‘‘అమ్మా! ఆకలయితాంది. ఈ పొద్దెన కొంత తిండి పెట్టేదుందా?’’ వురుక్కుంటూ వచ్చిన సాయిలు గస పోసుకుంటూ ఇంట్లో కొచ్చీ రాంగనే మొదలేసినాడు.రాండ్లమ్మ పోచమ్మ యాడ ముడుక్కుని పండుకుందో గానీ బదులు పలకలే. రేకుల షెడ్డు పక్కనున్న తడికెగది తలుపు తోసి చూసినాడు సాయిలు.నల్ల బండ గట్టుమీద మోకాళ్లు పొట్టలోకి దూర్చి మూలుక్కుంట పండుకున్న సైదులు అగపడినాడు. సాయిలుకన్న రెండేండ్లు చిన్నవాడు సైదులు. వానికి మూడు దినాలకో తూరి జొర మొస్తుంది. కాళ్లు చేతులు టెంకాయ పరక పుల్లల మాదిరి వుంటయి. ఇద్దరూ అయిదు క్లాసులదాంకా అట్లట్ల బడికి పోయి పూర్తిగా విడిచి పెట్టినారు.‘‘అమ్మ యాడకు పోయిందిరా? ఈ పొద్దైన రొట్టెలయినా చేసిందా లేదా?’’ ఏడుపు గొంతుతో అడిగినాడు సాయిలు. రెడ్డి మనుషులచ్చి అమ్మను తోల్కపోయినారు. పొద్దున్నే పోయింది... ఇంతదంక రాలే... నేనూ ఏమీ తినలా... ఆకలైతాంది. పొట్టలో నొప్పి లేస్తాంటే పండుకున్నా ‘‘సైదులు ఆయాస పడుతూ చెప్పి కండ్లు మూసుకున్నాడు.కడుపులో మంట పెడుతోంటే ఇన్ని నీళ్లయినా తాగుదామని కుండ మూత తీసి చూసినాడు సైదులు. బోరు దగ్గరకు పోయి నీళ్లు కూడా తెచ్చినట్టు లేదు... అడుగున ఇన్ని నీళ్లు మిగిలినై.‘‘థూ నీళ్లు కూడ లెవ్వు’’ అంటా సైదులు పక్కన కూలబడినాడు.‘‘సూరిగాడి వాండ్ల నాయన ఇసం తాగి సచ్చిపోయినాడు కదా.. ఆళ్లింటికి గవుర్మెంటు జీపులో ఎవురో వచ్చినారు. బియ్యం మూట, దుడ్లు ఇచ్చి పోయినారంట దినాలు చేసే దానికి. 

మల్ల కూడ మస్తుగ దుడ్లిస్తరంట.. ’’కొత్త కబురు చెప్పాడు సాయిలు.‘‘బీసన్న మామ ఎందుకట్ల ప్రాణం తీసుకున్నాడే? నాయనా అంట ఏడుస్తున్నడు సూరిగాడు... దుడ్లిస్తే వాండ్ల నాయన బతికొస్తడా?’’ఏడుపు గొంతుతో అన్నాడు సైదులు.బీసన్న ఎందుకు చచ్చిపోయిండో సాయిలుకు ఎట్ల తెలుస్తది?ఈ పొద్దిస్తరంట రేపిస్తరంట అంటూ ఎరువుల కోసం మూడు తూర్లు కర్నూలు పోయి వచ్చినాడు. గంటలు గంటలు ఎండలో నిలబడి వుత్త చేతులతో వెనక్కి రావడమే అయింది. నాలుగో తూరి పొయ్యినప్పుడు ప్రాణం విసిగి పోయిన రైతులు ఎరువుల మూటలు తెచ్చిన లారీ మీదకు ఎగబడినారు. అందిన కాడికి మూటలు ఎత్తుకపోతుంటే తానూ ఒక మూట దొరికించుకుని వురికినాడు బీసన్న.అంతలోనే పోలోసులొచ్చి లాఠీలతో చావగొట్టి మందిని తరమబట్టినారు. కాలు విరిగి కుంటుకుంటా కొంప చేరినాడు బీసన్న . ఎరువులు లేక వెలవెల బోయిన చేను చూసి బీసన్న గుండె విలవిల లాడింది. వచ్చే దినాలలో చీకటే గానీ వెలుగు కనబడలే. అప్పు బరువు గుండే మీద బండయింది. చావే దిక్కని పురుగుల మందు తాగేసినాడు. ఆఖరి కోరికగా ‘దేవుడా ఈ పురుగుల మందు కల్తీది కాకుండ చూడు’ అని వేడుకున్నాడు.