చావు గురించి తెలియనప్పుడు ఒక మనిషి తన తండ్రిపోయాడని ఏడవలేదని అనుకోవటంలో అర్ధంలేదు. మా నాన్న చనిపోయినప్పుడు నా తమ్ముడు చిన్నవాడు. మూడవ తరగతి చదువుతున్నాడనుకుంటాను.ఐస్‌క్రీమ్‌ కప్పు చేతికిస్తే ఆనందపడడం, చేతిలో వున్న చాక్లెట్‌ను లాక్కుంటే ఏడవటం తప్పించి ఏమీ తెలియని అమాయకత్వం. అటువంటి వాడు మా నాన్న పోయినప్పుడు కనీసం కంటతడి కూడా పెట్టలేదని మా బంధువులు కొంతమంది అనుకోవటం నేను విన్నాను. అలాంటి నా తమ్ముడు విరూపాక్ష పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రయోజకుడయిన కొద్దీ వాడి లో తనకు తండ్రిలేని లోటు బాగా తెలిసివచ్చింది. తండ్రి గురించిన తపన మొదలయ్యింది.ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో వుంటున్నా వాడూ నేను ఎప్పుడు కలుసుకున్నా ఎక్కువగా మా నాన్న గురించే మాట్లాడేవాడు. మా నాన్న గురించి న న్ను అడిగి ఎన్నో విషయాలను తెలుసుకునేవాడు. నేను కూడా మా నాన్న గురించి, నా చిన్న తనంలో మానాన్న తన చిన్నతనం గురించి నాకు చెప్పిన విషయాలను వాడికి వివరంగా చెప్పేవాడిని. ఆసక్తిగా వినేవాడు.ఒకసారివాడు ‘‘నేను కొంచెం పెద్దవాడినయిన తర్వాత నాన్నపోయి వుంటే బావుండేది. కనీసం ఏడ్చేవాడినేమో... నాన్న రూపం కూడా గుర్తులేదు. దురదృష్టవంతుడిని ’’ అన్నాడు.నిజమే. తండ్రి తన పట్ల చూపుతున్న ప్రేమను కూడా గుర్తించలేని వయసులో వాడు తండ్రి ప్రేమకు దూరమయినాడు.

నా తమ్ముడు పుట్టక ముందు మేము మా స్వగ్రామంలో వుండేవాళ్లం. అది ఒక పల్లెటూరు కాబట్టి అందరికంటే పెద్దవాడినయిన నా చదువు నిమిత్తం ఆ వూళ్లో వున్న ఆస్తులను అమ్ముకుని గుంటూరుకు వచ్చేశాం. అందువల్ల విరూపాక్ష మేం చెప్పుకుంటున్నప్పుడు వినడమే కాని మా స్వగ్రామాన్ని ఎప్పుడూ చూడలేదు. వాడు పెద్దవాడయినా కొన్నిసార్లు నేను ఒక్కడినే ఆవూరు వెళ్లాను గానీ వాడిని తీసుకువెళ్లలేదు.మానాన్న గురించిన బెంగ వాడిలో మొదలయిన తర్వాత మా నాన్న పుట్టిపెరిగిన వూరిని చూడాలనే బలమైన కోరిక వాడిలో కలిగినట్టుంది.ఈ మధ్య నేను వాడి దగ్గరకు వెళ్లినప్పుడు నాతో అన్నాడు.‘‘నాకు మన స్వగ్రామానికి ఒక సారి వెళ్లాలని వుంది, తీసుకెళతావా?’’‘‘ఎందుకురా? ’’ అడిగాను.‘‘నాన్న పుట్టి పెరిగిన వూరినీ, నాన్న నడిచిన నేలనీ చూడాలని వుంది. ఒకసారి మన వూరువెళ్లి అక్కడి వేణుగోపాలస్వామి గుళ్లో ఆకు పూజ కూడా చేయించివద్దాం. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఒక్కసారి తీసుకువెళ్లు’’ అర్ధింపుగా అడిగాడు.సరేనన్నాను. నాకూ ఒకసారి మా వూరినీ అక్కడి నా స్నేహితులనీ చూడాలని వుంది.అప్పటినుంచీ నేను మావూరు వెళ్లడం గురించి ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి మా వూళ్లో వుండే గోవిందు జిన్నాటవర్‌ సెంటర్‌లో కనబడి మావూరి విశేషాలు చెబుతూ మావూరి వేణుగోపాలస్వామి గుళ్లో మండల పూజలు మొదలయినాయని చెప్పాడు. మా వూరి గుళ్లో మానాన్న చిన్నతనంనుంచీ ఒక ఆనవాయితీ వుంది. ప్రతి సంవత్సరం వరుసగా నలభైరోజులపాటు ఆకుపూజలు చేయిస్తారు. ఈ టైములో వెళితే మేం కూడా ఆకు పూజ చేయించవచ్చును.