ఉద్యోగికి రిటైర్మెంటు పెద్ద శాపం. కాని తప్పదు. ఇప్పుడు రామచంద్రం పరిస్థితి అలాగే ఉంది. ఉద్యోగంలో ఒళ్ళు దాచుకోకపోవడం ప్రస్తుతం మరీ విసుగు కలిగిస్తోంది. ఇంచుమించు మూడువేల మంది దాకా ఉండే ఆఫీసులో, పనిచేసే వాళ్ళు సగం మంది కూడా ఉండరు. వారిలో సిన్సియర్‌గా పనిచేసేది మాత్రం నూరుమంది. రామచంద్రానికి ఇరవైలోపే సంఖ్య ఇవ్వాలి మరి! బద్ధకంగా, బలాదూర్‌గా తిరిగే వారికి టైం గడుస్తుంది, కానీ రామచంద్రానికి కాలం కదులుతున్నట్టుగా కనిపించటం లేదు. అయినా పద్దెనిమిది నెలలు భారంగానే దొర్లాయి. వయసుతోపాటు కోపం, ఆందోళన, బెంగపట్టుకున్నాయి. ఏదో పని - వ్యాపకం ఉంటే ఆ దారి వేరు. ఆనందం, సంతోషం, తృప్తి లభిస్తుంది.అక్కడికీ కాంతం చేసే పనులు చాలామటుకు తనే చేస్తుంటాడు. ‘‘మీకెందుకు... ఎవరైనా చూస్తే బాగుండదు’’ అంటుంది కాంతం.

‘‘ఎందుకు బాగోదు. ఇల్లు తుడవడం, బట్టలు ఉతికి ఆరేయటం, నీళ్ళు పట్టడం, కూరలు తరగడం, కాఫీ కాయడం... ఇవన్నీ కష్టమైన పనులేం కాదు. కాలక్షేపంగానూ, నీకు సాయపడుతున్నట్లుగానూ ఉంటుంది’’ అంటాడు తను.అక్కడికీ కాలనీలో కొందరు ఆడవాళ్ళు కాంతంతో ‘‘మీ వారు ఎంచక్కగా అన్ని పనులూ చేసి పెడతారు. పనిమనిషి ఖర్చు కూడా లేదు’’ అనేవారు.కాంతం సిగ్గుపడేది, ఏ జవాబూ చెప్పకుండానే అప్పుడప్పుడు బాధగానూ ఉండేది. ‘‘చూడు కాంతం... వాళ్ళంతా డాలర్ల మోతతో వెర్రి కబుర్లు చెప్తారు. బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం మరిగినవారు. డబ్బున్నవాళ్ళు ఏం చేసినా, మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటారు.

నువ్వు సరిగ్గా జవాబు చెబితే మళ్ళీ మాట్లాడతారా...?’’ అనేవాడు రామచంద్రం.‘‘మరి ఏం జవాబు చెప్పాలంటారు?’’‘‘ఆ మేధావులు కదలలేరు, నడవలేరు, కూర్చోలేరు. సిలిండర్లలాగా శరీరం పెరిగిపోతుంది. పని చేయడం మాట అటుంచి అన్నం కూడా తినలేరు. నోట్లు తరిగిపోతాయి. ఎంతసేపూ బంగారం కొనడం, చీరలతో సింగారించుకోవడంతో సరిపోతుందా? ఆ భారీ శరీరాలకు ఎంత అలంకారం చేసినా నీలాగ ఉంటారా... కనిపిస్తారా...’’ అంటూ నవ్వేశాడు.అంతలో ఫోను రింగైంది. రామచంద్రం ఫోను అందుకున్నాడు.‘‘ఏం సార్‌, వస్తానన్నారు, రానేలేదు’’ అవతలి గొంతు అడిగింది.