తల్లా? పెళ్ళామా?ప్రతి మగవాడి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇది తప్పనిసరిగ్గా ఎదురయ్యే సమస్యే అయినా, నా విషయంలో మటుకు అది నాన్న పోయిం తరువాత మరీ విషమ సమస్య అయి కూర్చుంది.మీ అమ్మా, నాన్నలకు నేను, అక్కా ఇద్దరమే సంతానం.ఇప్పుడు నాకు నలభై మూడేండ్లు. అక్క నాకన్నా రెండేండ్లు పెద్దది. బావ వ్యవసాయం చేస్తుంటాడు. నేను మా ఊరికి దూరంగా స్కూల్‌ అసిస్టెంట్‌గా చేస్తున్నాను.మా అమ్మ నాన్నలకు మా ఊరి చెరువుకింద ఓ అర ఎకరం పొలం, ఊళ్ళో ఓ పెంకుటిల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులేం లేవు. ఆ పొలాన్ని కూలి అరకలతోనో, ట్రాక్టర్‌తోనో దున్నించి నాటు వేసిం తరువాత ఊళ్ళో రైతులకు వ్యవసాయ పనులకెళ్ళి సాయంత్రానికల్లా నాలుగు రూపా యలు సంపాదించుకుని గుట్టుగా కాపురం వెళ్ళ దీసుకుంటున్నారు.నాది, నా భార్యది కూడా ఒకే ఊరు. మా కన్నా వాళ్ళది బాగా కలిగిన కుటుంబం. భూములు తోటలు ఉన్నాయి.ఇద్దరు అన్నదమ్ముల మధ్య మా ఆవిడ ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఎంత గారాబంగా పెరగాలో అంత గారాబంగా పెరిగింది. ఆ గారాబమే మరీ ఎక్కువై చదువబ్బక పదవ తరగతి తప్పి ఇంట్లో కూర్చుంది.వాళ్ళకూ, మాకూ కాస్త దూరపు చుట్టరికం ఉండడంతో పాటు, నేను కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడంతో వాళ్ళ నాన్న చూపు నా మీద పడింది.దాంతో ఆయనోరోజు నేరుగా మా ఇంటికొచ్చి ‘‘రెండెకరాల పొలం, మూడు లక్షల రొక్కం ఇచ్చి నాకూతుర్నిస్తా చేసుకోండి’’ అంటూ మా నాన్న ముందు ప్రతిపాదన పెట్టాడు.

అంతటివాడు ఇంటికొచ్చి పిల్లనిస్తాననడమే కాక భూమి నిస్తాననడంతో మా నాన్న వెనకా, ముందు ఆలోచించకుండా ‘‘సరే’’ నంటూ ఒప్పుకున్నాడు.అందుకు ఆయన కారణం ఆయనకుంది. భూమి ఓ సామాజిక హోదాకు ప్రతిరూపం. పెద్దగా భూమిలేని నాన్నకు కొడుకు ద్వారా భూ వసతి కలిసొస్తుండడంతో వెంటనే వప్పుకున్నాడు.నాన్న ఇచ్చిన మాటను అమ్మ కాదనలేకపోయింది కానీ, అయిన వాళ్ళతో ఏం మాటొస్తుందోనని తెగభయపడసాగింది.అన్నింటికంటే ముఖ్యంగా ఈ సంబంధం చేసుకుంటే జీవితంలో స్ధిర పడొచ్చన్న దురాశ ఒకటి తోక చుక్కలా నా మనసులో పొడుచుకు రావడంతో గతం మర్చిపోయి పెళ్ళికి ఒప్పుకున్నాను.ఆరు నెల్లు తిరిగేసరికి నా పెళ్ళి జరిగిపోయింది.అయితే, ఆ పెళ్ళి మా కుటుంబంలో ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో ఆ క్షణంలో నేను ఊహించలేక పోయాను.్‌్‌్‌నా భార్యకు చదువైతే అబ్బలేదు. కానీ, తాము బాగా కలిగిన వాళ్ళమనే అహంభావం, దానితోపాటు పెంకితనం మాత్రం బాగా వంటబట్టాయి. ఎంతవరకు వంటబట్టాయంటే పెళ్ళి అయ్యినప్పటి నుండి ఇప్పటిదాకా ఏరోజూ మా అమ్మను ‘అత్తయ్యా!’ అని కానీ మా నాన్నను ‘‘మామయ్యా!’’ అని కానీ నోరు తెరిచి పిలవనంతగా వంటబట్టాయి.