ఆ ఉదయం కూడా ఆనంద్‌ నా కంటపడీపడగానే ‘‘ఏరా! ఏదన్నా ఇల్లు అద్దెకి దొరికిందా?’’ అని అడిగాను. మామూలుగా అయితే హైదరాబాద్‌లో తక్కువ అద్దెకి ఇల్లు దొరకడం ఎంత కష్టమో, నా కోసం ఇంటిని వెతకడం ద్వారా ఎంత మహోపకారం చేస్తున్నాడో, అంచేత నేనూ నా భార్యాబిడ్డలు ఆజన్మాంతమూ తనకెంత రుణపడి ఉండాలో చెప్పేవాడు గానీ... అదృష్టవశాత్తూ ఇవాళ ఉపోద్ఘాతం లేకుండానే విషయ ప్రవేశం చేశాడు.‘‘మా ఇంటికి దగ్గరలోనే ఒక వాటా ఖాళీ అయ్యిందిరా. ఆ ఇంటి ఓనరు కనకయ్యగారని, మన ఆఫీసులోనే పనిచేసేవారు. వాలంటరీ తీసుకుని ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు, మహాబద్ధకిష్టనుకో!’’‘‘వాలంటరీ తీసుకున్నంతమాత్రాన బద్ధకిష్టులవుతారా ఏంటి? అయినా ఆయన బద్ధకంతో మనకేంటి సంబంధం, మన పోర్షనులో మనం పడుండేదానికి’’ అంటూ నాకు కాబోయే ఓనరుగారిని వెనకేసుకొచ్చాను.‘‘నేను బద్ధకం అన్నది ఆయన రిటైర్‌మెంట్‌ గురించి కాదబ్బాయ్‌! ఆయన గురించి ఎరిగిన వారమంతా సందేహాతీతంగా అనుకునే మాట అది. ఆఫీసులో పనిచేసినన్నాళ్ళూ ఇటు ఫైలు తీసి అటు పెట్టి ఎరగడు.

గంట లేటుగా వచ్చి గంట ముందుగా వెళ్ళేవాడు. ఈ మధ్యలో టీలనీ, భోజనాలనీ, బాతాఖానీ అనీ అటూ ఇటూ తిరుగుతుండేవాడు. సీట్లో కూర్చునే ఒక్క గంటా కూడా పేపర్‌ చదువుతూ గడిపేవాడు. కనీసం ఇన్‌స్పెక్షన్లపుడో, ఇయర్‌ ఎండింగ్‌లోనే పనిచేస్తాడా అంటే ఠంచనుగా ఎవరో ఒకరు పోయారని సెలవు పెట్టేసేవాడు. అలా వాళ్ళ అత్తగారు, మామగారు కనీసం ఏడెనిమిదిసార్లన్నా పోయుంటారు’’ అని పాత రోజుల్ని కసిగా గుర్తు తెచ్చుకుంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్‌.‘‘వెరీ ఇంటరెస్టింగ్‌ క్యారెక్టర్‌’’ అన్నాను ఆ మహానుభావుడిని ఊహించుకుంటూ. ఎదుటివారిలోని సద్గుణాలని చూసి ఈర్ష్యపడడం, బలహీనతలని చూసి ముచ్చటపడడం మనకి అలవాటేగా!‘‘ఎంత ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టరో నీకే తెలుస్తుందిలే’’ అన్నాడు ఆనంద్‌ నా ప్రతిస్పందనకి ఉడుక్కుంటూ.ఆ మర్నాడు ఉదయం తొమ్మిదింటికల్లా ఆనంద్‌ని తీసుకుని కనకయ్యగారి ఇంటికి చేరుకున్నాను. అన్ని ఇళ్ళకి మల్లేనే ఉంది ఆ ఇల్లూ... కాకుంటే కాసింత భిన్నంగా! గేటు ఉంది కానీ గొళ్ళెం బిగుసుకుపోయి ఉంది, ఆవరణలో మొక్కలున్నాయి కానీ వడిలిపోయి ఉన్నాయి, డోర్‌బెల్‌ ఉంది కానీ మోగలేదు... ఓ నాలుగైదుసార్లు గట్టిగా తలుపులు బాదిన తర్వాత లోపల్నుండి ఎవరో భారంగా అడుగులు వేసుకుంటూ వస్తున్న అలికిడి వినిపించింది. ఆ తరువాత తలుపుని ఓరగా తీసి ఓ స్త్రీమూర్తి బయటికి తొంగిచూసింది.