ఆరోజు కార్తీక పౌర్ణమి! అన్ని కోవెళ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుండి ఉపవాసం వున్న భక్తులు, సూర్యభగవానుడు సంధ్యాదేవి వడిలో సేదదీరుతున్న సమయాన కార్తీకదీపాలు వెలిగించి ఆ భగవంతునికి భక్తితో తమ హృదయ వేదనల్ని విన్నవించుకుంటున్నారు. కార్తీక దీప కాంతులతో ఇంచుమించు వూరంతా కళకళలాడుతోంది.అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వసుంధర నెమ్మదిగా వచ్చి తులసి కోట దగ్గర మట్టి ప్రమిదల్ని వెలిగించింది. ఆ దీపకాంతుల మధ్య పండు ముత్తయిదువులా వున్న ఆవిడ ముఖం మీది ముడతలు వార్థక్య లక్షణాలని స్పష్టంగా తెలియజేస్తున్నాయి! పచ్చటి మేనిఛాయ, పసుపు రాసుకున్న ముఖం, నుదుట నయాపైసంత కుంకుమబొట్టు, రెండు చేతుల నిండా ఎర్రటి మట్టి గాజులు, వెడల్పు జరీ అంచున్న ఎర్రటి చీరలో వసుంధర, నిండైన విగ్రహంతో, మారువేషం వేసుకొచ్చిన పార్వతీదేవిలా వుంది! ఆ సంధ్యవేళ ఆమె వెలిగించిన దీపాలు వింతకాంతుల్ని వెదజల్లుతున్నాయి.శ్రీనివాసరావుగారు వాకిట్లో ఒక మూల సరిగ్గా లైటు వెలుతురు పుస్తకం మీద పడేలా వాలు కుర్చీ వేసుకుని భక్తి పుస్తకాలు చదువుతూ దైవ ధ్యానంలో మునిగిపోయి వున్నారు. వసుంధర వడపప్పు, అరటిపళ్లు తులసమ్మకి నైవేద్యంపెట్టి అగరువత్తులు వెలిగించి భక్తితో కనులు మూసుకుని కొంతసేపు భగవంతుని ధ్యానం చేసుకుంది. ఆవిడకి కీళ్ల వాపులు! కూర్చుంటే లేవలేదు. లేస్తే కూర్చోలేదు. 

‘‘అమ్మ! అబ్బ!’’ అని ఆయాస పడుతూనే నెమ్మదిగా అన్ని పన్లు చేసుకుంటుంది ఆవిడ! తదేకంగా ఆవిడనే చూస్తున్న శ్రీనివాసరావు గారు అన్నారు. ‘‘మనం పడమటి దిశకు చేరుకున్నాం వసూ! పిల్లలు పెద్దవాళ్లయిపోయి అమెరికాలో సెటిలయి పోయారు. వాళ్లిప్పుడు విదేశీ గాలి పీల్చుకుంటూ విదేశీ సంస్కృతి వంట బట్టించుకుంటున్నారు!’’‘‘అవునండీ! వాళ్లకి ఈ దేశం అక్కర్లేదు. మాతృభూమి, మాతృభాష అక్కర్లేదు! మనల్ని అక్కడికి వచ్చీమంటారు! కాని మనం ఈ మట్టి వదిలి వెళ్లలేం’’ అంది ఆవిడ నిట్టూరుస్తూ.‘‘పోనీ లే వసూ! రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోక తప్పదు. రెక్కలు విరిగిన మనం ఎన్నాళ్లుంటాం చెప్పు?!వాసాంసి జీర్ణాని యథానిహాయన వాని గృహ్లా తినరోప రాణి!తధా శరీరాణి విహాయ జీర్ణాన్య న్యాని సంయాతి నవాని దేహీ!!మానవుడు ఏ విధంగా పాత వస్త్రాలను వదిలిపెట్టి వేరే కొత్త వస్త్రాలను ధరిస్తూ వుంటాడో అట్లే దేహాలను ధరించుచున్న ఆత్మ, నశించిన పాత శరీరాలను వదిలిపెట్టి కొత్త శరీరాలను ధరిస్తూ వుంటుంది! పునరపి జననం పునరపి మరణం! అవును. మన భౌతిక శరీరాలు ఈ మట్టిలోనే కల్సిపోవాలి! అదే నా కోరిక కూడా! కాని వసూ! కనీసం ఆఖరి చూపుకైనా వాళ్లు వస్తారంటావా? నాకు మాత్రం నమ్మకం లేదు!’’ ఆయన స్వరంలో బాధ సుళ్లు తిరిగింది.