ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని సైనిక పాఠశాల...ఒక్కసారిగా అక్కడ పోలీసుల కలకలం మొదలైంది.సైనిక పాఠశాల పక్కనే ఉన్న హనుమాన్‌ మందిర్‌ సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పడేశారు.మృతదేహంపై లోతయిన గాయాల గుర్తులు కన్పిస్తున్నాయి.అప్పుడే సంఘటన స్ధలానికి డీసీపీ సత్యబ్రత చేరుకున్నారు.హత్య జరిగిన ప్రాంతాన్ని, మృతదేహన్ని నిశితంగా పరిశీలించారు.మృతదేహం సమీపంలో ఒక బ్యాగు ఆయన కంటపడింది.‘‘ఆ బ్యాగులో ఏముందో చూడండి’’ అని తన సిబ్బందిని ఆదేశించారు.పోలీసులు బ్యాగు తెరిచి అందులోని వస్తువులను ఒక్కటొక్కటిగా బయటకు తీశారు.కొన్ని బట్టలు, విమానం టికెట్‌, కొన్ని ఐడీ కార్డులు కన్పించాయి.అందులోని వివరాలు పరిశీలించిన డీసీపీ అక్కడ్నుంచే భువనేశ్వర్‌ కమిషనర్‌ ఆర్‌.పి. శర్మకు ఫోన్‌ చేశారు.

‘‘సార్‌... సైనిక పాఠశాల దగ్గర ఒక హత్య జరిగింది... మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడుగా ఉన్నాడు. హత్యా స్థలంలో మాకో బ్యాగు దొరికింది. ఐడీ కార్డులో ఉన్న వివరాల ప్రకారం అతను వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగిగా తెలుస్తోంది’’ అన్నారు.‘‘ఓకే...ఇంకా ఏమైనా వివరాలు దొరుకుతాయేమో చూడండి... నేను ఇప్పుడే వైజాగ్‌ కమిషనర్‌తో మాట్లాడతాను’’ అన్నారు కమిషనర్‌.‘‘ఎస్‌... మీరు చెప్పింది కరెక్ట్‌. హతుడు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో ఫైనాన్స్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సూర్యప్రసాద్‌. అతను రెండు రోజుల క్రితం వైజాగ్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లాడని అక్కడి పోలీసులు చెప్పారు. వారు సూర్యప్రసాద్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వాళ్లందరూ ఇక్కడికి వస్తున్నారు’’ అని కమిషనర్‌ ఫోన్‌లో డీసీపీకి చెప్పారు.

‘‘ఓకే సర్‌.. ఈ లోపు చుట్టుపక్కల హోటళ్లలో విచారించి హత్యకు ముందు సూర్యప్రసాద్‌ ఎక్కడ దిగాడో తెలుసుకుంటాం’’ అని ఫోన్‌ పెట్టేశారు డీసీపీ సత్యబ్రత.ఈ హత్యకు సంబంధించిన వార్తలు అక్కడి పేపర్లలో ప్రముఖంగా వచ్చాయి.ఆంధ్రా పోలీసు అధికారులు కొందరు వెంటనే బయల్దేరి భువనేశ్వర్‌ వచ్చారు. పోలీసులతో పాటు వచ్చిన సూర్యప్రసాద్‌ కుమారుడు శేఖర్‌ను డీసీపీ సత్యబ్రత దగ్గరకు తీసుకొచ్చారు.‘‘ఇంతకీ మీ నాన్న భువనేశ్వర్‌ ఎప్పుడొచ్చారు? ఏ పని మీద వచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడారా? మీకు తెలిసిన వివరాలు చెప్పండి’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.