పొద్దు పడమటికి వాలింది. ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు. తుమ్మచెట్లల్లో నుంచీ కీచురాళ్లు ‘గీ’ మని అరుస్తున్నాయి. చుట్టూ వున్న బీటి నేలల్లో అక్కడక్కడ చుట్టగాలికి చెత్తాచెదారమంతా పైకి లేస్తూ వుంది.ఆకులేటి వంకగట్టు వెంబడి తుమ్మచెట్ల కిందా సీమజాతి చెట్లకిందా కూర్చొని కొంతమంది సుగాళీ ఆడవాళ్లు చిన్నచిన్న సుత్తులతో సున్నపురాళ్లను వడకలు చేస్తున్నారు. ఏడెనిమిదేళ్లనుంచీ పదైదేండ్ల వయసు వరకూవున్న పిల్లలు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయినారు.సున్నపురాళ్లను వడకలు చేస్తున్న వాళ్లకు కొంచెం యెడంగా రెండు మూడు సున్నపు బట్టీలు కాలుతూ పొగలు చిమ్ముతున్నాయి. రెండు బట్టీలలో మగవాళ్లు కట్టెలనూ సున్నపురాళ్లనూ వరుసలు వరుసలుగా పేరుస్తున్నారు. కొంతమంది పక్కనున్న బోదగుట్టలోనుంచీ సున్నపురాళ్లను తవ్వుకొని బండ్లకెత్తుకొని వొస్తున్నారు.ఒక తుమ్మ చెట్టుకింద కమలాబాయి, సుత్తితో సున్నపురాళ్లను వడకలు చేస్తూ వంకనారవ వైపు చూస్తూవుంది. అక్కడ ఆమె పెద్ద కొడుకు రామా నాయక్‌, భూమిలో దాక్కున్న సీమజాలి వేర్లను కష్టపడి బయటికి కుళ్లగిస్తున్నాడు. రెండో కొడుకు భీమ్లానాయక్‌, తల్లి దగ్గరున్న సున్నపురాళ్ల వడక లను తట్ట గంపకెత్తు కొని బట్టీ దగ్గర కుప్పబోయ డానికి అవస్థపడుతున్నాడు. కూతురు సక్కూ బాయి మరో కొడుకు చెందూ, తల్లి చెప్పినట్లు సున్నపురాళ్లలో చిదుగును తీసివేయలేక ఆట్లాడు కోవడం వొదులుకోలేక అవస్థపడుతూవున్నారు.

 కమలాబాయి ఆ కందమ్మలందరినీ గమనిస్తూ ఆట్లాడే పిల్లలను గదురుకుంటూ నచ్చజెపతూ బెదిరిస్తూ తన పనిలో తాను నిమగ్నమవుతూ వుంది.మౌనంగా సున్నపురాళ్లను వడకలు చేస్తున్న కమలాబాయి చెక్కిళ్లలోనుంచీ చెమట కారుతూ వుంది. తలమీద నుంచీ వెనక్కి ముసుగు మాదిరి వేలాడేసుకున్న ‘ఛాంటియా’ను సెగకు తట్టుకోలేక పక్కకు తీసివేయడంతో ఆమె వీపుమీద జారుతున్న చెమటధారలు కనిపిస్తున్నాయి. యెదకు అడ్డంగా కట్టిన యెర్రటి ‘కాంచిలీ’, చెమటతో తడిసి, దాని మీదున్న అద్దాలలోని తళుకంతా తగ్గి వుంది. నడుము నుంచీ మోకాళ్ల కింది వరకూ కట్టుకున్న ‘ఫేటియా’ బాగా మాసిపోయి వుంది. కాళ్లలో కడియాల మాదిరున్న యిత్తడి ‘కోల్డాలు’, సున్నపు రాళ్ల ముక్కలు చిట్లుతున్నపడల్లా పుటుక్కు పుటుక్కుమని శబ్దం చేస్తునాయి. మోచేయి దగ్గర్నుంచీ ముంజేయి వరకూ తొడుక్కున్న ప్లాస్లిక్కు ‘బల్యాలు’ యెడతెరిపి లేకుండా సవ్వడి చేస్తున్నాయి. చెంపల మీద వెంట్రుకలు వేలాడేసు కున్న ‘ఘూంగ్రీ టోప్లీ’లూ, కుడి ముక్కు దొప్పకింద పెద్దరింగు మాది రున్న ‘భూరియా’ నిరంతరాయం గా కదలాడుతూ వింతగా కనిపిస్తు న్నాయి.సున్నపు రాళ్లను పగలగొడుతూ మధ్యమధ్యలో బరువుగా నిట్టూ రుస్తూ వుంది కమలాబాయి. ఆడుకో వలసిన వయసులో శక్తికి మించిన పనులు చేస్తూ కందిపోతున్న పసి కందమ్మలను చూసి కన్నతల్లి హృదయం ఎంతక్షోభ చెందిందో యేమో, ఆమె కళ్లు రెండూ నిండిన వుపనీటి చెలమలుగా మారుతున్నాయి. ఆ చెలమల్లో నుంచీ క్రమంగా పొంగి పొర్లుతున్న వెచ్చని నీటి పొరల్లో గతమంతా ఆమెకు స్పష్టంగా కనిపిస్తూ వుంది.