ఆదివారం, మధ్యాహ్నామంతా రేవతి పెళ్లి గురించిన చర్చ సాగింది. మేనబావ సుందర్‌ని పెళ్లి చేసుకోమని పట్టుబట్టారంతా. సాయంత్రం నాలుగ్గంటల వరకూ ఇదే వరస.‘‘మీరు ఎన్నయినా చెప్పండి! నేను సుందర్‌ బావను చేసుకోను. పేరుకి ఎంబిఏనే, కానీ మంచి ఉద్యోగం లేదు; రాదు కూడా. గల్లీగల్లీకీ ఎంబిఏలే’’ కుండబద్దలు కొట్టింది రేవతి. తల్లి కామేశ్వరి, తండ్రి శివరావు, తమ్ముడు సుధాకర్‌-ఆమె నిర్ణయాన్ని విని ఊరుకున్నారు.తల్లీదండ్రీ రేవతీ మేరేజ్‌ బ్యూరోకి బయల్దేరారు. సుధాకర్‌ రానన్నాడు. ఇంట్లో నుంచి బయటకి వస్తూ చెప్పింది రేవతి, ‘‘ఠాఠ్‌! ఈ సంబంధాలు చూడకండి. చెప్పాను గదా! వయస్సు ఇరవై నాలుగు ప్లస్‌, అంతే! ప్యాకేజీ మినిమమ్‌ లక్షన్నర డాలర్లకి తక్కువ ఉండకూడదు.’’ మాటలు దృఢంగా, ఖరాఖండీగా ఉన్నై.శివరావేమీ విస్తుపోయి చూడలేదు. కామేశ్వరీ ఏమీ కళ్లు విచ్చుకుని చూడలేదు. ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ‘‘అదుపు లేని గుర్రాలు అగడ్తలు దాటతాయంటారు మరి’’ గొణిగాడు శివరామ్‌. ‘‘భయమూ లేదు...భక్తీ లేదు.. ..పెంకి ఘటం’’ భర్తకి మద్దతుగా తన మాటల్నీ కలిపింది కామేశ్వరిఆటో రిక్షా పోతోంది....దారిలో ఎవరూ ఎవరితోనూ మాట్లాడటం లేదు.

మొన్న బిటెక్‌ అయింది...నిన్న ఉద్యోగంలో చేరింది...ఇవ్వాళ ఇదీ వరస. ఇంటర్‌ దాకా పల్లెత్తి పలికేది కాదీ పిల్ల. లంగావోణీతో జూనియర్‌ కాలేజీకి వెళ్లొచ్చేది. ఇంతలోనే ఎంత ఎదిగిపోయింది! వేషంలోనూ, భాషలోనూ ఆశ్చర్యకరమైన పరిణామం! ఆశలూ,ఆశయాలూ చెప్తోంది. జీవితం గురించీ, ఈ కాలం అవసరాల గురించీ వెయ్యి ఆలోచనలు వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తూ, భద్రతా అంటూ ఊహలకు రెక్కలు తొడుగుతోంది.శివరావ్‌ మనస్సులో ఇంతింత ఆశ్చర్యం. మేనల్లుడు సుందర్‌ ఎంబిఏ ఫైనాన్స్‌. ఏదో ఒక కంపెనీలో మంచి ఉద్యోగమే. అతని స్టేటస్‌ ఈ పిల్లకి ఆనటం లేదు! బావగారికి వైజాగ్‌లో గవర్నమెంట్‌ జాబ్‌.ఏకులాంటి పిల్ల మేకులా తయారైంది. కొరకరాని కొయ్య. ముందు ముందేం జరగనుందో’ కామేశ్వరి మనసులో దిగులు!‘అమ్మా.. నాన్నా.. తమ్ముడూ.. నా గురించి ఏమన్నా అనుకోనీ, నా బాగు నాకు ముఖ్యం. నా కిష్టమైనట్టు నేనుంటాను’ రేవతి మనసులో నిశ్చయం. గంభీరంగా కూర్చుంది.ఆలోచనల్లోంచీ తేరుకుని ‘పక్కగా ఆపు’ అన్నాడు శివరావ్‌. ఆటో ఆగింది. దిగారు. ఎదురుగానే మేరేజ్‌బ్యూరో ఆఫీసు.నడి వయస్సు మహిళ ఇన్‌ఛార్జ్‌. పేరు వసంత. కొన్ని సంబంధాలు చెప్పింది. కొన్ని కేసులు చూపింది. కొన్ని కాగితాలు వీళ్ల ముందు పెట్టింది. కంప్యూటర్‌లో కొన్ని వివరాలు చూపించింది.‘వయస్సు కుదిరితే ఇన్‌కమ్‌ సరిపోవటం లేదు’ అన్నది వసంత. కుర్చీలో వెనక్కి వాలింది. ‘ప్చ్‌’తో సరిపెట్టేసింది రేవతి. కళ్లతోనే మాట్లాడుకున్నారు ముగ్గురూ. ‘‘వస్తాం, చూస్తూ వుండండి..ఏదైనా తగిలితే చెప్పండి.’’ అని కదిలాడు శివరావ్‌. తల్లీకూతురూ ఆయన్ని అనుసరించారు.