నాన్న అక్షరాలు చూడ ముచ్చటగా ఉండేవి. అప్పుడప్పుడూ నాన్న చిన్న బొమ్మలు కూడా వేసేవాడు. అవి కూడా చూడటానికి ఎంతో బావుండేవి!ఒకసారి నాన్నతో ఆర్టు ఎగ్జిబిషన్‌ (చిత్రకళా ప్రదర్శన)కి వెళ్ళాము. ఆ పెయింటింగులను తదేకంగా పరిశీలిస్తూ ఒక రకమైన కళాతృష్ణతో కూడిన ఆనందం అనుభవించాడు. ఇంటికొచ్చి, ఆ రాత్రి చెల్లాయి రంగు పెన్సిళ్ళు తీసుకొని అత్యద్భుతమైన పులి బొమ్మ వేశాడు. అందరం పులిబొమ్మను మెచ్చుకొన్నాము.ఆయన మొహంలో ఆనందం మరిచి పోలేనిది! నన్ను చదివించడం, చెల్లాయిని చదివించి, దాని పెళ్ళి గురించి ఆలోచించడంతోనే ఆయన సగం జీవితం అయిపోయింది.

నాకు జ్ఞానోదయం అయ్యేసరికి నాన్న అత్యద్భుతంగా బొమ్మలు, పెయింటింగులు వెయ్య గలిగినా, రంగుల ఖర్చు, కాన్వాస్‌ బోర్డుల ఖర్చును దృష్టిలో పెట్టుకొని, ఆ డబ్బు మాకు (అంటే నాకు, చెల్లాయికి) ఉపయోగ పడుతుందని వాటిమీద ఖర్చు పెట్టేవాడు కాదు. నేను ఉద్యోగంలో స్ధిరపడ్డాను. చెల్లాయి పెళ్ళి అయిపోయింది. నాన్న రిటైర్‌ అయ్యాడు. అమ్మతో నాల్గు కబర్లు, టివి. చూడటం, తెలుగు కథలు చదవడం ఆయన దినచర్య. ఒకొక్కప్పుడు టి.వి. చూస్తూనే లేచి వెళ్ళి, మా పాత నోటుబుక్స్‌లో బొమ్మలు వేస్తుండే వాడు. అలా కాలం గడచిపోసాగింది.ఒకరోజు నాన్నకు గుండె నొప్పి వచ్చింది. నాన్నను హాస్పిటల్‌లో చేర్పించాము. ఓ పది రోజులు హాస్పిటల్‌లోనే ఉన్నాడు. ఇంటికి వచ్చిన తరువాత ఆయనకు విశ్రాంతి అవసరం. ముఖ్యంగా ఆయన మనసు ఆనందంగా ఉండాలి.

 ఈ రెండు విషయాల మీదే బాగా ఆలోచించాను.కళాత్మక హృదయం ఉన్నా, చాలామంది కొన్ని బాధ్యతలు వలన వాళ్ళలోని కళలకు ఒక రూపాన్ని ఇవ్వలేరు. వాళ్ళ కళాత్మక కోరిక కోరికగానే మిగిలి పోతుంది. ఆ కళ వాళ్ళతోనే అంతర్దానం అయి పోతుంది! ఇది ఎంతో బాధాకరమైన విషయం.ఈ దశలో నాన్నకు పూర్తి ఆనందం కలుగ చెయ్యాలని నిశ్చయించాను. రెండో రోజే మంచి స్టేషనరీ షాపుకి వెళ్ళి ఆక్సిలిక్‌ కలర్స్‌, రకరకాల బ్రష్షులు, పెన్సిళ్ళు, కాన్వాస్‌ బోర్డులు, స్టాండ్‌ తెచ్చి ఆయన గదిలో మంచం పక్కన పెట్టాను. అవన్నీ చూచిన ఆయన మొహంలో ఆనందంతో కూడిన వెలుగు గమనించాను.