నేను అమ్మితే మీకు తప్ప ఎవరికీ అమ్మను. మీరెంత ఇస్తే అంతే తీసుకుంటాను. డబ్బు కూడా మీరు ఒక్కమాటు ఇవ్వక్కర్లేదు. మీరు ఇవ్వగలిగినంత ముందు ఇవ్వండి మిగతాది నేను కాశీలో ఉండే చిరునామాకి పంపండి’.‘మాస్టరుగారూ! ఎందుకిలా నష్టపోదామనుకుంటున్నారు? వేరే వాళ్లకి అమ్మితే చాలా లాభం వస్తుంది. నేను బేరం చూస్తాను’.బంకత్‌లాల్‌గారూ! మీ నాన్నగారూ మా నాన్నగారూ మంచి మిత్రులు. కష్ట సమయాల్లో మా కుటుంబాన్ని మీ నాన్నగారు ఆర్థికంగా ఆదుకుని నిలబెట్టారు. అలా చేయకపోయి ఉంటే ఎప్పుడో ఈ స్తలాన్ని అమ్ము కోవాల్సి వచ్చేది. మీరు మాత్రం మాకు సాయం చెయ్యటం లేదా? ఇవన్నీ మర్చిపోయి, కేవలం లాభం కోసం వేరేవాళ్లకి అమ్ముకోనా?! అంతేకాదు మీరైతే దీన్ని సద్వినియోగం చేస్తారు. ఆ నమ్మకం నాకుంది’.