చండీగఢ్ నిండా గులాబీలు, చామంతులు, గుల్‌మొహర్లు, బంతిపూలు విరగబూసిన కాలమది. నిట్టర్‌లో పై అంతస్తులో ఉన్న క్లాసు రూములో తలుపులు, కిటికీలు అన్నీ మూసి ఉన్నాయి. ఎయిర్ కన్డీషనర్ నుంచి వేడిగాలులు వీస్తున్నా చలి లోపలి నుండి వణికిస్తూ నా పళ్ళు కొట్టుకుంటున్నాయి. రెండు ఇన్నర్స్, పైన జాకెట్ వేసుకున్నా ప్రయోజనం కనబడడం లేదు. స్వప్న మేడం గొంతు తియ్యగా వినిపిస్తోంది. ముందు వరుసలో కూర్చుని, తల వంచుకుని వింటూ నోట్సు రాసుకొంటున్నాను. ఆమె గొంతు ఆగిపోయినట్లు అనిపిస్తే తల ఎత్తి చూశాను. కిటికీకి ఆనుకొని ఎటో చూస్తోంది ఆమె. అప్పటికే క్లాసు మొత్తం ఆమె వైపు కుతూహలంగా చూస్తోంది. ఆలోచిస్తూ ఆమె మా వైపు తల తిప్పింది. మొహం పాలిపోయి ఉంది. పెదాలు వణుకుతున్నాయి. చలికైతే కాదని ఖచ్చితంగా అర్థం అవుతోంది.హఠాత్తుగా ‘‘నాకో ఇల్లు కావాలి’’ అన్నది.
అందరూ చెవులు రిక్కించారు. ‘‘మీలో డే స్కాలర్స్ ఎవరు?’’ రెండో ప్రశ్న. ఎప్పుడూ చేతిలో హెల్మెట్టు, వీపు మీద లాప్‌టాప్‌తో కనిపించే నవీన్ చెయ్యి ఎత్తాడు. ‘‘నాకో ఇల్లు చూసి పెడతావా!’’ అడిగింది. నవీన్ మారు మాట్లాడకుండా లాప్‌టాప్ తెరిచి టకటకా కొట్టాడు. ‘‘ఇరవై రెండో సెక్టారులో టూ బెడ్ రూం ఆక్యుపేషన్లు ఉన్నాయి మేడమ్.’’‘‘వెళదాం పద’’ చకచక బయటకు నడిచింది.నవీన్ బండి తాళాలు వెతుక్కొని మా వైపు తిరిగి తమాషాగా కళ్ళెగరేసి ఆమె వెనకాల పరిగెత్తాడు.‘‘ఇక క్లాసు లేదు’’ రిచా కళ్ళు సగం మూసి నవ్వి మఫ్లర్ మెడకు బిగించి బయటికి గెంతింది.మొహమంతా అశాంతి అలముకొన్న స్వప్న మేడమ్ ముఖాన్ని తలచుకొంటూ నేను గది నుండి చివరగా బయటకు నడిచాను.నేను వచ్చిన కొత్తలో మొహం నేలకు వేలాడేసుకుని నాకు మొదటిసారి కనిపించిన స్వప్న మేడమ్ గుర్తుకు వచ్చింది. విశాలమైన ఆ రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఎండిన మానులు- తాము వదిలేసిన ఆకులు నడిచిపోయే వాళ్ళ కాళ్ళ కింద పొడి అవుతున్న చప్పుడు వినదలచుకోనట్లు- కొత్త ఆకులు ముఖానికి తొడుక్కొని ఆకాశం కేసి తేరిపార చూస్తున్నాయి. అప్పుడు ఆ ఒంటరి దారిలో మేమిద్దరమే ఉన్నాము. దగ్గరకు రాగానే ఆమె తల ఎత్తింది. ఆ మొహంలో ఈ లోకంతో సంబంధం లేని తనం, పరధ్యానం... ఇంకా ఏవో నాకు తెలియనితనాలు కనిపించాయి. ముఖంమీద ఒక పాయ వెంట్రుకలు కొత్తగా తెల్లదనాన్ని తెచ్చుకొని మెరుస్తున్నాయి. చండీగఢ్‌లో కనిపించే తెల్ల చర్మాలలాగా కాకుండా ఆమె చామనచాయ రంగుతో తేటగా ఉంది. పైగా చీర కట్టుకొని ఉంది. అక్కడ చీరలు చాలా అరుదుగా కట్టుకొంటారు. కుతూహలంగా చూశాను ఆమెను. ఆమె నా ఉనికిని గుర్తించినట్లు నాకు అనిపించలేదు.