చెక్‌పోస్ట్‌ వద్ద సిగ్నల్‌ పడటంతో నా బైక్‌ కీచుమంటూ ఆగింది. సిగ్నళ్ల దగ్గర ఆగడమంటే చిరాగ్గా వుంటుంది. అడుక్కునేవాళ్ళు, చిన్న చిన్న వస్తువులు, పేపర్లు బలవంతంగా అమ్మాలని ప్రయత్నించేవాళ్ళు... దానికి కారణం.కానీ తప్పదు కదా! ఆగిన మోటార్‌ సైకిల్‌ పై నుండి యధాలాపంగా ఎడమవైపుకు చూశాను. అక్కడ పది, పన్నెండేండ్ల వయసున్న కుర్రాడు ఓ చేత్తో పుస్తకాల సంచి తను నిలుచున్న పేవ్‌మెంట్‌ గోడమీద తన వెంట తెచ్చుకున్న బరువైన ఓ మూట కనిపించింది. అదేదో ధాన ్యం మూటలా కనిపిస్తోంది. ఆ మూట అతని శక్తికి మించిందిగా ఉంది.తనను, తనతోపాటు ఉన్న బరువును తాను వెళ్ళవలసిన గమ్యస్థానానికి చేర్చమని ఆ దారిన బైక్‌ల మీద, స్కూటర్ల మీద వెళ్ళేవాళ్ళను అడుగుతున్నాడు. చాలా రిక్వెస్టింగ్‌గా ఉంది అతడు అడిగే పద్ధతి. దాంతో అతని రిక్వెస్ట్‌ను అంగీకరించాలనిపిస్తోంది. కాని అతని పక్కన ఉన్న ఆ బరువులు చూస్తే అతనికి లిఫ్ట్‌ ఇవ్వాలంటే కష్టంగా కూడా అనిపిస్తోంది. అందుకే ఎవ్వరూ అతనికి లిఫ్టివ్వడానికి సాహసించలేదు. ఆ జాబితాలో నేను కూడా చేరాను. అయితే అందరిలా ముందుకు కదలలేక పోతున్నాను. దానికి కారణం.. అక్కడ ఆ బరువులతో నిలబడి వున్న కుర్రాడిలో నా బాల్యం అద్దంలో కనిపించినట్లు కనిపిస్తోంది.

 మిట్టమధ్యాహ్నం స్కూలునుండి ఇంటికి భోజనానికి వెళుతూ... ఒక చేత్తో పుస్తకాల సంచి... కడుపులో ఆవురావురుమనే ఆకలి... దానికి ఆజ్యం పోస్తునట్లు కోమటివాళ్ళు ఇండ్లలో మధ్యాహ్నం పూట వచ్చే కమ్మటి వాసన లు - బండి నుండి వచ్చేటప్పుడు మన వెచ్చాల అంగడినుండి బియ్యం మూట తీసుకు రమ్మని నాన్న పెట్టిన బాధ్యతను శిరసావహిస్తూ...పుస్తకాల సంచి ఒక పక్క ... మరోపక్క నా శక్తికి మించిన బరువు.. ఆ బరువు మోసుకుంటే ఇంటిదారి పడితే పేదవాడి సంచిలో ఇమడలేని ధనవంతుడి బియ్యం- ఆ సంచిని చీల్చుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటే పుస్తకాల సంచిలోని పుస్తకాలకు వేసుకున్న అట్టను నిర్ధాక్షిణ్యంగా చించి ఆ చిల్లులకు అడ్డంగా పెట్టుకుంటూ... బరువును బాధ్యతగా భరిస్తూ సగం దూరం వచ్చేసరికి మొలతాడు సహాయంతో నిలిచివున్న నిక్కరు క్రిందికి జారిపోతుంటే మూట ఓ అరుగుపై దించి నిక్కరును దాని స్థానానికి చేర్చి మొలతాడు బిగించి... ఇక ఊడదు అనుకున్నాక మళ్ళీ బరువును ఎత్తుకుని ముందుకు సాగుతుంటే చెప్పు ఉంగటం ఊడిపోతే. మళ్ళీ బరువు దించుకొని చెప్పును సరిచేసుకుని అది ఊడకుండా పిన్నీసు గుచ్చి శాంతింపజేసి కాలికి తొడుక్కుని బరువును బుజాలపైకి ఎత్తుకుని చిరచిరలాడే ఎండ దాడి చేస్తుంటే సంచి పిగులుతుందేమో, మళ్ళీ నిక్కరు ఊడిపోతుందేమో, ఎక్కడ మళ్ళీ చెప్పు ఊడిపోతుందో అనే భయాలు దాడిచేస్తుంటే బరువుతో పాటు వీటన్నింటినీ సిలువను మోస్తున్న క్రీస్తులా - బరువుగా.. భారంగా గమ్యం ఎప్పుడు చేరుకుంటానా అనే ఆశతో..