‘‘సుజీ....! నా స్వీటీ... నా మొహబ్బత్‌.... దిల్‌కీ దడ్‌ఖన్‌. ఎక్కడున్నావే?’’ గట్టిగా అరుస్తూ ఇల్లంతా కలయతిరుగు తున్నాడు కిషన్‌. ముందు హాల్లో... ఆ తర్వాత బెడ్‌రూంలో ఆమె కనిపించకపోయేసరికి మరింత గొంతుపెంచి ‘ఓ పగటి చంద్రమా.. నా రాత్రి శోభనమా. ఎక్కడున్నావే?’’ హడావుడి చేస్తున్నాడు.‘‘ఇదిగో.. ఇక్కడే’’ ముందు సన్ననిగాజుల సవ్వడి... ఆ తర్వాత కిచెన్‌లోంచి సుజాత గొంతు వినిపించింది.అంతే! ఒక్క అంగలో ఆ గదిలోకి చేరుకుని వెనుకనుంచి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు కిషన్‌.ఆ బిగి కౌగిలి ఆమె ఊహించిందే. ‘మెళ్లో మూడుముళ్లు పడ్డదగ్గర్నుంచీ కనిపిస్తే చాలు కౌగిలింతలో ముంచేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాడేమో.. ఎడాపెడా ఎన్నిసార్లు కౌగిలించుకున్నా పొద్దస్తమానం మా ఆయనగారికి పర గడుపే’ నవ్వుకుంది సుజాత. జీవితంలో అంతకుముందెప్పుడూ ఆడదాన్ని చూడన్నట్లు... తొలిసారిగా అప్పుడే చూస్తున్నట్లు ఆబగా తనవైపే అతడు వస్తుంటే అడవిలో ఆకలిగొన్న సింహం వేటకోసం జూలు విదిల్చి మరీ పంజా విసుర్తున్న దృశ్యమే ఆమె కళ్ల ముందు కదలాడుతుంటుంది. 

అనూహ్యంగా వరించి వచ్చే ఆ కౌగిలిసుఖం కోసం కళ్లింతలు చేసుకుని మరీ ఎదురుచూడడం సుజాతకు కూడా వేడుకే.ఇప్పుడూ అంతే! ఆఫీసునుంచి వచ్చే అతగాడి కోసం గుమ్మానికి చూపుల తోరణాలు కట్టి మరీ ఎదురుచూసి చూసి విసిగి వేసారి వేడివేడి కాఫీ కలుపుదామని ఇలా కిచెన్‌లోకి వచ్చిందోలేదో... వాకిట్లో స్కూటరాగిన శబ్దం సుజాత చెవుల్లో పడింది. వెంటనే పరుగుపరుగున వచ్చి ఎదురేగి ఆయన్ని తీసుకొద్దామన్న కోరిక కలిగినా బలవంతాన అణచుకొంది. కారణం... ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒళ్లంతా కళ్లు చేసుకుని తనకోసం అతను వెతకడం.. ఆ తర్వాత కనిపించగానే ఆపుకోలేని తమకంతో గాఢాలింగనం చేసుకోవడం.. శరీరమంతా ముద్దుల్తో మర్ధన చేస్తూ ముద్దుచేయడం గుర్తొచ్చి ఆగిపోయింది. చేతులు కాఫీ కలుపుతున్నా చెవులు మాత్రం అతడి అడుగుల చప్పుడ్ని ఆస్వాదిస్తున్నాయి. దించకుండా ఓ పుల్‌బాటిల్‌ ఖాళీచేస్తే ఎంత మత్తు కమ్మేస్తుందో నిజానికి ఆమెకు తెలీదు. కానీ, ఇప్పుడనుభవిస్తున్న మత్తుమందు ఆ మత్తుకూడా సరి రాదనే నిశ్చయానికొచ్చింది సుజాత.