‘‘తధిత్‌ తకధిం తోం... తాం తధిత్‌ తకధిమితోం...... తత్‌తత్‌ ధిగి.. ధిగి.. తత్‌తత్‌ ధిగి.. ధిగి.. తత్‌తత్‌ ఽధిగి దిగితోం’’ కాలికి గజ్జెకట్టుకుని..ఛెంగు ఛెంగున స్టెప్స్‌ వేస్తూ... పూర్తిగా లీనమై నాట్యం చెయ్యటం... ఇంకా కళ్ళముందునుంచి చెదరలేదు.. ఇప్పుడే పెళ్ళి.. వద్దు.. అంటున్నా.. పెళ్ళి చేశారు... పెద్దలు అందరూ అన్నీ వివరాలు సేకరించి.. చర్చించుకుని... జాతకాలు.. అన్ని.. కలిశాక.. సంబంధం ఖాయం చేశారు. మంచి సంప్రదాయమైన కుటుంబం... అతను సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌, చూడచక్కని రూపం.. ఐదెంకల జీతం... అతన్ని చూశాక.. సుందర్‌ పేరుకు తగ్గ సుందరమైన రూపం.. సమ్మోహనంగా వుండటంతో కారణం దొరకలేదు.. నో.. అనటానికి. అతనూ ఎంతో ఇష్టపడ్డాడు.. పెళ్ళి అనుకున్న, పదిహేను రోజులకల్లా పెళ్ళయిపోయింది. వాళ్ళకి ఇతనొక్కడే కొడుకు. ఇద్దరూ డాక్టర్లే......అమ్మ నాన్న చాలా సంబరపడ్డారు. సహజమేగా! చక్కటి సంబంధం అంటూ బంధువులంతా ఒకటే పొగడ్తల తోటి ముంచేశారు. అంతా నా అదృష్టాన్ని కొనియాడిన వాళ్ళే... తప్ప ఒక్కరూ అతనూ అదృష్టవంతుడే కల్యాణి లాంటి మంచి అమ్మాయి దొరకటం అని.. అనలేదు.. ఘనంగా పెళ్ళిచేశారు. చీర, సారెలతో ఆడంబరంగా అత్త గారింటికి పంపారు... యధావిధిగా ఏలోటు చెయ్యలేదు.. అమ్మ హౌస్‌ వైఫే.. నాన్న డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌.. నా తర్వాత నాకు తమ్ముడున్నాడు, వాడింకా చిన్నవాడు. చదువుకుంటున్నాడు. 

నాట్యం అన్నది నా ఊపిరి అని నాకు నన్ను మానేయమనే వరకు తెలీలేదు. పుట్టింట్లో ఎవరూ దేనికి నాకు ‘నో’ అనలేదు. ఏదనుకున్నా జరిగిపోయేది.. డిజిప్పాయింట్‌ మెంట్‌ అంటే ఏమిటో తెలీలేదు. డిగ్రీ పూర్తవకుండా ఫైనల్‌ ఇయర్‌లోనే పెళ్ళయిపోయింది. కాలేజ్‌లో నాకు స్పెషల్‌ పర్మిషన్‌ వచ్చింది. ఫైనల్‌ ఎగ్జామ్స్‌ వచ్చి రాస్తే చాలునని! పరీక్షలు రాసేవరకు తనకి సందేహం కూడా రాలేదు. నాట్యం మానేయమంటారని! చూస్తుండగా ఓ సంవత్సరం నాట్యం చెయ్యకుండానే గడిచిపోయింది. చిన్నగా ధైర్యం చేసి శ్రీవారిని అడిగాను ‘నాట్యం’ కంటిన్యూ చేస్తానని..‘‘నో’’ అని ఓ గావుకేకపెట్టారు. తెల్లటి ఆయన మొహం గీసిన కందలా ఎర్రగా ఐపోయింది.‘‘ఎందుకు నో అంటున్నారు???’’ విస్తుపోతూ అడిగాను...‘‘ఎందుకా!? అసలెలా అడుగుతున్నావ్‌? కళారాధనకి సంగీతం నేర్చుకుని వుండాల్సింది, నాట్యం చిన్నపిల్లలు చేస్తుంటే ముద్దుగా వుంటుంది, బాగుంటుంది.. పెద్దవాళ్ళు కాదు..’’ చాలా నెమ్మదిగా నైనా దృఢంగా చెప్పారు.‘‘అదేమిటి? శోభానాయుడు, పద్మజారావ్‌ రాధారెడ్డి.. ఇలా ఎంతమంది లేరు? నాట్యం తప్పు కాదే!?’’ ఇంకా సందేహం తీరక అన్నాను.‘‘నా భార్య పదిమంది ముందు గెంతులేస్తూ నాట్యం చెయ్యటం నాకు నచ్చదు.. చూసే వాళ్ళు నీ నాట్యాన్నికాదు.. నీ శరీరంలో.. వున్న అందాలు ఎలా కదులుతున్నాయో.. అని కామంతో చూస్తారు..’’ కోపంగానే అన్నారు.