ఉరుకుల పరుగుల నగర జీవనంలో ఈ రోజు రఘురాంకి ఆటవిడుపుగా వుంది. అలవాటుగా ఉదయం ఐదు గంటలకే మెలకువ వచ్చేసినప్పటికీ, ఆరామ్‌గా కాసేపు అటూ ఇటూ దొర్లి ఇంక సాధ్యం కాక లేచాడు. అప్పటికే లేచిన భార్య అరవిందను కూర్చోమని చెప్పి, ఇద్దరికీ తానే కాఫీ కలుపుకు వచ్చాడు. సుమారు ఆరేడు నెలల సుదీర్ఘ కాలం తరువాత తానా రోజు శలవు పెట్టడమే ఈ సత్ప్రవర్తనకు కారణం. వృత్తిరీత్యా రఘురాం బ్యాంకు ఆఫీసరు. సుమారుగా డిసెంబర్‌ నెల నుంచి బ్యాంకు లావాదేవీలతో తలమునకలై సాంతం గడిచాక ఈ రోజే శలవు పెట్టాడు. ఆ మధ్యనంతా ఆదివారం సైతం బ్యాంకుకు పరుగులు తీయడమే ఆనవాయితీ.‘‘ఈ రోజేమైనా స్పెషల్‌ టిఫిన్‌ చెయ్యి ఆరూ! పిల్లలు స్కూలుకు వెళ్ళాక... మనం బైటకు వెళ్దాం.... నీవూ శలవు పెట్టేయ్‌. లంచ్‌ బైటనే’’ సంభ్రమంగా రఘురాం.‘‘ఏంటి చిన్న పిల్లాడిలా? ఒక్కరోజు శలవు పెట్టినందుకే ఏనుగెక్కినంత సంబరం!’’ అరవింద.‘‘నీకు తెలీదులే. మాదో యాంత్రిక జీవనం. టార్గెట్లు - రిమార్కు పునాది మీద బానిస బతుకు. చూస్తున్నావుగా ఆర్నెల్ల నుంచి ఎంత హైరానా పడుతున్నానో, రుణాలు-రికవరీలు. రుణం యివ్వమని సిఫార్సు చేసిన రాజకీయం, రికవరీ విషయానికొచ్చేసరికి నోరు మెదపదు. ఇక మా పాట్లు చెప్పనలవి కాదు. నయానా భయానా వసూలు చేసుకోవాల్సిందే. పైగా రికవరీ అడిగినందుకు మాకు బెదిరింపులు కూడానూ.

 ఇదంతా ఎందుకంటే బైటకు కన్పించినంత ‘సాఫీయానం’ కాదు మా బతుకని. సరేలే! ఈ రోజు ప్రశాంతంగా గడిపేద్దామనుకున్నాంగా. సో ఈ సోదంతా అనవసరం.‘‘ఇంతకీ టిఫిన్‌ ఏం చేస్తున్నావు?’’ వాతావరణాన్ని తేలిక పరుస్తూ రఘురాం.‘‘ఇంకేముంది. పూరీలు అంటే ఇష్టంగా బుచ్చిబాబు గారికి. పూరీ చేస్తాను. ఇప్పుడే పిండి కలిపేస్తే ఓ అరగంటాగి చేసుకోవచ్చు’’ అంటూ లేచింది అరవింద ఖాళీ కాఫీ కప్పులు తీస్తూ.అరవింద అటు వెళ్ళగానే ఆరామ్‌గా ఓ సిగరెట్టు వెలిగించాడు. టీపాయ్‌ మీదున్న పేపర్ని తిరగేయసాగాడు. ఇంతలో డోర్‌ బెల్లు మోగింది. ఇంత తెల్లారేసరికి ఎవరా? అని సంశయిస్తూనే తలుపు తీసాడు. ఇంకేముంది ఎదురుగా రమణమూర్తి.‘‘అరే! రమణా! ఏమిటీ ఆకస్మిక ఆగమనం?’’ అన్నాడు రఘురాం నాటకీయంగా.‘‘రఘా! బాగున్నావట్రా. ఏంటి కాస్త చిక్కినట్టు కన్పిస్తున్నావు?’’ రఘు ఒళ్ళంతా నిమురుతూ, రమణ.‘‘ఏం లేదు! ఎప్పుడూ నీవనే మాటే ఇది. చిక్కింది కాస్తా విరామమే తప్ప మరేం లేదు’’.‘‘అరూ... రమణ వచ్చాడు. కాఫీ తీసుకురా’’ అని కేక వేశాడు. సమాధానం లేదు. లేవబోతుంటే, ‘‘హైరానా పడకురా. వస్తుందిలే’’ మూర్తి వారింపు. నేను ట్రైన్‌లోనే బ్రష్‌ చేసుకుని కాఫీ తాగానులే. అవునూ నీవు తొమ్మిదింటికేగా వెళ్ళేది?’’ రమణ వాచ్‌ చూస్తూ.