నా మిటంకుల్‌ మీరు చెప్పేది? మన జో...జ్యోతి...ఇంత పని చేసిందా?’’ నెత్తి మీద పిడుగు పడినట్లుగా అడిగింది స్వప్న.జీవం లేని నవ్వు నవ్వాడు రామకృష్ణ. ‘‘హూ...కన్నతండ్రిని దాన్ని ఎలా పెంచానో నీకు తెలుసు. ఒక్కగానొక్క కూతురు. నేను నీకు అబద్ధం చెప్పట్లేదమ్మా.’’నొచ్చుకుంది స్వప్న. ‘‘ఛ...ఛ..మీరలా అనుకోవద్దంకుల్‌. నాకు జ్యోతి ఫోన్‌ గానీ, మెయిల్స్‌ గాని ఇచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. మొన్ననే ఇండియాకి వచ్చాను. జ్యోతిని ఎప్పుడు చూద్దామా అని ఆతృతతో వచ్చాను. ఇంతకాలం మాట్లాడుకోకుండా ఉండలేదు మేము. ఇప్పుడు మీరు...చెబుతుంటే...’’ గొంతు జీరబోయింది స్వప్నకి.లోపల్నించి ఎవరో రోదిస్తున్న ధ్వని.‘‘ఆంటీ...పాపం చాలా అప్‌సెట్‌ అయినట్లున్నారు’’ అంది స్వప్న.లోపలకి తొంగి చూసి భార్యని కసురుకున్నాడు రామకృష్ణ.‘‘ఊరుకోవే....స్వప్నంటే ఇవాళ వచ్చింది కాబట్టి కొత్తగా ఉంది. నీకింకా అలవాటు కాలేదా? ఎన్నాళ్లు ఏడుస్తావ్‌?’’కళ్లు తుడుచుకుంది సుజాత.టాపిక్‌ మరల్చడానికన్నట్లు ‘‘ఇంతకీ...జ్యోతి ఇంజనీరింగ్‌ తరువాత ఏం చేసిందంకుల్‌?’’రామకృష్ణ చెప్పింది విని నివ్వెరపోతూ అడిగింది. ‘‘ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌లో ఎమ్‌బిఏ?....కళ్లకద్దుకుని పిలిచి మరీ జాబ్స్‌ ఇస్తారంకుల్‌?’’‘‘అదేనమ్మా నా బాధ. ఎన్ని కలలు కన్నాం తన గురించి...ఆడదయినా డాషింగ్‌గా పెంచాను. ఈరోజు అది చేసిన పనికి తల్లిదండ్రులం మేమే కాదు, తను చదివిన కాలేజీ లెక్చరర్స్‌, ప్రిన్సిపల్‌ అందరికీ అర్థం కాలేదు. దాని జీవితం చివరకి అనాధుల మధ్య ఓ అనాథగా ఉంది’’ ఆవేదనగా అన్నాడు రామకృష్ణ.ఆ మాటలకు లోపల సుజాత దుఃఖం ఉధృతమైంది.‘‘ఊరుకో...ఊరుకో...అది పోయిందనుకున్నాను. 

నువ్వు కూడా పోతే, పీడా పోతుంది.’’గాభరాగా అంది స్వప్న ‘‘ఏంటంకుల్‌ ఆ మాటలు...పాపం ఆంటీ’’‘‘లేకపోతే ఏమిటమ్మా. మెదడు ఉండే ప్రవర్తిస్తోందా అది?’’‘‘ఎన్నాళ్లయ్యింది జ్యోతి వచ్చి ఇక్కడికి?’’ఈసడింపుగా అన్నాడు రామకృష్ణ ‘‘వచ్చింది. నాలుగైదుసార్లు. కానీ...నేనే గుమ్మం కూడా ఎక్కనివ్వలేదు. దాని మనసు మార్చుకుని, మళ్లీ నేను చెప్పినట్లు వింటేనే తన ముఖం చూస్తాను.’’బాధగా నిట్టూర్చింది స్వప్న. కాసేపాగి సందేహిస్తూనే అడిగింది ‘‘పోనీ...పోనీ నన్ను ఓసారి జ్యోతిని కలవమంటారా?’’‘‘కలిసీ?’’‘‘తన మనసు మారుతుందేమో చూస్తాను. నా మాట కాదనదనే అనుకుంటున్నాను’’ ఆశగా అంది.నవ్వాడు రామకృష్ణ. ‘‘అది ఒకప్పటి జ్యోతి కాదమ్మా. చాలా పెద్దదయిపోయింది’’‘‘ఎంత పెద్దదయినా నా స్నేహితురాలే కదంకుల్‌?’’కొంచెం సేపు ఆలోచించి, అన్నాడు రామకృష్ణ. ‘‘నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా. అది మళ్లీ మన లోకి వస్తే, అంతకన్నా కావల్సిందేముంది?’’భార్యాభర్తల దగ్గర సెలవు తీసుకొని బయలుదేరింది.‘‘అమ్మా...స్వప్నా’’ వెనక నుంచి పిలిచాడు రామకృష్ణ.‘‘చెప్పండంకుల్‌ ఫర్వాలేదు.’’‘‘జ్యోతి నీ ప్రాణ స్నేహితురాలు కాబట్టి ఒక విషయం చెప్పు. తనని పైకి తీసుకురావడానికి నేనెంత కోల్పోయానో చెప్పమ్మ చాలు.’’