‘‘నువ్విలా వారాల తరబడి పనిమానేసి ఊరికెళితే ఎలా... నాకు కష్టం కదా...?’’ నిష్ఠూరం పోయాను... మా పని మనిషి లక్ష్మమ్మను చూస్తూ... లక్ష్మమ్మ ఏమీ మాట్లాడలేదు...‘‘పలకవేం’’ మళ్ళీ దబాయించాను...‘‘మా వూర్లో బంధువుల కార్యానికి వెళ్ళానమ్మా...’’ చెప్పింది...‘‘ఇలా నెలలో రెండుసార్లు వెళితే ఎలా?’’ మళ్ళీ నిలదీసాను...మళ్లీ మాట్లాడలేదు లక్ష్మమ్మ...‘‘సర్లే... ఇంకోసారి ఇలా చేస్తే పని మానిపించి వేరొకర్ని పెట్టుకుంటా...’’ బెదిరించాను...కాస్త బెదిరినట్టే చూసింది లక్ష్మమ్మ....నిజానికి నాది ఉత్తుత్తి బెదిరింపు తప్పా... నిజంగా తనని పనిలోంచి తియ్యాలని లేదు...అలా తీసేస్తే లక్ష్మమ్మలా వళ్ళు వంచి శ్రద్ధగా పని చేసేవాళ్ళు దొరకడం కష్టం-పైగా లక్ష్మమ్మలా ‘నిజాయితీ’ గా పనిచేసే వాళ్ళు కూడా అరుదే...కనీసం ‘స్పూను’ కూడా తాకని తన నిజాయితీ నాకెంతో ఇష్టం...అలాగని ఆమెని పొగిడితే నెత్తిన ఎక్కడ ఎక్కుతుందోనని నాకు కాస్త భయం...దాంతో పాటు జీతం కూడా పెంచమని డిమాండ్‌ చేయవచ్చు...అందుకే ‘నిజాలని లోపల దాచేస్తూ వుంటా...’ కానీ ఈసారి లక్ష్మమ్మ తను కూడా ఒక ‘నిజం’ దాచినట్టు ఆలస్యంగా తెల్సింది.తను కొద్దిరోజులు ముందు చెప్పినట్టు తను వూరెళ్ళింది బంధువుల శుభకార్యానికి కాదు...ఆ విషయం దాని కూతుర్ని చూసినప్పుడు... తనతో మాటలు కదిపినప్పుడు అర్థమైంది...ఆ రోజు లక్ష్మమ్మ స్థానంలో ఆమె కూతురు క్రిష్ణవేణి పనిలో కొచ్చింది...‘‘ఏవమ్మాయ్‌... మీ అమ్మరాదా?’’ అడిగాను-‘‘ఆమెకు ఒంట్లో బావోలేదమ్మా... అప్పటిదాకా నేనే వస్తాను...’’ చెప్పింది..

క్రిష్ణవేణితో పాటు దాని ఇద్దరు పిల్లలు కూడా తల్లితో వచ్చేవాళ్ళు... వాళ్ళలో ఒకరి వయసు ఐదేళ్ళు.... మరొకరి వయస్సు ఆరేళ్ళు వుంటాయి.. వాళ్ళని ఇంటి ముందున్న బల్లపై కూర్చోపెట్టి తాను పని పూర్తి చేసుకొనేది...క్రిష్ణవేణి చెప్పినట్టు ఆమె తల్లికి అనారోగ్యం కాదని... తాను ఇంట్లో లేదని అర్థమైంది...తను మరికొన్ని ఇళ్ళల్లో పని చేస్తుందనే సమాచారం తెల్సింది..‘‘మా అమ్మ ఎందుకు రాదే...’’ క్రిష్ణవేణిని నిలదీశాను..‘‘ఈ ఇల్లు ఇక ప్రస్తుతానికి నన్నే చూసుకొమ్మని చెప్పిందమ్మా...’’ అసలు విషయం చెప్పింది క్రిష్ణవేణి.‘‘ఇదేమైనా ఆస్తా పంచుకోవడానికి...?’’ అనాలనుకున్నాను...ఒకవేళ నా మాటలు రుచించక ఇది కూడా మానుకుంటే నాకే కదా కష్టమనుకొన్నా... పైగా హైద్రాబాద్‌లో పని వాళ్ళకు ఉండే డిమాండ్‌ నాకు తెలుసు...మరో వారం రోజులు గడిచింది....పిల్లలు అలవాటు చొప్పున ఇంటి ముందున్న బల్లపై కూర్చొనే వాళ్ళు... పసివాళ్ళు కదా అని ఇంట్లో వున్న బిస్కెట్స్‌, చాక్లెట్స్‌ ఇచ్చేదాన్ని... పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు...అయినా బడిలో వుండాల్సిన సమయంలో... తల్లి తోకపట్టుకొని తిరగడం నాకెందుకో అసహజమనిపించింది.... అదే అన్నాను.. ‘‘బడిలో వెయ్య కుండా నీతోపాటు తిప్పుకుంటే వాళ్ళ భవిష్యత్‌ ఏంగానూ?’’ అన్నాను....