పెళ్లి పీటల మీద కూర్చున్నారు వధూవరులిద్దరు. మధ్య మధ్యలో బిజీగా సెల్‌ఫోన్లో మాట్లాడుతూ పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు పురోహితుడు. వచ్చిన అతిథులు పెళ్లి తంతుని దీక్షగా చూస్తున్నారు. ఆడవాళ్లు పట్టుచీరలు, నగలు ధరించి హడావిడిగా ఇటు అటూ తిరుగుతున్నారు.‘మాంగల్యం తంతునా నేనమమజీవన హేతునాకంఠే భధ్నామి సుభగేత్వం జీవ శరదాం శతమ్‌మాంగల్య ధారణ ముహూర్త స్సుముహుర్తోస్తు!’వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు వరుడు. వధూవరుల మీద అందరూ అక్షతలు జల్లారు. పెళ్లి కూతురు తల్లీ, అన్న కూడా అక్షతలు జల్లుతుంటే పెళ్లికూతురు అన్న వైపు కూృరంగా చూసింది. తరువాత స్వప్న అత్తగారు పెళ్లికూతురు దగ్గరకొచ్చి, ‘అమ్మా, స్వప్నా! నా కోడలి మెడలో తరతరాలుగా వస్తున్న ఈ చంద్రహారం వెయ్యాలని ఎన్నాళ్లనించో అనుకుంటున్నామ్మా. ఇన్నేళ్లకి ఆ కోరిక తీరింది’ అంటూ రాళ్ల లాకెట్టుతో వున్న అయిదు పేటల చంద్రహారం వెయ్యబోతుంటే పెళ్లికూతురు అత్తగారిని గట్టిగా వాటేసుకొని, ‘‘ఆంటీ! మీరే కదూ, ‘ఆనంద్‌’ సినిమాలో రాహుల్‌ తల్లిగా నటించారు? అబ్బా! మీ నటన సూపరుందాంటీ! నేను అప్పట్నించీ మీ ఫేన్‌నైపోయానంటే నమ్మండి. అసలు మిమ్మల్ని చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ‘ఆనంద్‌’లో హీరోయిన్‌ వాళ్లమ్మ చీర సెంటిమెంట్‌గా కట్టుకుందామనుకుంటే మీరు వల్లకాదు, నే చెప్పినట్లు వినాలన్నారు. 

ఇప్పుడు తరతరాల సెంటిమెంటు పెట్టి ఈ అయిదు పేటల చంద్రహారం నా మెడలో వేస్తున్నారు.’’‘‘కట్‌..... కట్‌..... కట్‌..... కట్‌......! ఏమ్మా, ఏంటి? ఓ మూల సినిమా షూటింగ్‌ జరగుతుంటే, యాక్షన్‌ చేయకుండా ఏవేవో మాట్లాడేస్తున్నావు? ఆమె మీద అభిమానం వుంటే పేకప్‌ చెప్పాక నీ ప్రేమనంతా కురిపించుకో. ఇందాకేమో నీ అన్నగా వేస్తున్న హీరో నీ మీద అక్షతలు జల్లుతుంటే బాధగా ఏంటలా చూస్తున్నావు? యాక్షన్‌ అన్నప్పుడు మేం చెప్పినట్టే చెయ్యాలి. కట్‌ అన్నప్పుడు మామూల స్థితిలోకి రావాలి. ఛా! కొత్తోళ్లతో సినిమా తీస్తే ఇలాగే ఏడుస్తుంది, చెప్పలేక చావాలి. వాళ్లకి అర్థమై చావదు. నువ్వు చేసిన దానికి ఎంత టైము వేస్టో..ఎంత రీలు వేస్టో! ఈ పెళ్లి సెట్‌కి ఎంత డబ్బు ఖర్చో తెలుసా?’’ అంటూ నిర్మాత కోపంగా వెళ్లిపోయాడు.ఈ అనుకోని సంఘటనకి మిగతా ఆర్టిస్టులు, టెక్నీషీయన్సు కూడా తెల్లబోయారు. నిర్మాత, డైరక్టరు తిట్టేసరికి ఏడుపు లంకించుకుంది విశాలి.‘‘ఏమయ్యా, అసిస్టెంటు డైరక్టరూ! ఇలాంటివన్నీ నువ్వు చూసుకోవాలి. నువ్వూ కొత్తోడివేనా? అమ్మా, రాగసుధగారూ! ఆ అమ్మాయికి ఊరడించి ధైర్యం చెప్పండి. కాస్త రిలాక్సవమ్మా. తరువాత మేం ఎలా చెబితే అలా చెయ్యి. అంతేగానీ షూటింగ్‌ టైములో నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకు. ఎందుకలా డల్‌గా వున్నావు. ఏదో పోగొట్టుకుంటున్నట్లు? ఇష్టపడే వచ్చావుగా ఈ ఫీల్డ్‌లోకి? హ్యాపీగా వుండు. హీరోగారేరి? ఆ... మోహన్‌గారూ! మీరుండండి. మీమీద, హీరోయిన్‌ షకీలా మీద చిన్న షాట్‌ తియ్యాలి!’’