రాత్రి పది గంటలైంది. ఎం.బి.ఎ. కోర్సు పుస్తకాలను అంతవరకు చదివి ప్రత్యూష నిద్రకు సిద్ధపడింది. అప్పుడు ప్రక్క గదిలో నుంచి తల్లి సరోజ, తండ్రి ప్రభాకరం మాటలు ఆమె చెవిన పడుతున్నాయి. ‘‘నా తమ్ముడు శేఖర్‌కి ఏం తక్కువ? ఆస్తి, అందం, చదువు, ఉద్యోగం, మేడ, కారు, అన్నీ వున్నాయి. మన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేస్తే వాడు దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఈ సంబంధం మీకెందుకు ఇష్టం లేదు?’’‘‘సరూ, నేను కూడా చెప్పేది విని, నిదానంగా ఆలోచించు. మంచి వరుడికి ఉండవల్సిన అర్హతలన్నీ నీ తమ్ముడిలో వున్నాయి. కాని ఆడపిల్లను మేనమామకిచ్చి పెళ్లి చేస్తే దగ్గరి రక్త సంబంధం వల్ల ఆ దంపతులకు పుట్టేపిల్లలు అవయవాలలో గాని, మెదడులోగాని లోపాలతో వుంటారని మన పెద్దలు చెప్పారు. ఈ కారణం చేతనే, నీ తమ్ముడి సంబంధం మన అమ్మాయికి వద్దంటున్నాను’’ ఆ మాటలు విని తండ్రితో తల్లి వాదించలేదు.మరుసటి రాత్రి మళ్లీ అదే సమయానికి తల్లి, తండ్రి తన పెళ్లి సంబంధం గురించి వాదించుకోవటం ప్రత్యూష విన్నది. ‘‘మన అమ్మాయికి మా అక్క కొడుకు చరణ్‌ సంబంధం బావుంటుందని నా ఉద్దేశ్యం. వాడికి బ్యాంక్‌ ఉద్యోగం వుంది. 

అందగాడు. మా అక్క, బావలకి ఒక్కడే సంతానం. వాడికి వేరే బరువు, బాధ్యతలు లేవు’’.‘‘ఆస్తి, సొంత ఇల్లు కూడా లేదు. కేవలం నెల జీతం మీద ఆధారపడేవాడిని చేసుకుని అమ్మాయి ఏం సుఖపడుతుది.. మీ మేనల్లుడి సంబంధం నాకిష్టం లేదు’’ అని సరోజ భర్తతో ఖచ్చితంగా చెప్పింది. కాని బావతో ప్రత్యూషకి పరిచయం మామయ్యతో కంటే ఎక్కువ వుండడం చేత బావ గురించి ఆలోచించింది. అతను అందగాడు కాదని ప్రత్యూష ఉద్దేశ్యం.ప్రభాకరం, సరోజ తమకు తెలిసిన వాళ్ల ద్వారా పెళ్లి సంబంధాలు చూస్తూ కూతురి ఎం.బి.ఏ. చదువు పూర్తి కాగానే ఆమెకి పెళ్లి చెయ్యాలనే నిశ్చయంతో వున్నారు. వాళ్ల కొడుకు రాకేష్‌ ఎం.సి.ఏ. చేసి ఉద్యోగాల వేటలో వున్నాడు. ప్రభాకరం రెవెన్యూ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సరోజ హౌస్‌వైఫ్‌. వాళ్లకి మేడ, కారు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా వున్నాయి. ప్రభాకరం ఒక ఏడాదిలో రిటైర్‌ కాబోతున్నాడు.