ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఏ రోజుకు ఆరోజు నిద్రలేస్తూనే ఈ ప్రపంచాన్నీ, అది మన మీదకు విసరే సవాళ్ళను తిట్టుకుంటూ, వాటిని ఎదుర్కోవలసిన అగత్యాన్ని ద్వేషిస్తూ, మళ్ళీ నిద్రలోకి జారుకోవాలనుకునేవారు మొదటి రకం. మనలో చాలామందిమి ఈ కోవలోకే వస్తాం. జీవన సత్యాల నుంచి పలాయనం చిత్తగించడానికి ఈ తరహా మనుషులు నిద్రను ఆశ్రయిస్తారు. వీరిది మగత నిద్ర కాదు, గాఢ నిద్రే. ఆ గాఢ నిద్రనుంచే వీరు మెలకువలోకి వస్తారు.ఇక రెండో తరహా మనుషులున్నారు. ఈ కోవలో చాలా కొద్దిమందే ఉంటారు. నిత్యం మెలకువగా ఉండటానికి. వారికి నిద్ర అక్కర్లేదు. వారి దృష్టిలో జీవితమంటే ఓ విజయ యాత్ర, ఏదో సాధించాలనే దీక్ష. వారు మరుసటి రోజు కోసం ఎదురుచూస్తుంటారు. ఎపడు తెల్లవారుతుందా, ఎపడు ఆనందంగా జీవనసంఘర్షణలోకి దూకుదామా అని ఉవ్విళ్ళూరుతుంటారు. తమ కలలు నిజం చేసుకోవడానికి ముందుకు ఉరుకుతారు. ప్రతి రోజూ ఈ జీవన పోరాటంలో తాము సాధించిన విజయాలను తలచుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. వారికి నిద్ర అనేది రెండు పోరాటాల మద్య సంతోషకర విరామం. వారు నిద్రలో మహాస్వప్నాలు కంటారు. అయితే, వీరిది గాఢనిద్ర కాదు, మగత నిద్రే. రోజూ నిద్ర లేవగానే తమ కలలనునిజం చేసుకోవడానికి నడుం బిగిస్తారు. ఈ రెండు రకాల మనుషుల మధ్య బోలెడంత తేడా ఉంది. అది నక్కకీ నాగలోకానికీ మధ్య ఉండే తేడా, నాయకుడికీ అనుచరుడికీ మధ్య ఉండే తేడా.్‌్‌్‌ఓ శీతాకాల ఉదయ సంధ్యలో, చంద్రుడు నింగినుంచి ఇంకా తొలగిపోకముందే, నేను ఒంటరిగా నడక మొదలు పెట్టాను.అన్నట్టు, నేను పైన చెపకున్న రెండు కోవల్లో ఏ ఒక్కదానికీ చెందను.నేను తృప్తిగా జీవిస్తున్న మనిషిని. నేను సాధించాలనుకుంటున్న స్వప్నాలేమీ లేవు. నన్ను నేను పై అంచెకు చేర్చుకోవడానికి ఎటువంటి సంఘర్షణా జరపడం లేదు. అలాగని రోజు మిట్టమధ్యాహ్నం వరకు నిద్రపోయే బద్ధకస్తుడినీ కాను. సాధించాలకునే విజయాలను తలచుకుంటూ రాత్రి బాగా పొద్దుపోయేవరకు నిద్రపట్టని కార్యసాధకుడినీ కాను. 

బహుశా, నేను జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించడం నేర్చుకున్న వ్యక్తిని కావచ్చు. అందుకేనేమో, నేను దేని గురించీ వెంపర్లాడను. అందువల్ల ఇతరులకు ఇవ్వడానికి నా వద్ద సలహాలేమీలేవు బోధించడానికి వివేక వచనాలేమీ లేవు. నాకు అనుచరులు అక్కర్లేదు. ఒక సామాన్య మానవుడిగా జీవించడమే నాకు ఇష్టం. నేను నిజంగా సామాన్యుడినే.నేను ఎపడూ కూడా ఒంటరిగానే నడకకు వెళతాను. నాకు తోడుగా ప్రకృతి అంతే. ఆ రోజు తెల్లవారుఝామున 5గంటలైంది ఆకాశంలో ఇంకా మెరుస్తున్న చంద్రుడు నాకు దారి చూపిస్తున్నాడు. చంద్రుడిని పశ్చమాన కొండల్లోకి తరిమివేయడానికి సూర్యుడు ఇంకా తూర్పున ప్రత్యక్షం కాలేదు. అలా నడుస్తూ, నడుస్తూ ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చాను. అక్కడ రాత్రి బస చేసిన ఉత్తర భారత టూరిస్టులు కనిపించారు. వారి బస్సులు కృష్ణా నది గట్టున కొండ వంపు దారిలో నిలిపివున్నాయి. ఆ టూరిస్టులు నదిలో ఉదయ స్నానాలు చేసి, ఆంజనేయ దర్శనానికి వెళుతున్నారు. నేను అలానే ముందుకుసాగుతూ ప్రకాశం బారేజ్‌ రోడ్డును దాటి కిందకు దిగాను. బకింగ్‌హాం కాల్వ మీది వంతెన పైన నడచి అమరావతి వెళ్ళే కృష్ణానది కరకట్ట రోడ్డుపైకి చేరాను. కరకట్టు రోడ్డు మొదట్లో పి.డబ్ల్యు.డి వర్క్‌షాప్‌ ప్రధాన గేటు వద్ద ఉన్న చిన్న కోర్టులో వీధి లైటు వెలుగులో కొందరు మధ్య వయసు పెద్దమనుషులు బ్యాడ్మింటన్‌ ఆడుతూ కనిపించారు. ఆట ఇచ్చే చురుకుదనం, జట్టుగా ఆడుకోవడంలోని ఆనందంతో వారు చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతున్నారు. మరి కొందరు నదిలో ఈత కొడుతున్నారు. నేను కరకట్ట దిగువన ఉన్న పొలాల్లాకి వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించసాగాను కరకట్ట మీద కొద్దిగా జనసంచారం ఉంది పొలాల మద్య నిశ్శబ్దంలో నా అడుగుల సవ్వడి, నా శ్వాస, నా గుండె చపడు తప్ప మరేమీ నాకు తోడు లేవు.