రావురైలు ప్రయాణం.ఒకే వేగంతో ట్రాక్‌మీద రైలు లయబద్ధంగా శబ్దిస్తూ పరుగులు తీస్తోంది. ఆ శబ్దం చటుక్కున మారి గుండెలదిరేలా శబ్దించింది. కిందికి చూస్తే ఒట్టిపోయినది. దానిమీది వంతెన వెనక్కి నిష్క్రమించింది. ఆ తర్వాత ఏదో చిన్న రైల్వేస్టేషను. దానిని ఆనుకొని చిన్న ఊరు. బొగులు బొగులుమంటూ చిక్కిపోయిన ఇళ్ళు.ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నిష్క్రమించాయి. తిరిగి నిలకడగా లయబద్ధంగా శబ్దం.కిటికీలోంచి రివ్వున వీచేగాలి...ఆరుబయల్లో పోతపోసిన ఉక్కుస్తంభాల్లా నిటారుగా నిలిచిన తాడితోపులు.రైలు తనకు తానే ఒక కోలాహలంలా ధ్వనిస్తోంది. కాలాన్ని తరుముతూ ముందుకు పరుగులు తీస్తోంది.భూమి గిరగిరా... తాడితోపులూ, గుబురుచెట్లూ వర్తుల వలయంలా - పరుగెత్తే రైలుతో నాలుగు స్తంభాలాట.రిజర్వేషన్‌ కంపార్టుమెంటు అంతంత మాత్రమే రద్దీగా వుంది.బహుశా అమావాస్య కారణం కావచ్చు.పగలే అయినా మనుషులు జోగుతున్నారు.అక్కడ విండోసీట్లో అటు సుధాకర్‌గారూ, ఇటు రావు గారు. ఆ పక్కనే రజనీ గారు అప్పర్‌ బెర్తులోని వెంకటేశు మాత్రం గుర్రుపెట్టి నిద్రోతున్నాడు. ఎప్పుడు మెలకువవస్తే అప్పుడు కిందకి వంగి సుధాకర్‌ గారినో రజనీగారినో ఏ స్టేషనూ? అని అడుగుతాడు. తిరిగి నిద్రలోకి జారుకుంటాడు.అక్కడ వాళ్లతోపాటే ఓ వృద్ధురాలు - కడిగిన ముత్యమల్లే వుంది. పేరు సుందరమ్మగారట ఎక్కడనుండి ఎక్కడకు వెళ్తున్నదో తెలియదు. బహుశ చెన్నైకేమో... అటు సైడు బెర్తుమీద ఎవరో ఓ విదేశీ వనిత. ఎవర్నీ పట్టించుకున్నట్టు లేదు.

వెంకటేశు పైనించి మరోసారి టైమెంతయిందీ అని అడిగాడు. మూడు కావస్తోంది మిత్రమా... కిందకు దిగితే టీ తెప్పించుకోవచ్చు...ఝుక్‌ఝుక్‌... ఝుక్‌ ఝుక్‌.... ఝుక్‌ ఝక్‌...రైలు గుండె చప్పుడు ఆహ్లాదంగా వినిపిస్తోంది.మనిషికీ పశువుకీ ఉన్నట్టే, పువ్వుకూ పండుకూ ఉన్నట్టే రైలుకూ ఒక ప్రత్యేక వాసన.అప్పుడు ఆ రైలు వేగంలో ఓ చిన్నకుదుపు. గుండె లయ తప్పింది.లబ్‌డబ్‌... లబ్‌... డబ్‌... ల... బ్‌.... డ.... బ్‌....కిర్ర్‌ర్ర్‌.రైలు ఆగిపోయింది.ఏ స్టేషను? పైనుండి మిత్రుడు వెంకటేశు.ఏ స్టేషనూ లేదు, అర్థాంతరంగా ఇక్కడెక్కడో ఆగిపోయింది.ఏదన్నా క్రాసింగో ఏమో!ఇక్కడ క్రాసింటేమిటి? స్టేషనే లేందే...అయితే ఏ గొడ్డో గోదామో పట్టాలకింద పడుంటుంది. చూశారా - కిటికీలోంచి తొంగి చూశారు సుధాకర్‌గారు. అలాంటిదేమీ జరిగినట్టు లేదు.ఏమండీ రావుగారూ.... నైట్స్‌ మీల్సట... ఆర్డరిద్దామా? బుక్కింగ్‌ అతను వచ్చాడు. అలాగే ఓ నాల్గు మీల్సు బుక్‌ చేయండి. ప్రస్తుతానికి టీ గట్రా కాస్త సప్లయ్‌ చేయగలడేమో చూడండి.ఆ బుక్కింగ్‌ అతను ఓ కుర్రాణ్ణి పురమాయించాడు.రావుగారు అసహనంగా వున్నారు. గడియారం చూసుకుని, అరగంట దాటి పోయింది. ఎప్పటికి కదుల్తుంది...ఆ కుర్రాడు రైలేనా సార్‌... ఇప్పుడు కదల్దుసార్‌. ఓ నాలుగైదు గంటల తర్వాత కదిల్తే ఇప్పుడు కదిల్నట్టే సార్‌...