హడావుడిగా స్టేషన్లోనికి అడుగు పెట్టిన రామ్మూర్తికి గోల్కొండ చాంతాండంత పెద్దదిగా ఉన్న క్యూ చూసి నీరసం ముంచుకొచ్చింది.ట్రైన్‌ రావడానికి పావుగంట మాత్రమే సమయం ఉంది. పరిస్థితి చూస్తుంటే టికెట్‌ దొరికేట్టు కనబడ్డం లేదు. పూర్తిగా నీరసించి పోయాడు రామ్మూర్తి. ఎలాగైనా ట్రైన్‌ ఎక్కి తీరాలి. రాత్రికి రాజమండ్రికి చేరుకోవాలి. మర్నాడు ఉదయం ఐదుగంటలకే ముహూర్తం. స్నేహితుడు నారాయణ కుమారుడి పెళ్ళి. అప్పటికే క్యూలో కాస్త వెనుకగా కుమ్ములాట కూడా ప్రారంభమయింది.నిరాశగా గోల్కొండ చాంతాడు వైపు చూస్తుండగా అతని దృష్టి సరిగ్గా టికెట్‌ కౌంటర్‌ ముందు ముగ్గురు వ్యక్తుల తరువాత నిలబడి వున్న యువకుడి మీద పడింది. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మెల్లగా అతన్ని చేరుకున్నాడు రామ్మూర్తి.‘‘సర్‌. మీరెక్కడిదాకా?’’‘‘విజయవాడ’’అతని మదిలో నిరాశ. ఒకరికే రెంటు టికెట్లివ్వరన్న సంగతి అతనికి తెలుసు. ‘అతను కూడా రాజమండ్రైతే బాగుండేది’ అనిపించింది. అంతలోనే మరో ఆలోచన!‘‘నేను రాజమండ్రి వెళ్ళాలి. నాక్కూడా ఒక టికెట్‌ తీసుకుంటారా?’’‘‘ఒకరికే రెండు టికెట్లివ్వరండి’’‘‘ఆ విషయం నాక్కూడా తెలుసు. మీరు ఒకే టికెట్టులో రెండు రాజమండ్రికే తీసేసుకోండి. ఎక్‌స్ర్టా డబ్బులు నేనిస్తాను. మీరు విజయవాడలోనే దిగిపోండి. నేను రాజమండ్రి కెళ్తాను. నేను ఊరికి వెళ్ళడం చాలా అవసరం సార్‌’’ అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా.

అంతేకాక మరో ఆలోచనకు అవకాశమివ్వకుండా చేతిలోని ఐదువందల నోటును అతని చేతిలో నొక్కేశాడు రామ్మూర్తి.ఆ యువకుడు మారుమాట్లాడే అవకాశం లేకుండా పోయింది.మరో ఐదు నిమిషాలకల్లా పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటికి వచ్చిన అర్జునునిలా, ఒక చేత్తో టికెట్టు ఎత్తి పట్టుకుని ఆ యువకుడు బైటికొచ్చాడు. అతని ముఖంలో విజయ దరహాసం!(అర్జునుడు పద్మవ్యూహంలోనికి అసలు ప్రవేశించలేదన్నది వేరే విషయం. కానీ బయటికి వచ్చే మార్గం తెలిసింది అతనికొక్కనికే అన్నది పురాణం)కావ్య భాషలో చెప్పాలంటే రామ్మూర్తి ముఖం కోటికాంతుల దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. కలోక్యువల్‌గా చెప్పాలంటే మొహం చేటంతయ్యింది.అదే సమయంలో బండి వస్తున్నట్టు ప్రకటన చేశారు ‘‘...మరి కొద్ది సేపటికి ఒకటవ నంబరు ప్లాట్‌ ఫారం మీదికి వచ్చి చేరును’’‘‘తొందరగా రండి సార్‌. ట్రైన్‌ వచ్చేస్తూంది. బండెక్కాక చిల్లర సరి చూసుకుందాం. టికెట్‌ నా దగ్గరే ఉంది కాబట్టి మనిద్దరం ఒకేచోట ఎక్కుదాం’’ అంటూ టికెట్‌తో బాటుగా చిల్లర కూడా తన జేబులో ఉంచుకుని ప్లాట్‌ ఫారం చివరికి నడిచాడా యువకుడు. మరో గత్యంతరం లేక అతని వెంట పరుగులాంటి నడక అందుకున్నాడు రామ్మూర్తి.‘‘జనరల్‌ బోగీ ఇక్కడే వస్తుంది కదూ’’ అన్నాడు ప్లాట్‌ఫారం చివరగా నిలబడ్డ అతన్ని చేరుకున్న రామ్మూర్తి, ఔనన్నట్టు తలూపాడా యువకుడు.