రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అతనికి నవ్వడం ఒక స్వభావమైపోయినట్టూ, కష్టాలూ, చీకాకులూ అతనికి దూరంగా తొలగి వుంటాయన్నట్టు అనిపిస్తుంది. ఊళ్ళో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు. అందరూ అతనికి స్నేహితులు.అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్ళంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండవంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలాఉన్నాయి. కాని ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమై పోతాయి.కాని, మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాదరేఖ గానీ, విసుగుగానీ కనిపించవు? ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరుచుకున్నాడు?తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు.

 ఆస్తీ, హోదా ఉన్నవాడు కాదు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ‘నా’ అన్న వాళ్ళెవరూ ఉన్నట్టు కనబడరు. అతను ఒంటిరివాడు. ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి లోనయిందనీ ప్రయాణీకులకి చాలామందికి గాయాలు తగిలాయనీ విన్నాడు మూర్తి. వారిలో రామచంద్రరావు ఒకడని తెలిసినప్పుడు బాధపడ్డాడు. మూర్తి కంగారు పడ్డాడు. సరాసరి టిక్కెట్టు కొనుక్కుని ఏలూరు వెళ్ళి ఆస్పత్రికి వెళ్ళాడు. గాయపడిన వారిలో రామచంద్రరావును గుర్తించడం కష్టమయింది. అతని తలకీ, చెంపలకీ కట్లు ఉన్నాయి. అతనికి స్పృహలేదు. మూర్తి గాభరా పడ్డాడు. తక్కిన గాయపడిన వారందరి దగ్గరా వారివారి భార్యలూ, తల్లిదండ్రులూ ఉన్నారు. రామచంద్రరావు మాత్రం వొంటరిగా మృత్యువుకీ, బ్రతుకీకీ మధ్య ఉన్న మసకమసక అంచుమీద ఉన్నాడు. మూర్తికి కళ్ళనీళ్ళు తిరిగాయి. ఇంత ఉత్తముడికి ఎందుకిటువంటి గతి పట్టింది అనుకున్నాడు.

అతని మంచం ప్రక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి. స్పృహ రాగానే - తనని చూస్తాడనీ, కావలించుకుని ఏడుస్తాడని అనుకున్నాడు. తనకి ఏడుపు వచ్చేస్తుంది. ఎలాగ ఇతనికి ధైర్యం చెప్పి వోదార్చడం? ఎప్పటికోగాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు. అతడు కదలడం మొదలు పెట్టాడు. మూర్తి గుండెలు కొట్టుకున్నాయి. దుఃఖంతో ఆనందావేశంతో రామచంద్రరావు కళ్ళు తెరిచాడు. ఓ నిముషం తదేకంగా మూర్తికేసి చూశాడు. ‘బతికే ఉన్నానా’ అంటూ నవ్వాడు. సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గవిడి తెల్లని పువ్వు రేకులను విచ్చుకుంటూన్నట్టు.