కాలేజీ ఇంటర్ విద్యార్థిని శివాని, కాలేజీ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్యహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది.ఎందుకు ఆత్మహత్య? విఫల ప్రేమా? మార్కులు తక్కువ వచ్చాయా? ర్యాగింగా?వార్తా ఛానల్స్ గుప్పుమన్నాయి. నగరంలోనినిక్షేపరాయుళ్లు కాలేజీ వద్ద చేరారు. అప్పటికింకా భౌతికకాయం రోడ్డు మీదనే ఉంది.తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పోలీసులహడావుడి. క్రమంగా ఆమె ఆత్మహత్యకుకారణం బయటపడింది. నెలవారీ టెస్టులోఆమె కాపీ చేస్తూ పట్టుపడిందట. లెక్చరర్ ఆమెను తిట్టాడన్నారు కొందరు.కొట్టాడన్నారు మరికొందరు.ఫలితం....ఆత్మహత్య.దాంతో విద్యార్థి నాయకులు రెచ్చిపోయారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు నశించాలి ప్రిన్సిపల్ డౌన్!డౌన్! లెక్చరర్ సత్యప్రకాశ్‌కి బేడీలు వేయాలి’’ అంటూ నినాదాలు చెలరేగాయి. కొందరు ఉత్సాహవంతులు కాలేజీలో దూరి విధ్వంసం సృష్టించారు. అదంతా ప్రత్యక్ష ప్రసారం చేశాయి వార్తా ఛానల్స్.ప్రిన్సిపల్ సత్యప్రకాశ్‌ని సస్పెండ్ చేసినట్లు వార్త గుప్పుమంది. అయినా విద్యార్థి నాయకులు శాంతించలేదు. ఆ లెక్చరర్ మీద కేసు పెట్టమని, కూతురు మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులకు నూరిపోశారు.్‌్‌్‌సత్యప్రకాశ్ ఇంట్లో అడుగుపెట్టగానే అంతవరకూ గట్టిగా వాదించుకుంటున్న అమ్మ,నాన్న, భార్య నోళ్లు మూసుకున్నారు.
నిస్త్రాణంగా వాలు కుర్చీలో కూలబడిన అతనికి వేడి వేడి టీ తెచ్చి ఇచ్చింది శ్వేత. తల్లిదండ్రులు చల్లగా జారుకున్నారు.‘‘నన్ను సస్పెండ్ చేశారు’’ బాధగా అన్నాడు సత్యప్రకాశ్.‘‘తెలుసు. టీవీలో చూశాం’’ గంభీరంగా అంది శ్వేత.తాగుతున్న టీలో రెండు కన్నీటి చుక్కలు పడగా, కప్పు పక్కన పెట్టేశాడు అతడు. అనునయంగా భర్త భుజం మీద చెయ్యి వేసింది శ్వేత. ఇద్దరూ కళ్లు మూసుకొని గతంలోకి జారిపోయారు.్‌్‌్‌పెళ్లి చూపులకొచ్చిన సత్యప్రకాశ్ హుందాతనం, మాటతీరు అతని ఆదర్శాలు ఎంతగానో నచ్చాయి శ్వేతకు. అయితే పెళ్లయి కాపురానికి వెళ్లాకనే ఆదర్శాల భర్తతో వేగడం ఎంత కష్టమో అర్థమయిందామెకు. ఓ రోజు సినిమాకెళితే హౌస్‌ఫుల్ బోర్డు ప్రత్యక్షం! రెట్టింపు రేటుకు బ్లాక్‌లో టిక్కెట్లు దొరుకుతున్నాయి. అలాంటి టిక్కెట్లు కొనడం అతనికిష్టం లేక ఈసురోమని ఇంటికెళ్లవలసి వచ్చింది.పుణ్యక్షేత్రాలకు వెళితే స్పెషల్ దర్శనం అతనికిష్టం ఉండదు. అదీ ఒక విధమైన బ్లాక్ మార్కెట్ అని అతని ఉద్దేశం. ఉచిత దర్శనమే అతని అభిమతం. అందుకోసం కష్టపడడం, కాలం వృధా అవడం, బస్సులూ, ట్రైన్లూ మిస్సయి ఖర్చులు పెరిగినా అతనికి ఆనందమే. ఇవన్నీ ఒక ఎత్తు. పరీక్షల సీజన్ వచ్చిందంటే అతని సంగతేమో గానీ, శ్వేతకు మహాటెన్షన్. అతడు వాచర్‌గా వెళ్లి కాపీ రాయుళ్లని పట్టుకోవడం, వాళ్లు ఎదురుతిరిగి చెయ్యి చేసుకోవడం, రాళ్లు రువ్వడం, రభస చేయడం పరిపాటి. అదృష్టం బాగుండి చిన్న గాయాలతోనే అతడు తప్పించుకుంటూ వస్తున్నాడు గానీ ఎప్పుడేమవుతుందోనని ఆమె బెంగ.